సరికొత్త బ్రహ్మోస్ క్షిపణి పరీక్షలు విజయవంతం

ABN , First Publish Date - 2022-01-20T21:43:46+05:30 IST

అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది

సరికొత్త బ్రహ్మోస్ క్షిపణి పరీక్షలు విజయవంతం

న్యూఢిల్లీ : అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలాసోర్ తీరంలో ఈ పరీక్షను గురువారం నిర్వహించారు. దీనికి అత్యాధునిక సాంకేతికతలను జోడించారు. వీటి సామర్థ్యం విజయవంతంగా రుజువైంది. రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ ఈ వివరాలను తెలిపింది. 


బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్‌ను జనవరి 11న భారత నావికా దళం కూడా పరీక్షించిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక నుంచి దీనిని పరీక్షించారు. సముద్రం నుంచి సముద్రంపైగల లక్ష్యాలను ఛేదించే అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్‌సానిక్ క్రూయిజ్ మిసైల్ వేరియంట్‌ను పరీక్షించినట్లు రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అధికారి ఒకరు తెలిపారు. లక్ష్యంగా ఏర్పాటు చేసిన నౌకను ఇది అత్యంత కచ్చితంగా ఢీకొట్టిందని తెలిపారు. 


భారత్, రష్యా కలిసి ఈ క్షపణిని తయారు చేశాయి. భారత దేశానికి డీఆర్‌డీవో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ఇటీవలే భారత నావికా దళంలో చేర్చారు. 


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బ్రహ్మోస్, డీఆర్‌డీవో, పారిశ్రామిక రంగాలను ప్రశంసించారు. బ్రహ్మోస్‌ పరీక్షలు విజయవంతమైనందుకు అభినందించారు. 


ఆయుధ వ్యవస్థల సమర్థతను గరిష్ఠ స్థాయికి పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను డీఆర్‌డీవో చైర్మన్ డాక్టర్ జీ సతీశ్ రెడ్డి అభినందించారు. 


భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకల్లో ప్రధాన ఆయుధ వ్యవస్థ బ్రహ్మోస్. సముద్రం లోపలి భాగంలో పని చేయగలిగే బ్రహ్మోస్ క్షిపణి వెర్షన్‌ను కూడా అభివృద్ధిపరుస్తున్నారు. వీటిని భారత దేశ జలాంతర్గాముల్లో మాత్రమే కాకుండా మిత్ర దేశాలకు ఎగుమతి కూడా చేస్తారు. 


Updated Date - 2022-01-20T21:43:46+05:30 IST