ప్రాణానికి పరీక్ష

ABN , First Publish Date - 2021-05-02T06:16:44+05:30 IST

పరీక్షల్లో మందగమనం.. ఫలితాల్లో జాప్యం ఫలితంగా కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది.

ప్రాణానికి పరీక్ష
టెస్ట్‌ల కోసం వచ్చి ఒంగోలులోని రిమ్స్‌లో చెట్ల కింద నిల్చొని ఉన్న కరోనా అనుమానితులు

రిమ్స్‌ పరీక్షా కేంద్రంలో  పేరుకుపోతున్న శాంపిల్స్‌

కొన్నిప్రాంతాల నమూనాలకు వారం తర్వాత పాజిటివ్‌గా వెల్లడి

ఈలోపు అనేకమందికి  వైరస్‌, బాధితులకు సీరియస్‌

కుటుంబాలకు కుటుంబాలు కరోనా బారిన పడుతున్న వైనం

తాజాగా ఆర్డీటీ, ట్రూనాట్‌ టెస్టులు ప్రారంభం

జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతున్న వేళ టెస్ట్‌ల కోసం ఆస్పత్రులకు జనం పోటెత్తుతున్నారు. అయితే వారందరికీ ఏరోజుకారోజు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు వీఆర్‌డీఎల్‌ మాత్రమే నిర్వహిస్తుండగా ఆ ల్యాబ్‌ కేవలం ఒంగోలు రిమ్స్‌లో మాత్రమే ఉంది. అక్కడి సామర్థ్యం మించి శాంపిల్స్‌ వస్తుండటంతో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. నిత్యం వేలాది నమూనాలు నిలిచిపోతున్నాయి. దీంతో ఫలితాల వెల్లడి జాప్యమవుతోంది. కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న శాంపిల్స్‌కు వారంరోజుల తర్వాత పాజిటివ్‌గా సమాచారం వస్తోంది. ఈలోపు సదరు వ్యక్తి వల్ల వారి కుటుంబసభ్యులు, సమీప వ్యక్తులకు వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. మరోవైపు లక్షణాలు లేవన్న భావనతో చికిత్సల్లో జాప్యం చేస్తుండటంతో పరిస్థితి విషమించి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలూ ఉన్నాయి. మరి అధికారులు వెంటనే స్పందించి దీనికి పరిష్కారం చూడాలి. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 

ఒంగోలు, మే 1 (ఆంధ్రజ్యోతి) : పరీక్షల్లో మందగమనం.. ఫలితాల్లో జాప్యం ఫలితంగా కరోనా వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. జిల్లాలో సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయలో ఉంది. వైరస్‌వ్యాప్తి నివారణ, బాధితులకు చికిత్స విషయంలో తొలుత జిల్లా యంత్రాంగం కాస్తంత నిర్లప్తంగా వ్యవహరించినప్పటికీ  ఆనక తేరుకుని తగు చర్యలపై దృష్టిసారించింది. అయితే కీలకమైన వైరస్‌ సోకిన వారిని గుర్తించే టెస్టులు, తక్షణం వాటి ఫలితాల వెల్లడి మందకొడిగా సాగుతోంది. కొవిడ్‌ పరీక్షా ఫలితాలు శాంపిల్స్‌ తీసిన 24 గంటల్లోనే వెల్లడించి బాధితులకు చికిత్సలు చేస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా ఆ పరిస్థితి జిల్లాలో ఎక్కడా కనిపించ లేదు.


మొదటి నుంచీ వీఆర్‌డీఎల్‌నే

రెండో వేవ్‌ తీవ్రత పెరిగినప్పటికీ రెండు రోజుల క్రితం వరకు వీఆర్‌డీఎల్‌ పరీక్షలకే యంత్రాంగం పరిమితమైంది. ఆ సౌకర్యం ఒంగోలు రిమ్స్‌లో మాత్రమే ఉంది.  దీంతో జిల్లాలో ఎక్కడ ఆస్పత్రుల్లో  శాంపిల్స్‌ తీసినా ఒంగోలు రిమ్స్‌ ల్యాబ్‌కే పంపడం, ఇక్కడే టెస్టు చేయాల్సి రావడంతో ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరిగింది. సాధారణంగా రిమ్స్‌లోని ల్యాబ్‌లో రెండు మిషన్లు, పది మంది సిబ్బంది ఉన్నారు. అక్కడ రోజుకు 4వేల శాంపిల్స్‌ పరీక్ష చేయగలుతారు. అయితే ఏప్రిల్‌ రెండో పక్షం నుంచి నిత్యం ఐదారువేల శాంపిల్స్‌ ల్యాబ్‌కు చేరుతున్నాయి. ఒక్క రిమ్స్‌ వద్దనే నిత్యం వందల మంది క్యూలో టెస్టుల కోసం నిలబడుతున్నారు. ఇలా వేలాది శాంపిల్స్‌ వస్తుండటంతో పరీక్షలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని ప్రాంతాల నుంచి వస్తున్న శాంపిల్స్‌కు అయితే ఐదు నుంచి ఏడు రోజుల వరకు సమయం పడుతుండటంతో ఈలోపు వైరస్‌ సోకిన వారు తెలియక మిగతా వారికి అంటిస్తున్నారు. అదేవిధంగా వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించి అపాయకర పరిస్థితికి చేరుతున్నారు. 


ఫలితాల జాప్యంతోనే పర్చూరులో మరణాలు

పర్చూరు ప్రాంతంలో కొవిడ్‌ తీవ్రతకు ఫలితాల్లో జాప్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పర్చూరులో ఒక వ్యక్తి గతనెల 14న అక్కడి సీహెచ్‌సీలో కరోనా టెస్టు చేయించుకోగా అతనికి వైరస్‌ సోకినట్లు 29న సమాచారం వచ్చింది. అదేరోజు సదరు వ్యక్తి చనిపోయాడు. అయితే గుండెపోటుతో మృతి చెందాడని అంత్యక్రియలకు సిద్ధం చేసే సమయంలో టెస్ట్‌ రిపోర్టు వచ్చింది. పాజిటివ్‌ అని రావడంతో బంధువులంతా వెళ్లిపోయారు. అదే గ్రామంలో మరో యువకుడు గతనెల 22న టెస్టు చేయించుకోగా శనివారం పాజిటివ్‌గా సమాచారం వచ్చింది. అతని ఆరోగ్యం క్షీణించడంతో 108లో చీరాలలోని వైద్యశాలకు తరలించారు. కనిగిరిలో ఒక కుటుంబంలోని వారు వారంక్రితం కరోనా అనుమానంతో టెస్టు చేయించుకున్నారు. లక్షణాలు అంతగా లేకపోవడంతో సాధారణంగానే తిరిగారు. తీరా వారికి వైరస్‌ సోకినట్లు సోమవారం సమాచారం అందింది. దీంతో వైద్యం కోసం కుటుంబసభ్యులు అంతా గుంటూరు వెళ్లిపోగా వీధి మొత్తాన్ని అధికారులు బ్లాక్‌ చేశారు. దర్శి ప్రాంతంలో ప్రస్తుతం 1,240 శాంపిల్స్‌ రిపోర్టులు పెండింగ్‌లో ఉండగా అందులో వారంక్రితం వచ్చినవి కూడా ఉన్నట్లు సమాచారం. ఇలాగే కొన్ని చోట్ల పరిస్థితి కనిపిస్తోంది. 


పట్టణాల్లో పరిస్థితి తీవ్రం

ఒంగోలు, చీరాల, కందుకూరు,. అద్దంకి, మార్కాపురం ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. దీనిని రెండురోజుల క్రితం గుర్తించిన అధికారులు గతంలో వలే ఆర్డీటీ, ట్రూనాట్‌ టెస్టులు మళ్లీ ప్రారంభించారు. ఒంగోలు రిమ్స్‌లో వీఆర్‌డీఎల్‌ టెస్టుల కోసం వచ్చిన శాంపిల్స్‌ దాదాపు 13వేల వరకు ఉండటంతో ఇక కొత్త శాంపిల్స్‌ తీసుకోవడం ఆపేశారు. మూడురోజుల్లో వీటి పరీక్షలు పూర్తి చేసిన తర్వాతనే కొత్త టెస్టులు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయంలో జిల్లావ్యాప్తంగా శుక్రవారం నుంచి ర్యాపిడ్‌, ట్రూనాట్‌ టెస్టులు చేపట్టారు. దీంతో భారీగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. జిల్లాలో శనివారం ఉదయం 9గంటలకు 24గంటల వ్యవధిలో 1,106 కేసులు నమోదయ్యాయి. అందులో 596 వీఆర్‌డీఎల్‌ పరీక్షల్లో బయటపడగా 469 ర్యాపిడ్‌, మరో 41 ట్రూనాట్‌ పరీక్షల్లో వెలుగుచూశాయి. రానున్న వారంరోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉండనుంది. ఆ మేరకు చికిత్స కోసం వచ్చే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. దీనిని గుర్తించిన కలెక్టర్‌ పోలా భాస్కర్‌ శనివారం రిమ్స్‌ను సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆస్పత్రిలో చేర్చడం కాకుండా వైద్యులు పరిశీలించి సీరియస్‌ అనుకున్న వారినే చేర్చుకొని మిగతా వారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు లేదా హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చే యాలని సూచించారు. అలాంటి వారిని నిరంతరం వైద్యులు పర్యవేక్షించాలన్నారు. 


Updated Date - 2021-05-02T06:16:44+05:30 IST