విషమ పరీక్ష

ABN , First Publish Date - 2021-10-22T06:48:03+05:30 IST

జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో గురువారం నిర్వహించిన నిర్మాణాత్మక మదింపు-1 పరీక్షల విధానం ఉపాధ్యాయుల, విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టింది.

విషమ పరీక్ష
ఒకటో తరగతి ప్రశ్నపత్రం

ప్రశ్నపత్రాలు లేకుండా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు

గంట ముందు ఉపాధ్యాయుల వాట్సాప్‌కు ప్రశ్నపత్రాలు

జిరాక్స్‌ తీయించుకునే అవకాశమే ఉండదు

బోర్డుపై ఐదు తరగతుల ప్రశ్నపత్రాలు రాయాలి

విద్యార్థులు ప్రశ్నలను, జవాబులను రాయాలి

ఒకటో తరగతి విద్యార్థులు బొమ్మలతో కూడిన ప్రశ్నలు రాయగలరా?


జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో గురువారం నిర్వహించిన నిర్మాణాత్మక మదింపు-1 పరీక్షల విధానం ఉపాధ్యాయుల, విద్యార్థుల సహనానికి పరీక్ష పెట్టింది. విద్యార్థుల చేతికి ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా, బోర్డ్డుపై రాయాలనే నిబంధన పెట్టారు. ఈ విధానం ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది. బోర్డుపై రాసిన ప్రశ్నలను రాసుకుని, వాటి కింద జవాబులను రాసేందుకు విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. 


ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం : జిల్లాలో గురువారం ప్రారంభమైన నిర్మాణాత్మక మదింపు-1 పరీక్షల విధానం ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులను, విద్యార్థులను కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఐదు తరగతులున్న పాఠశాలలో ఒక్కో తరగతికి సంబంధించిన ప్రశ్నపత్రం బోర్డుపై రాసేందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుందని, ఇలా ఐదు తరగతుల ప్రశ్నలు రాసేందుకే చాలా సమయం పడుతుందని ఉపాధ్యాయులు అంటున్నారు. తరువాత విద్యార్థులు ఆ ప్రశ్నలను రాసుకుని, జవాబులు రాయాలంటే ఇంకెంత సమయం పడుతుందో ఆలోచించాలని అధికారులను కోరుతున్నారు.


ప్రశ్నపత్రం ముందు రోజు పంపితేనే మేలు

 ప్రశ్నపత్రాలను ఒకరోజు ముందుగానే వాట్సాప్‌కు పెడితే, పాఠశాలకు వెళ్లేముందే తాము జిరాక్స్‌ తీసుకుని వెళ్లే అవకాశం ఉంటుందని, అలా కాకుండా పాఠశాలకు వెళ్లిన తరువాత ప్రశ్నపత్రాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో జిరాక్స్‌ సెంటర్లు ఉండేది చాలా తక్కువని, దీంతో ఐదు తరగతులకు సంబంధించిన ప్రశ్నపత్రాలు బోర్డుపై రాయడానికే సమయం చాలా వెచ్చించాల్సి వస్తోందని చెబుతున్నారు. విద్యార్థులు ఆ ప్రశ్నలను తిరగరాసుకుని, సమాధానాలు రాసేందుకు ఇంకా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


చిన్నారులకు ఎంత కష్టం!

 కొవిడ్‌ కారణంగా తరగతులు సక్రమంగా జరగకపోవడంతో 1, 2 తరగతుల విద్యార్థులు అక్షరాలు మరచిపోయారు. ఒకటో తరగతి విద్యార్థులు పాఠాలు అప్పజెబుతారు కానీ రాయడం కష్టమే. అటువంటి విద్యార్థులు ప్రశ్నపత్రాన్ని రాసుకోగలరా? పైగా వీరి ప్రశ్న పత్రంలో బొమ్మలతో కూడిన ప్రశ్నలుంటాయి. ఆ బొమ్మలు వేసి, జవాబులు రాయడం చిన్నారులకు ఎంత కష్టమో అధికారులకు తెలియదనుకోవాలా? గురువారం నిర్వహించిన పరీక్షకు సంబంధించి, ఒకటో తరగతి తెలుగు ప్రశ్నపత్రంలోని రెండో ప్రశ్నలో పడవ, పనస, వడ బొమ్మలను ఇచ్చి, వాటి పక్కనే పేర్లను గజిబిజిగా ఇచ్చారు. చిత్రాన్ని బట్టి, సరైన పదాన్ని జత చేయాల్సి ఉంటుంది. విద్యార్థి చేతిలో ప్రశ్నపత్రం ఉంటే వాటిని జత చేయడం సులభమవుతుంది. కానీ, టీచరు ఆ బొమ్మలను బోర్డ్డుపై గీస్తే, ఒకటో తరగతి విద్యార్థులు వాటిని మళ్లీ, తన జవాబు పత్రంలో గీయడం, వాటిని జత చేయడం సాధ్యమయ్యే పనేనా? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అదే తరగతి ప్రశ్నపత్రంలో ఆరో ప్రశ్నగా తెరచాపతో ఉన్న పడవను చుక్కల రూపంలో ఇచ్చారు. ఆ చుక్కలను కలిపి, రంగులు వేసి, అది ఏమిటో పేరు రాయాలని సూచించారు. ఈ చుక్కలతో ఉన్న పడవను 1వ తరగతి విద్యార్థులు వేయగలరా? ఈ విద్యార్థులకు దాదాపు అన్నీ ఇటువంటి ప్రశ్నలే. ఎలా రాయగలరు? ఇక రెండో తరగతి ప్రశ్నపత్రంలోని మూడో ప్రశ్నలో 12 గడుల్లో అక్షరాలు గజిబిజిగా ఇచ్చి, పక్కనే సరైన పదాలు రాయాలని సూచించారు. రెండో తరగతి విద్యార్థులు ఈ గడులను సరిగా గీసి, అందులో ఉన్న అక్షరాలను ఎంతవరకు రాస్తారనేది ప్రశ్నార్థకమే.  ఇక నాలుగో ప్రశ్నలో ఆకుతోకలిపి  ఉన్న జామకాయ బొమ్మను ఇచ్చి, దానికి రంగులు వేసి పేరు రాయాలని ప్రశ్న ఇచ్చారు. ఈ బొమ్మను ఎంతమంది విద్యార్థులు వేయగలరు? అన్ని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.


ప్రశ్నపత్రాలు ఇవ్వడానికి ఇబ్బందేమిటో!

 ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా పరీక్షలు పెట్టడం పెద్ద ప్రహసనం. దానికి తోడు గంట ముందు టీచర్ల వాట్సాప్‌కు ప్రశ్నపత్రాలు పంపి వాటిని బోర్డ్డుపై రాయాలని చెబుతున్నారు. ఒకరోజు ముందుగానే ప్రశ్నపత్రం ఇస్తే వాటిని ప్రింట్‌ తీయించి విద్యార్థులకు ఇస్తామని, అలా చేస్తే ఇబ్బందులు ఉండవని టీచర్లు అంటున్నారు. అధికారులు దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Updated Date - 2021-10-22T06:48:03+05:30 IST