పోలీస్ ఇంట్లో చోరీ.. దొంగ చేసిన పనికి ప్రపంచమంతా షాక్!

ABN , First Publish Date - 2021-03-28T00:13:19+05:30 IST

దొంగతనానికి వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయిన దొంగలను చూశాం..! దొంగతనంతో పాటూ పనిలోపనిగా..అక్కడే కడుపునిండా భోంచేసి హ్యాపీగా జంపైపోయిన వాళ్లనీ చూశాం. కానీ..ఇక్కడ మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం వీళ్లందరికంటే డిఫరెంట్.

పోలీస్ ఇంట్లో చోరీ.. దొంగ చేసిన పనికి ప్రపంచమంతా షాక్!

బ్యాంకాక్: దొంగతనానికి వచ్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయిన దొంగలను చూశాం..! దొంగతనంతో పాటూ పనిలోపనిగా..అక్కడే కడుపునిండా భోంచేసి హ్యాపీగా జంపైపోయిన వాళ్లనీ చూశాం. కానీ..ఇక్కడ మనం చెప్పుకోబోయే దొంగ మాత్రం వీళ్లందరికంటే డిఫరెంట్. దొంగతేనానికి వచ్చిన అతడు తాను వచ్చినపని చూసుకోకుండా.. అక్కడే పడి నిద్రపోయాడు. తెల్లారాక గానీ అతడికి తెలియలేదు.. అదో పోలీస్ అధికారి ఇల్లని. అశ్చర్యపరిచే ఈ ఘటన ఇటీవలే థాయ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 22న ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. నాటి రాత్రి ఆ దొంగ ఎప్పటిలాగే ఆ ఇంట్లోకి ప్రవేశించాడట. అయితే.. అప్పటికి అది ఓ పోలీస్ అధికారి ఇల్లని అతడికి తెలియదట. ఆ తరువాత.. ఇంట్లోని ఓ రూమ్‌లోకి వెళ్లి ఏసీ ఆన్ చేసుకుని మంచమెక్కి నిద్రపోయాడట. 


మరుసటి రోజు ఉదయం.. ఆ పోలీస్ అధికారి తన కూతురి రూంలో ఏసీ ఆన్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఆ సమయంలో తన కూతురు ఇంట్లో లేదన్న విషయం ఆయనకు తెలుసు. దీంతో..గదిలోకెళ్లి చూడగా దుప్పటి కప్పుకుని ఎవరో గుర్రుపెట్టి నిద్రపోతున్నట్టు కనిపించింది. దుప్పటి తప్పించి చూడగా..ఎదురుగా మన దొంగగారు దర్శనమిచ్చారు. ఎవడ్రా నువ్వు..ఇక్కడ పడుకున్నావ్ అంటూ అతడిని తట్టిలేపగా.. కళ్లు నలుపుకుంటూ లేచిన దొంగగారు ఒక్కసారిగా షాకైపోయాడట. తనో పోలీస్ ఇంట్లో చోరీకి వచ్చానని తెలుసుకుని అవాక్కయ్యాడట. ఆ తరువాత.. అతడి చేతులకీ బేడీలు పడటం.. కేసు నమోదవడం అన్నీ యథాప్రకారం జరిగిపోయాయి. బాగా అలసటగటా ఉండటంతో చిన్న కునుకు తీద్దామని మంచమెక్కానని, ఇంతలోనే సుదీర్ఘనిద్ర పట్టేసిందని సదరు దొంగ చెప్పుకురావడం ఈ మొత్తం ఉదంతంలో కొసమెరుపు! ఫెట్చాబున్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అవుతోంది. 

Updated Date - 2021-03-28T00:13:19+05:30 IST