ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్స్: యువరాజ్

ABN , First Publish Date - 2020-09-28T22:10:08+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పరుగుల జడివాన కురిసింది. ఈ మ్యాచ్‌లో

ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్స్: యువరాజ్

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌లో పరుగుల జడివాన కురిసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ మయాంక్ అగర్వాల్ (106), కెప్టెన్ కేఎల్ రాహుల్ (69) వీర బాదుడుతో ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసింది. 


ఇంతటి భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని, పంజాబ్‌దే విజయమని అభిమానులతో పాటు క్రీడా పండితులు కూడా తేల్చేశారు. అయితే, భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (4)ను త్వరగానే కోల్పోయినప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా పోరాడింది. స్టీవ్ స్మిత్ (50), సంజు శాంసన్‌లు కలిసి జట్టును నిలబెట్టారు. శాంసన్ అయితే చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42 బంతుల్లోనే 4 ఫోర్లు, 7 సిక్సర్లతో జట్టును విజయం దిశగా నడిపించాడు. 


వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టిన తర్వాత రాజస్థాన్ పని అయిపోయిందని అందరూ భావించారు. అయితే, రాహుల్ తెవాటియా అసమాన పోరాట పటిమతో జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. 31 బంతుల్లోనే 7 సిక్సర్లతో 53 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. క్రీజులోకి వచ్చాక తొలి 16 బంతులకు ఏడు పరుగులు మాత్రమే చేసిన తెవాటియా ఆ తర్వాత పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు. సిక్సర్లతో చెలరేగిపోయాడు.


షెల్డన్ కాట్రెల్ వేసిన 18 ఓవర్‌లో తెవాటియా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి నాలుగు బంతులను సిక్సర్లు బాదిన తెవాటియా.. ఆరో బంతిని మళ్లీ స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో ఆ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు వచ్చాయి.  


తెవాటియా సిక్సర్ల వాన చూసిన 2007 టీ20 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ స్పందించాడు. ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్స్ చెప్పాడు.  ‘‘తెవాటియా భాయ్ ఆ ఒక్క బంతిని వదిలేసినందుకు థ్యాంక్స్. ఆర్ఆర్ అద్భుతమైన విజయానికి అభినందనలు. మయాంక్ అగర్వాల్, సంజుశాంసన్‌లు గొప్పగా ఆడారు’’ అని ట్వీట్ చేశాడు.


యువీ ఇలా స్పందించడం వెనక ఓ కారణం ఉంది. సరిగ్గా 13 ఏళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువార్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఆరు సిక్సర్లు బాది రికార్డులకెక్కాడు. ఇప్పుడు తెవాటియా ఆ ఒక్క బంతినీ మిస్ చేయకుంటే యువరాజ్ సరసన చేరేవాడు. అందుకే యువీ అలా స్పందించాడు. 


Updated Date - 2020-09-28T22:10:08+05:30 IST