ఆ కలానిది ఆద్యంతం అనుభూతి మార్గమే!

ABN , First Publish Date - 2021-05-24T09:59:18+05:30 IST

సాహిత్యరంగంలో ముఖ్యంగా కవిత్వంలో అనేక ఉద్యమాలు ఊపందుకున్న సందర్భాలలో సమ కాలీన కవులంతా ప్రభావితులై ఆయా మూసలలో ఒదిగిపోయినా సరే నమ్మిన సంప్రదాయాన్ని...

ఆ కలానిది ఆద్యంతం అనుభూతి మార్గమే!

శ్రీకాంతశర్మ ‘సుపర్ణ’ కావ్యం పరామర్శ

సాహిత్యరంగంలో ముఖ్యంగా కవిత్వంలో అనేక ఉద్యమాలు ఊపందుకున్న సందర్భాలలో సమ కాలీన కవులంతా ప్రభావితులై ఆయా మూసలలో ఒదిగిపోయినా సరే నమ్మిన సంప్రదాయాన్ని అభ్యుదయ దృక్పథంతో మేళవింపుచేసి తనదైన మానవీయ అనుభవాల్ని భావుకత్వంతో కవిత్వీకరించిన కవి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. తిలక్‌ కవిత్వంలోని నిజాయితీని, భావ కవిత్వం పోకడ విధానాన్నీ ఇష్టపడే శ్రీకాంతశర్మ కవిత్వం కూడా సున్నితమైన భావ సంచలనం కలిగిస్తుంది. వీరు మెచ్చే మరోకవి అజంతాలోని జీవన తాత్వికత ప్రభావం కూడా శ్రీకాంతశర్మ కవిత్వ రచనలో అక్కడక్కడ ప్రతిబింబిస్తుంది.


2004లో ఒక పక్షి ఆత్మకథాత్మక కావ్యంగా వెలువరించిన ‘సుపర్ణ’ అనేది పక్షిని ప్రతీకగా తీసుకుని పక్షి జీవన ప్రస్థానాన్ని పధ్నాలుగు చాప్టర్లుగా రూపొందించిన దీర్ఘకావ్యం. గుడ్డు నుండి పిల్లగా వెలుగులోకి రావటం మొదలుగా ఒక పక్షి జీవితాన్ని తీసుకుని ఒక్కొక్క అధ్యాయంలో ఆ పక్షి కూన చేరిన విభిన్న ఆశ్రయాలలోని అనుభవాల్ని చక్కని భావ సబలతతో కవిత్వీకరించారు శ్రీకాంతశర్మ. ఆయన తొలి రచన ‘అనుభూతి గీతాలు’లోలాగే దీనిలోనూ అనుభూతే ప్రధానం. అయితే పాఠకులు కూడా ఆ అనుభూతిలో మమేకమయ్యేలా చేయటంలోనే కవి ప్రతిభ వ్యక్తమౌతుంది.


గుడ్డును ఛేదించుకొని వెలుగులోకి వచ్చిన పక్షికూన హోరుగాలికి వణికిపోతూ వెచ్చని తల్లి రెక్కల కిందకి చేరుతుంది. గుబురు కొమ్మల మీద నుండి నింగికీ నేలకీ మధ్య ఆవరణలో సంచరించిన పక్షికూన మనోగతం అంత రంగ మధనంగా కథాత్మకంగానే ‘సుపర్ణ’ కావ్యం ఆసాంతం సాగుతుంది.


ఎగిరెగిరి లోకమంతా చూడాలని పరి తపించిన ఆ పక్షి తాను వెళ్ళిపోతే ఆ చెట్టు చిగుళ్ళు వాడిపోతాయేమోననీ, గాలి కూడా దిగులుపడుతుందేమోనని అమాయ కంగా అనుకుంటుంది. అయినా సరే ఎగ రటం నేర్చుకుని, తల్లి రెక్కల వెచ్చదనం దాటి వచ్చి పరిసరాలు కలయచూసి పచ్చని చేలపై తళుకులీనే నీటిబిందువుల మీద రంగు పొరల హరివిల్లు రెక్క లార్చుకొని ఎగరజూస్తుంది.


‘‘గూటిలో వెచ్చగా కునికే వేళల్లో

అమ్మ కరుణతో చేసిన కఠిన బోధలు’’ ఎవరికీ రుచించవు కదా. పక్షికూనకు కూడా అంతే అంటారు కవి.

పదాలను తిరగామరగా రాసి కావ్యకథని కవి అర్థ వంతంగా చేయడం చాలాచోట్ల గమనిం చవచ్చు. ‘‘ఊరిలో తోట కాదిది/ తోటలో ఊరు’’ అంటారు ఒకచోట.

‘‘గాయాల జ్ఞాపకాలు 

స్వప్నాలవుతాయి

స్వప్నాల గాయాలు

జ్ఞాపకాలవుతాయి’’

అంటారు మరోచోట. ఈ కావ్య రచనలో మంచి ప్రతీకలు, పదబంధాలు పాఠకులను ఆకట్టుకొంటూనే ఉంటాయి. 


రాజకీయ నాయకుడి దగ్గర నుంచి స్వాములవారి మఠాన్ని చేరిన పక్షి కూన ఎన్నెన్నో మంచి విషయాలని శిష్యబృందంతో పాటు అధ్యయనం చేసిందని, మాటలు నేర్చిందని కవి కవిత్వీకరించిన సందర్భంలో ధ్యానం గురించి ఇలా అంటారు: ‘‘నిన్ను నువ్వు పట్టుకొని/ మనసునొలిచి చూసుకోవటం ధ్యానం’’. ఇలా అనటంలో శ్వాస మీద ధ్యాస అనే విషయాన్ని నిన్ను నువ్వు పట్టుకొని అంటూ అందంగా అక్షరీకరించటమేకాక, నీలోకి నువ్వు చూసుకోవటం అనే విషయాన్ని ‘మనసును ఒలిచి చూసు కోవటం’ అని చమత్కారంగా చెప్తారు.


దాంతోబాటు ‘‘బతుకు భయాలు పెరిగే కొద్ది దైవభక్తికి తిరుగులేదు‘’’ అనటంలో దైవభావనకు మనిషికి గల అనేకానేక భయాలే మూలకారణం అనేది ధ్వనింపజేశారు. రాజకీయ నాయకుడు అంతకంతకూ ఎదిగి ప్రాణభయంతో భక్తుడై దేవుణ్ణి పరిచయం చేయగల గురువుని వెతు క్కుంటే మంత్రదండం పట్టిన స్వామీజీ అఖండఖ్యాతిని ఆర్జించాడట.  


స్వాముల వారి ఆశ్రమం ఆక్రమిత స్థలంగా నేరాలలో చిక్కుకున్నప్పుడు ఆశ్రమాన్ని విడిచివేసే ముందు స్వామీజీ పక్షికూనతో ‘‘నేను పక్షులు వాలే వృక్షాన్ని, నువ్వు వృక్షం విడచిన పక్షివి, నీ దారిన నువ్వెళ్ళు’’ అని కోరుతాడు.


తెల్లారేసరికి తల్లీతోబుట్టువులు వెళ్ళిపోగా పక్షికూన బతుకు దానిదే అయ్యింది. ఎదురుగాలికి నిల్చి పల్టీలు కొట్టటం నేర్చిన కూన బాల్యం నుండి యవ్వనంలోకి ప్రవేశించాన నుకొంది. తనకొక దారి చూసుకొందుకు పయనం ప్రారం భించింది: ‘‘పరచుకొన్న తోటల నీడల్లో/ బద్ధకంగా పరున్న చెరువు/ అరమోడ్పుగా విచ్చిన అరవింద నేత్రాలు’’ చూసుకుంటూ తోటలోని ఊరులో ప్రవేశించింది.

‘‘తోట మలుపులో

మబ్బు పాగా తలకు చుట్టుకున్న

పెత్తనం చెలాయిస్తున్న కొండ’’ని చూసి భయపడి కొండ వాలున గుబురులో గూడు వెతుక్కుంది. దాని గూడు ముంగిలి: ‘‘ఎండకుఎండ వెన్నెలకువెన్నెల/ గూటి గుమ్మానికి/ వెండి బంగారు పరదాలల్లుతాయి’’... ఇలా ఊహల మధ్య విహరిస్తూ స్వప్నాల నుండే జీవించటం నేర్చుకుంటుంది. నింగి ఉన్నంతమేరా నేల ఉండదనీ, నీరు న్నంతమేరా నేల ఉండదని, మనసున్నంతమేరా ప్రాణం లేదనీ, నేనుతనం ఉన్నంత మేరా స్థిమితం లేదనీ.. ఇలా ఎన్ని తెలుసుకుందో చిట్టి కూన. ఉండుండి బోయలు, పిల్లలు వెంటాడి వేటాడి పట్టుకోవాలని చూస్తుంటే గుండెలు అవిసేలా ఎగిరెగిరి తప్పించుకున్నప్పుడు: ‘‘ఒక్కసారైనా తప్పించుకోనిదే/ జీవించటంలోని విలువ తెలిసిరాదు’ అంటారు. 


ఆ తర్వాత పక్షి- వేర్పాటుగా బతకడమే మనిషి జీవన మంత్రం అయిన నగరానికి చేరింది. మనుషులు గుంపులు గానే తిరుగుతున్నా మనసులు అరలు అరలుగానే ఉన్నా యని తెలుసుకుంటుంది:


‘‘ఎదగడమనే ఊత పదంతో

గాలిపటాలు కట్టి

గాలికెగరవేయిస్తుంది నగరం

ఈ నగరం కీటకాన్ని భ్రమరంగా

మార్చే ఇంద్రజాలం’’ అని తెలుసుకుంటుంది నగరం నచ్చని పక్షి. కిటికీ కప్పుల మీద ఇరుకిరుకుగా బతకడం నచ్చక, తిరిగి ప్రయాణం ప్రారంభించి తుఫాను వర్షంలో చిక్కుకుని ప్రాణాలు బిగబెట్టుకొని ఎగరబోయి మేడలోని పిల్లల చేతికి చిక్కి పంజరం పాలౌతుంది. తీరా ఆ భవంతిలో పంజరం కుదించిన బతుకు నుండి భయాన్ని కప్పుకొని ప్రవాసిలా వచ్చిన పక్షికూన కొత్త జీవితం ప్రారంభించిందంటాడు కవి. కానీ తోటంతా పిల్లల సందడి, అల్లరికేకలు, రంగు మబ్బుల్లా భ్రమింపజేసే బుక్కా గులాబులతో కళ్ళు మసక బారి కొమ్మకానక జారిపడిన పక్షి కూన పిల్లల చేతికి చిక్కింది.


చదువుల అంతస్తు భవనంలో మూడో అంతస్తులో తిరిగి పంజరం పాలైంది. ఈ అధ్యాయంలో నేటి పిల్లల కార్పొరేటు చదువుల తీరును, అంతస్తుల కెదిగిన చదువుల ప్రపంచాన్ని పలు విధాలుగా వ్యంగ్య విమర్శతో కవి నిరసిస్తాడు. ఒకనాడు బడి ఉత్సవానికి వచ్చిన మంత్రి పక్షిని చూసి తన పెంపుడు పక్షికి జతగా తీసుకుపోతాడు. కొత్త రంగుల లోకంలో, కొత్తపలుకుల సంభ్రమంలో సహచరితో కొత్త కలలు కంటున్నప్పుడు మంత్రి కొంప కూలిపోయింది. దాంతోపాటు పక్షి గూడు కూడా కూలిపోయి ఆడతోడూ రాలిపోయింది. ఈ సందర్భంలో ‘‘నూతన నిర్మాణాలకు పాతను విధ్వంసం’’ చేస్తారు కదా అని పక్షి మనసుతో కవి బాధపడతారు. కొత్తదారి వెతుక్కుంటూ అడవి పక్షుల గుంపులో చేరింది ఆ పక్షి.


ఇక్కడ మంత్రిని అడవిలోని ఉద్యమవీరులు ఎత్తు కెళ్ళారని చెబుతూ శ్రీకాంతశర్మ వారి జీవితం, వారి ఆకాంక్షలు, రాజ్యహింసలేని, వర్గవివక్ష లేని రాజ్యం కోసం కలలుకంటూ అడవి దారి పట్టిన ఆ విప్లవ వీరులతోని చర్చ... వీటన్నింటినీ కవిత్వీకరిస్తారు. ఈ అధ్యాయమంతా సంభాషణ రూపంలోనే ఉంటుంది. ‘‘చట్టం ఒక చారిత్రక ఘట్టం’’ అంటారు ఈ సందర్భం లోనే. విప్లవ వాతావరణానికి అనుకూలమైన ప్రతీకలతో కవితను నడిపిస్తారు. విప్లవవీరులతో మంతనాలు ఫలించక పేలిన తుపాకులతో అడవి దద్దరిల్లుతుంది.


‘‘తరగలెత్తే గోదావరి/ బుసలు కొట్టే అలల పాము పడగలు/ గుటకలు మింగే ఒడ్లను/ ఖస్సున తెల్ల నురుగుల కోరలతో కరుస్తూ’’ అని ప్రకృతిని సంద ర్భానికి తగినట్లు వర్ణిస్తారు: ‘‘సంజవేళ గోదావరి/ శివుడి మూడో కన్నులా ఉంది/ విజృంభించే గోదావరి/ విప్లవ ధ్వజంలాగుంది/ సుడులు విచ్చే గోదావరి/ కడలిని కమ్మేసేలాగుంది’’.


అలిసిపోయిన పక్షి అవతలి ఒడ్డు చేరలేక పొగ పడవలో సరుకు మూటల మధ్య పండ్ల గెలల మాటున సొమ్మసిల్లింది. అకస్మాత్తుగా రేవులోన అలికిడికి ఎగరబోయిన పక్షిపై ఉత్తరీయం విసిరి పట్టాడు ఒకడు.


ఇక ఆ మర్నాటి నుండి కాల నిర్ణయాలు, కాగితపు మడతల మధ్య ఆశా శ్వాసలను పక్షిచేత ఎంపిక చేయించే చిలక స్వామి చెంత చేరింది. మాటలు నేర్చిన చిలుక క్రమంగా వేణు గోపాలుడి వాక్కుగా మారేసరికి గుడి ప్రాభవం పెరిగి, వ్యాపారం ఆరంభమై అవతారమూర్తిగా మారిపోతుంది చిలుక. అది భరించలేని పక్షి తిరిగి యాత్ర మొదలుపెడుతుంది.


‘‘గింజ మొలకెత్తినా/ మబ్బు చినుకెత్తినా

సంజ ఎరుపెక్కినా / వెన్నెల వింజామరలెత్తినా

పులకరింతల పొగడ చెట్టైపోయే’’ ‘ఆమె’ అనుబంధంలో స్నేహగంధాన్ని అందుకొని అక్కడ చేరింది. ‘ఆమె’ ఒక స్వేచ్ఛాజీవి. అందుకే అక్కడ పక్షికీ బంధనాలు లేవు. పంజరం లేదు. పురుషుల దాష్టీకాన్ని అనేక విధాల నిలదీసి దూరం పెడుతుందామె. సహజంగా బతికితేనే సహచరుడవు అవుతావు అని స్పష్టంగా చెబుతుందామె. ఆమె స్నేహంలో కథలు చెప్పి చిక్కు ప్రశ్నలడిగి ఎన్ని వూసుల్తోనో ఆనందంగా ఉన్నప్పుడు ఆమె తన యింటికి వచ్చిన పక్షి పరిశోధకుల జంటకి సహకరించేందుకు పక్షిని పంపిస్తుంది. 


తన తల్లి రెక్కల సందు నుండి నాటివరకూ సాగిన ప్రస్థానంలోని జ్ఞాపకాలను జాతకాల మడతలు విప్పి చదువుకుంటుంది ఆ పక్షి. ఆశ్చర్య చక్రమై ఆవర్తించే మనిషి జీవితం గురించి తర్కించుకుంది. ఇంక మాయలాంతరు లాంటి మనసుతో మిగిలిన ప్రయాణం వైపు ఆలోచనల్ని విస్తరిస్తుంది:


‘‘వ్యక్తిత్వం నుండి అణుత్వంలోనికి

సమూహం నుంచి ఏకాంతంలోనికి

శబ్దాన్ని లయించే నిశ్శబ్దంలోనికి

అణుకేంద్రకంలోని ఆదిమశక్తిలోనికి

జరుగుతోన్న ఈ జీవన ప్రస్థానంలో

ఎవరికి వారే ఏకాంత ప్రేక్షకులు’’ అని ముగుస్తుంది పక్షి ఆత్మకథ. ఇది కేవలం పక్షి ఆత్మకథ మాత్రమేనా? కాదు. మానవీయ అనుభూతుల్నే పక్షి దృష్టికోణంతో రాయటంలో కవి సునిశిత భావుక హృదయం వ్యక్తమవుతుంది. వీరి రచనలలో ప్రత్యేకంగా గోచరించే అనుభూతే ఇందులోనూ ప్రధానంగా ఉంటుంది. ఈ కావ్యానికి ‘సుపర్ణ’ అనే శీర్షిక కొంత ఆలోచింపచేస్తుంది. ఎందుకంటే కావ్యమంతా సరళ మైన శైలిలో అచ్చమైన తెలుగు పదచిత్రాలతోనే నడుస్తుంది. కొన్నిచోట్ల మాత్రమే సంక్లిష్ట పదబంధాలు ఉపయోగించారు. కవి సంస్కృతాధ్యయనం వలన అందులో మంచిపట్టు సాధించిన వ్యక్తి కనుక ఆ శీర్షిక పెట్టారనుకోటానికి వీలులేదు. పక్షి జీవన ప్రయాణంలో తటస్థపడిన స్వామీజీ, బోయలు, పిల్లలు, నాయకుడు, మంత్రి, చిలకస్వామి, ‘ఆమె’, పక్షి పరిశోధకులు ఎవరూ ఆ చిలుక రెక్కలను కత్తిరించి అశక్తురాలిగా చేసి బంధించలేదు. పూర్తి స్వేచ్ఛా విహంగంగానే జీవన ప్రయాణం కొనసా గించింది. ఆ విషయం సూచించేందుకే కవి ఇంద్రగంటి సముచితమైన శీర్షికగా ‘సుపర్ణ’ అని పేరు పెట్టారు.


సాహిత్యరంగంలో పరిణామ క్రమంలో ఎప్పటికప్పుడు  పెల్లుబికే కవిత్వోద్యమాలలో సమకాలీన కవులు గాలి వాటుగా ఆయా ప్రభావాలకు గురైనా శ్రీకాంతశర్మ మాత్రం చివరికంటా తాను నమ్మిన సాంప్రదాయాన్ని ఆధునిక దృక్పథంతో విశ్లేషించుకుని తనదైన భావుకత్వ పరిధిలోనే కవిత్వీకరించారు. వస్తువు, వాదమూ ఏదైనా మనోధర్మమే ఏ కవితకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే అంత రాణిస్తుందని తాను నమ్మిన విషయాన్నే ఘంటాపథంగా స్పష్టంగా చెప్పిన కవి ఇంద్రగంటి శ్రీకాంతశర్మ.

(మే 29న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ జయంతి)

శీలా సుభద్రాదేవి

81068 83099

Updated Date - 2021-05-24T09:59:18+05:30 IST