ఆ దేహమే రామాలయం!

ABN , First Publish Date - 2021-02-05T05:30:00+05:30 IST

రామ్‌నామీ... ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కనిపించే అట్టడుగు వర్గాలకు చెందిన ఒక తెగ. వారికి ‘రామ్‌నామీ’లు అనే పేరు రావడానికి కారణం... వారు పాటించే ఒక ఆచారం!

ఆ దేహమే రామాలయం!

హనుమంతుడు గుండె చీలిస్తే శ్రీరాముడు కనిపిస్తాడట! అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఒక తెగ వారు ప్రదర్శించే రామ భక్తి ముందు హనుమంతుడు కూడా చాలడు. వారి ఒళ్ళంతా రామనామం! జీవితమంతా రామమయం!


రామ్‌నామీ... ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కనిపించే అట్టడుగు వర్గాలకు చెందిన ఒక తెగ. వారికి ‘రామ్‌నామీ’లు అనే పేరు రావడానికి కారణం... వారు పాటించే ఒక ఆచారం! అదే శరీరం మీద రామనామాన్ని పచ్చబొట్టుగా పొడిపించుకోవడం. పూర్వం ఈ తెగవారిని అస్పృశ్యులుగా పరిగణించి, ఆలయాల్లోకి రానిచ్చేవారు కాదు. దేవుడు ఆలయాల్లోనే కాదు, తమలోనూ ఉన్నాడనీ, తమ దేహమే రామమందిరమనీ భావించి... అస్పృశ్యతపై ధిక్కారంగా శరీరం మీద రామనామాన్ని పచ్చబొట్లుగా పొడిపించుకోవడం ప్రారంభించారు. కాలక్రమంలో వారికి ఆలయప్రవేశం లభించినా... పచ్చబొట్ల ఆచారం కొనసాగుతోంది. వీరు శాకాహారులు. ప్రతి రోజూ, ప్రతి సందర్భంలో రామభజన చేస్తారు. ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉంటారు. 


అయితే ఈ ఆచారాన్ని పాటించే పద్ధతుల్లో వ్యత్యాసం ఉంది. కొందరు కనురెప్పలతో సహా... శరీరమంతా పచ్చబొట్లు వేయించుకుంటారు. వారిని ‘నఖ్‌శిఖ్‌’ (కాలి నుంచి తల వరకూ) అంటారు. మరికొందరు కేవలం నుదుటిపై మాత్రమే పచ్చబొట్లు పొడిపించుకుంటారు. వారిని ‘శిరోమణి’ అంటారు. ఇంకొందరు పచ్చబొట్లు వేయించుకోరు. కానీ రామనామం ఉన్న దుస్తులు వేసుకోవడం, రోజూ భజన చేయడం, శాకాహారం ద్వారా రామ్‌నామీలుగా జీవిస్తారు. తరాలు మారుతూండడంతో పచ్చబొట్లు వేయించుకొనే వారు క్రమంగా తగ్గిపోతున్నారట! రామ్‌నామీలు సంప్రదాయంగా తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. ఈ తెగవారు తాము నివసించే ప్రాంతాల్లో రామనామీ సమాజాలుగా ఏర్పడతారు. విగ్రహారాధన మీద వీరికి విశ్వాసం లేదు. దానికి బదులు, తులసీదాస్‌ రచించిన ‘రామచరిత మానస్‌’లోని పంక్తులను చదువుతూ,  ప్రార్థన చేస్తారు. ప్రతి సంవత్సరం పుష్యమాసం చివర్లో మూడు రోజుల పాటు నిర్వహించే ‘బడా భజన్‌ మేళా’లో ఈ తెగ వారందరూ ఒక చోట కలుసుకుంటారు. పరస్పరం పరిచయాలు చేసుకుంటారు. ఈ ఏడాది సారంగఢ్‌ జిల్లాలోని నాందిలి అనే గ్రామంలో ఈ మేళా జరిగింది. రామ్‌నామీ సమాజాలకు సంబంధించిన విషయాలపై చర్చలు, సామూహిక రామనామ భజనలూ మేళాలో ప్రధానంగా ఉంటాయి. ఈ మేళాను నిర్వహించడానికి రామ్‌నామీ గ్రామాలు పోటీ పడుతూ ఉంటాయి.

Updated Date - 2021-02-05T05:30:00+05:30 IST