ఆమెదే గెలుపు!

ABN , First Publish Date - 2020-07-02T05:14:57+05:30 IST

ప్రపంచం ‘కొవిడ్‌ - 19’ మహమ్మారితో ఓ వైపు అలుపెరుగని పోరాటం చేస్తోంది. తాజాగా హ్యాంప్‌షైర్‌కు చెందిన మిల్ర్డెడ్‌ జెర్రీ చాపెల్స్‌ అనే 102 ఏళ్ల బామ్మ కరోనా

ఆమెదే గెలుపు!

ప్రపంచం ‘కొవిడ్‌ - 19’ మహమ్మారితో ఓ వైపు అలుపెరుగని పోరాటం చేస్తోంది. తాజాగా హ్యాంప్‌షైర్‌కు చెందిన మిల్ర్డెడ్‌ జెర్రీ చాపెల్స్‌ అనే 102 ఏళ్ల బామ్మ కరోనా వైరస్‌ బారిన పడి కోలుకొని ఈ పోరాటానికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ బామ్మగారికి 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూను కూడా జయించిన రికార్డు ఉంది. స్పానిష్‌ ఫ్లూ సోకినప్పుడు జెర్రీ 10 నెలల పసికందు. అప్పట్లో అమెరికాలో పెద్ద సంఖ్యలో ప్రజలు దాని బారిన పడి ప్రాణాలు వదిలారు. జెర్రీని హాస్పిటల్‌కు తీసుకెళ్తే ‘జ్వరం తీవ్రంగా ఉండడం వల్ల ఆమె చనిపోయే అవకాశం ఉంది’ అని డాక్టర్‌ చెప్పారు. కానీ ఆ పసికందు బతకడమే కాదు, కాలేజీ చదువును పూర్తి చేసింది. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది. నషువాలో టీచర్‌గా పనిచేసి రిటైరయ్యింది. 70 ఏళ్ల వయసులో ఆమె జీవితంలోకి మరో అపాయం ప్రవేశించింది. పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్‌లు రెండూ కలసికట్టుగా దాడి చేస్తే జెర్రీ ఆ రెండింటినీ ఎదుర్కొని బయటపడింది.


మళ్లీ ఇన్నాళ్లకు 102 ఏళ్ల వయసులో ఆమె జీవితంలోకి కరోనా రూపంలో మరో మహమ్మారి తొంగి చూసింది. ఆమె దాన్ని కూడా ఓడించింది. ప్రస్తుతం ఆమె నషువాలో అసిస్టెడ్‌ లివింగ్‌ ఫెసిలిటీలో జీవిస్తున్నారు. అయితే ఇదంతా కేవలం అదృష్టం కొద్దీ జరగలేదు. తుది వరకూ పోరాడే తత్వమే ప్రతి సందర్భంలోనూ ఆమెను పెను అనారోగ్య సమస్యల నుంచి బయటపడేసింది. ప్రాణాంతక వ్యాధులు దాడి చేస్తున్నా...ఆమె వెనుకడుగు వేయలేదు. ఇంతకు ముందెన్నడూ ఎవ్వరూ ఇలాంటి విపత్తులు ఎదుర్కొని బతికి బట్టకట్టలేదు. ఆమె ఆరోగ్య రహస్యం గురించి అడిగితే ‘‘నేను నిక్షేపంగా  150 ఏళ్లు జీవిస్తాను’’ అని చె బుతున్నారు. ‘మరి అంత తీవ్ర అనారోగ్యంతో ఉంటే భయం వేయలేదా?’ అని అడిగితే ‘‘కొన్ని రోజుల పాటు అనారోగ్యం పాలవడం మరీ అంత చెడ్డ విషయం ఏమీ కాదు’’ అని బోసినోటితో బదులిచ్చారు. సంక్షోభాలను అవలీలగా ఎదుర్కొనే శక్తి ఆమె దృక్పథంలో ఉందో, ఎలాంటి వ్యాధినైనా ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఆమె డీఎన్‌ఏలో ఉందో తెలియదు కానీ కష్టాలను గుండె నిబ్బరంతో అధిగమించడంలో జెర్రీ జీవితం అందరికీ ఓ పాఠం. 

Updated Date - 2020-07-02T05:14:57+05:30 IST