Feb 2 2020 @ 19:01PM

ఆ రికార్డు ఘంట‌సాల‌దే

దక్షిణభారతదేశ‌ చలన చిత్ర నేపథ్యగానంలో తొలిసారి సంస్కరించబడిన గానం‌ చేసినవారు ఘంటసాల వెంకటేశ్వరరావు‌. సాహిత్యాన్ని సాహిత్యంగా పాడడం దక్షిణభారత చలనచిత్రాలలో ఘంటసాలతోనే మొదలయింది. భావంతో పాడడమూ దక్షిణాదిన వారితోనే మొదలయింది. ఏదో ఒప్పచెప్పినట్లుండే చలనచిత్రగానం ఘంటసాల వల్ల గానం అన్న స్థితిని పొందింది. పౌరాణిక చిత్రాలలో పద్యాల పాడాడానికి ఒక ఒరవడి పెట్టారు ఘంటసాల.

 

దక్షిణభారత చలన చిత్రాలలో మొదటి గొప్ప గాయకులు ఘంటసాల. అభినయానికి అనువైన‌ గానం వారిది‌.‌ దక్షిణాది చలనచిత్రాలలో గానంపై సరైన అవగాహన ఉన్న తొలిగాయకులు వారు. వారి గాత్రధర్మంపై వారికి సరైన అవగాహన ఉండేది. వారిది metalic timbre. ఆ గాత్రాన్ని ఎంత గొప్పగా పలికించవచ్చో అంత గొప్పగానూ పలికించారు తెలుగుకు విలువైన గానాన్నిచ్చారు‌.

 

స్వర్గసీమ చిత్రంలో గాయకులుగా పరిచయమైయ్యారు ఘంటసాల. ప్రజాదరణ పొందిన వారి తొలి పాట కీలుగుఱ్ఱం చిత్రంలోని "ఎవరు చేసిన కర్మ" పాట. ఆ చిత్రంలో వక్కలంక సరళతో వారు పాడిన "కాదు సుమా కలకాదు సుమా" అన్న యుగళగీతమూ ప్రజాదరణ పొందింది. అప్పటినుంచీ వారి గానయానం 1974లో వారు స్వర్గస్థులయ్యేదాకా విజయవంతంగా‌ కొనసాగుతూనే ఉంది. మన దేశంలో కడదాకా ఆగకుండా చలనచిత్ర నేపథ్య గాయకులుగా కొనసాగిన వారు బహుశా ఒక్క ఘంటసాల మాత్రమేనేమో?

 

ఘంటసాల దేవదాసు చిత్రంలో పాడిన "కుడి ఎడమైతే పొరబాటులేదోయ్" పాట సంపూర్ణమైన గానానికి సరైన ఉదాహరణ.

 

ఎన్నో పాటల్ని వారు ఎంతో గొప్పగా పాడారు. నిజానికి చలనచిత్రాలకు పొసగని metalic tone qualityతో గొప్ప చలనచిత్ర గానాన్ని చేశారు ఘంటసాల. ఇది వారు తమ మేధతో సాధించినది. వారిది మంచి సంగీత మస్తిష్కం. మనసుతో పాడడం తెలిసిన గాయకులు ఘంటసాల.‌ చలనచిత్రాలలో నక్షత్రస్థాయిని‌ అందుకున్న తొలి దక్షిణాది గాయకులు ఘంటసాల. 1953 కల్లా వారు ఒక నక్షత్ర చలనచిత్ర నేపథ్య గాయకులయ్యారు. చలనచిత్ర గాయకులుగా‌ రాణిస్తున్న‌‌ ఘంటసాల‌ 1958 లో విజయనగరంలో ఒక‌సారి‌ కర్ణాటక‌‌ శాస్త్రీయ సంగీత‌ కచేరి చేశారు. ఆ కచేరిలో ఘంటసాల గాన ప్రతిభకు తోటి కళకారులు, అబిమానులు విస్మయం చేందారట. ఘంటసాలకు కర్ణాటక‌ సంగీతంపై పట్టు ఉండేది. ఆ పట్టుతో‌‌‌‌ వారు‌ చలనచిత్రాలలో కొన్ని‌‌‌ గొప్ప పాటలు పాడారు. ఆ పట్టుతో‌ వారు జయదేవుడి అష్టపదుల్ని చాలా గొప్పగా పాడారు. ఆ పట్టుతో‌ "దినకరా శుభకరా...- వంటి గొప్ప పాటల్ని స్వరపఱిచారు. ఘంటసాల‌ ఎంత గొప్పగాయకులో అంతకన్నా గొప్ప సంగీత దర్శకులు. తమ సంగీత‌ దర్శకత్వంలో ఎన్నో గొప్ప పాటల్ని చేశారు. వారసత్వం చిత్రంలో "ప్రేయసీ మనోహరి వరించి చేరరా" , చిరంజీవులు చిత్రంలో "కనుపాప కరువైన కనులెందుకో", పాతళభైరవి చిత్రంలో "ఓ జాబిలీ, ఓ తారకా, ఓ మలయానిలమా" వంటి ఎన్నో గొప్ప పాటలు ఘంటసాల సంగీతదర్శకత్వంలో రూపొందాయి. షావుకారు చిత్రంలో వారు చేసిన సంగీతం‌ ఉన్నతమైన‌ది. అప్పటికి అలాంటి సంగీతం చెయ్యడం గొప్ప విషయం.

 

పెండ్యాల, ఆదినారాయణరావు, కె.వి. మహాదేవన్ వంటి సంగీతదర్శకులకు ఘంటసాల ఎంతో గొప్ప గానాన్ని అందించారు‌. పెండ్యాలకు "రాగమయి రావే...", "శివశంకరీ శివానంద లహరి", "పో పోయే పోయే చినదానా..." వంటి‌ ఎన్నో పాటల్ని గొప్పగా పాడారు. ఆదినారాయణరావుకు "హాయిహాయిగా ఆమని పాడే..", " ఘనా ఘనా సుందరా..." వంటి‌ ఎన్నో పాటల్ని‌ గొప్పగా పాడారు. కె.వి. మహాదేవన్ కు "ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులు", " శిలలపై శిల్పాలు చెక్కినారు...", "గోరొంక గూటికే చేరావు చిలక..." వంటి‌ ఎన్నో పాటల్ని గొప్పగా పాడారు. ఇంకా ఎన్నో ఎన్నో పాటల్ని గొప్పగా‌ పాడారు. తమ గానంతో తెలుగు చలనచిత్ర గానానికి గొప్పతనాన్ని‌ తెచ్చిచ్చారు.

 

ఘంటసాల ఇంగ్లిష్ సంగీత‌‌ ధోరణిలో‌ "ఊహలు గుసగుసలాడే‌ ..." పాటను చేశారు. వారిపై పాశ్చాత్య ధోరణో, మఱో ధోరణో పెద్దగా లేదు‌. వారికి ఉర్దూ గజల్‌ తరహా గానం అంటే నచ్చదని వారి సతీమణి సావిత్రి గారు ఈ రచయితతో చెప్పారు.

"గానానికి తెలుగుతనం ఘంటసాల.‌ తెలుగుతనానికి గానం ఘంటసాల."

పాడుతా తీయగా చల్లగా అంటూ‌ పాడి తీయని చల్లని తెలుగు పాటగా ఘంటసాల నిలిచి ఉన్నారు. నిలిచి ఉంటారు.

 

-రోచిష్మాన్

9444012279

[email protected]