ఇది సత్యం

ABN , First Publish Date - 2020-03-13T06:42:19+05:30 IST

సనాతన భారతీయ ధర్మం సత్యానికి సమున్నత స్థానం కల్పించింది. మానవ ధర్మాలలో సత్యానికి అగ్రపీఠం వేసింది. మహాభారతంలో ధర్మరాజును యక్షుడు ‘‘సూర్యుణ్ణి నిలిపి ఉంచే ఆధారం ఏది?’’...

ఇది సత్యం

  • ఏ ధర్మం అయినా నిలబడేది సత్యం పైనే! 
  • అన్ని ధర్మాలకూ సత్యమే ప్రాతిపదిక. 
  • ఏ కాలానికైనా వర్తించేది సత్యం!
  • వేదాలూ, ఉపనిషత్తులూ,
  • పురాణాల సారం ఇదే!


సత్యాన్నే పలకాలి. మధురంగా మాట్లాడాలి. సత్యమే అయినా అప్రియమైన వచనం పలుకకూడదు. ప్రియాన్ని కలిగించేదే అయినా అబద్ధం చెప్పకూడదు.


సనాతన భారతీయ ధర్మం సత్యానికి సమున్నత స్థానం కల్పించింది. మానవ ధర్మాలలో సత్యానికి అగ్రపీఠం వేసింది. మహాభారతంలో ధర్మరాజును యక్షుడు ‘‘సూర్యుణ్ణి నిలిపి ఉంచే ఆధారం ఏది?’’ అని ప్రశ్నించినప్పుడు ‘‘సూర్యుడికి ఆధారం సత్యమే!’’ అని బదులిస్తాడు (అరణ్య పర్వం, సప్తమాశ్వాసం). సమస్త సృష్టికీ వెలుగులు అందించే సూర్య భగవానుడు కూడా ప్రవర్తిల్లుతున్నది ‘సత్యం’ అనే ఆధారంతోనే!


అదే వేదం... అదే తపస్సు!

భరతుణ్ణి కుమారునిగా స్వీకరించడానికి దుష్యంతుడు తిరస్కరించిన సందర్భంలో సత్యం విశిష్టతను శకుంతల నోట ఆంధ్ర మహాభారతంలోని ‘ఆది పర్వం’లో ‘నుతజల పూరితంబులగు...’ అనే పద్యంలో నన్నయ పలికించాడు. 


‘‘నూరు మంచినీటి చేదుడు బావుల కన్నా ఒక దిగుడు బావి మేలు. వంద దిగుడు బావుల కన్నా ఒక మంచి క్రతువు (యజ్ఞం) మేలు. అలాంటి వంద క్రతువుల కన్నా ఒక కుమారుడు మేలు. అలాంటి వందమంది కుమారుల కన్నా ఒక సత్యవాక్యం గొప్పది’’ అని ఆ పద్యం చెబుతోంది.. ఆ క్రమంలోనే వచ్చే మరో రెండు పద్యాలు : ‘వెలయంగ నశ్వమేధంబులు వేయును...’, ‘సర్వ తీర్థాభిగమనంబు’!  ‘‘ఒక త్రాసులో ఒక వైపు వెయ్యి అశ్వమేథ యాగాల ఫలాన్నీ, మరోవైపు సత్యాన్నీ ఉంచి తూచితే, సత్యం ఉన్న వైపే ముల్లు మొగ్గు చూపుతుంది.


అలాగే తీర్థయాత్రలు, వేదాధ్యయనం చేయడం వల్ల వచ్చే ఫలితాలు కూడా సత్యం ముందు దిగదుడుపే! ధర్మాత్ములైన మునీంద్రులందరూ సర్వధర్మాల కన్నా సత్యమే గొప్పదని స్పష్టంగా చెప్పారు’’ అని ఆ పద్యాల అని భావం. మహాభారతంలోని నాలుగో ఆశ్వాసం ‘సత్యమే వేదం, సత్యమే తపస్సు, ప్రజా సంతతిని సృష్టించేది సత్యమే. ఈ లోకమంతా సత్యం పైనే ఆధారపడి ఉంది. సత్యాన్ని వదలి చేసే జపాలూ, హోమాలూ, పూజాదికాలూ అన్నీ వ్యర్థాలే!’ అని స్పష్టం చేస్తోంది. 

‘‘సత్యమేవ జయతే నానృతమ్‌ / సత్యేన పంథా వితతో దేవయానః / యేనాక్రమంతి ఋషయో హి ఆప్తాకామా / యత్ర తత్సత్యస్య పరమం నిధానమ్‌’’ అని ముండకోపనిషత్తు చాటి చెప్పింది. మన జాతీయ చిహ్నంలో కూడా ఈ శ్లోకంలోని మొదటి రెండు పదాలు చోటు చేసుకున్నాయి. 

‘‘సత్యమే (ధర్మమే) జయిస్తుంది. అసత్యం పాపకారణం. సత్య మార్గం వల్లనే దైవమార్గం అవగతం అవుతుంది. మునీశ్వరులు సత్య ప్రవర్తకులై, మనోరథ సిద్ధిని సాధించి, ముక్తి పొందుతారు’’ అని దీని అంతరార్థం. 


అన్నిటికీ అదే మూలం

శ్రీమద్రామాయణంలో జాబాలి నాస్తికవాదాన్ని శ్రీరాముడు ఖండిస్తూ సత్యవాదే ఉన్నత స్థితికి చేరుతాడని చెబుతాడు. ‘‘సత్యమే వేశ్వరో లోకే సత్యే ధర్మా శ్రితా సదా / సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్‌’’ (వాల్మీకి రామాయణం, అయోధ్య కాండ).  ‘‘లోకంలో ధర్మానికి సత్యమే పరాకాష్ఠ. అది స్వర్గ ప్రాప్తి పదం. సత్యమే భగవత్స్వరూపం. అది అన్నిటీ మూలం. సత్యం వల్లనే సంపదలు చేకూరుతాయి’’ అని దీని అర్థం. 


అప్పుడు అనృతం కాదు!

‘‘సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌ - న బ్రూయాత్‌ సత్య మప్రియం / ప్రియంచ నానృతం బ్రూయాత్‌- ఏష ధర్మ స్సనాతనః’’ అని చెప్పాయి ధర్మశాస్త్రాలు. అంటే సత్యాన్నే పలకాలి. మధురంగా మాట్లాడాలి. సత్యమే అయినా అప్రియమైన వచనం పలుకకూడదు. ప్రియాన్ని కలిగించేదే అయినా అబద్ధం చెప్పకూడదు. అయితే ప్రాణహాని జరిగినప్పుడూ, ఆస్తి, సంపదలు దోపిడీకి గురయ్యే విపత్కర పరిస్థితుల్లో అసత్యం చెప్పవచ్చుననే మినహాయింపు ఉంది. కొంపలు కూల్చేది సత్యమయినా మంచిది కాదు. ప్రాణహితంగా ఉండేదే సత్యం. ప్రాణుల శ్రేయస్సు కోసం పలికే అసత్యం సత్యంతో సమానం అనీ, ప్రాణులకు భయం కలిగించే సత్యం అబద్ధంతో సమానమనీ మహాభారతంలోని శాంతిపర్వం చెబుతోంది. అబద్ధం చెప్పడం పాపమే. అయినా, స్త్రీల విషయంలో, పెళ్ళికి సంబంధించి, నవ్వులాటకు, మరణ సంబంధమైన విషయాల్లో, దోపిడీకి గురయ్యే సందర్భంలో అబద్ధం చెప్పవచ్చనీ, గురువులూ, పెద్దలను రక్షించడానికీ చెప్పే అసత్యం దోషం కాదని వివరించింది. ఏమైనా, సత్యవాక్కు కలిగి, ధర్మాన్ని ఆచరించడం మానవులందరి కర్తవ్యం కావాలి.

- రాయసం రామారావు

Updated Date - 2020-03-13T06:42:19+05:30 IST