ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే!

ABN , First Publish Date - 2022-05-04T08:56:54+05:30 IST

పోలీస్‌ కొలువుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులూ జాగ్రత్త! ఓసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే కుదరదు.

ఒకసారి దరఖాస్తు చేస్తే అంతే!

  • కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 
  • వయోసడలింపు వర్తించదని స్పష్టం 
  • అభ్యర్థులకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉండదు!
  • స్మార్ట్‌ పోన్ల ద్వారా వద్దే వద్దు
  • కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ల ద్వారా దరఖాస్తు చేస్తే మంచిది
  • పోలీసు నియామక మండలి సూచన


హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ కొలువుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులూ జాగ్రత్త! ఓసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే కుదరదు. అందుకే.. దరఖాస్తులో వివరాలు భర్తీ చేసుకున్న తర్వాత ఓసారి జాగ్రత్తగా సరిచేసుకొని ఆ తర్వాతే సబ్మిట్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసుకోవాలి! ఈ మేరకు పోలీస్‌ నియామక మండలి స్పష్టం చేసింది. పోలీసు పోస్టుల దరఖాస్తులకు ఎడిట్‌ సదుపాయం ఉండదు అని, ఒక్కసారి దరఖాస్తు దాఖలు చేస్తే సవరించడం సాధ్యం కాదని, దరఖాస్తుల్లో తప్పులకు అభ్యర్థులే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణ సమయంలో అభ్యర్థులకు తలెత్తుతున్న సందేహాలపై నియామక మండలి మంగళవారం వివరణ ఇచ్చింది.


పోస్టులకు దరఖాస్తులను ఫోన్ల ద్వారా చేయొద్దని.. కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టా్‌పతోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేసింది. ఇతర రాష్ట్రాల అభ్యర్థులు 17,294 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని, వారికి ఎలాంటి రిజర్వేషన్‌ వర్తించదని పేర్కొంది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయిస్తామని, 5 శాతం ఉన్న నాన్‌లోకల్‌ కేటగిరిలో మాత్రమే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు అర్హులని స్పష్టం చేసింది. పోస్టులన్నింటినీ ఒకే మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవాలని, ఒక్కో పోస్టును ఒక్కో మొబైల్‌ నంబర్‌తో దరఖాస్తు చేసుకోవద్దని స్పష్టం చేసింది.  ఏదైనా కేసులో కోర్టులు దోషులుగా తేల్చిన వ్యక్తులు పోలీస్‌ పోస్టులకు అనర్హులని పేర్కొంది. ఈ విషయాన్ని దాచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తారని, ఉద్యోగంలో చేరాక వాస్తవాలు తెలిస్తే సర్వీస్‌ నుంచి తొలగిస్తారని స్పష్టం చేసింది.


అన్ని పోస్టులకు ఒకేసారి దరఖాస్తు చేసుకోవాలనే నిబంధనేమీ లేదని, ఈ నెల 20 రాత్రి 10 గంటల వరకు ఎప్పుడైనా దరఖాస్తు చేయొచ్చునని వెల్లడించింది. అయితే ఒకే యూజర్‌ ఐడీలో అన్ని పోస్టులకు దరఖాస్తు చేయాలని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయోసడలింపు వర్తించదని, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సర్వీ్‌సను బట్టి ఐదేళ్లవరకు వయోసడలింపు ఉంటుందని వెల్లడించింది. ట్రాన్స్‌కో, డిస్కం, జెన్‌కో, ఆర్టీసీ, మునిసిపాలిటీలు, స్థానికసంస్థల ఉద్యోగులకు వయోసడలింపు వర్తించదని తెలిపింది. ఇక ఆదివాసీ అభ్యర్థులకు మాత్రమే ఎత్తు పరంగా నిబంధనల్లో స్వల్ప మినహాయింపు ఉందని,  అన్ని వర్గాల అభ్యర్థులకు ఈ నిబంధన 167.6 సెంటీమీటర్లుగా ఉందని, ఆదివాసీ అభ్యర్థుల ఎత్తు 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుందని వెల్లడించింది. 

Read more