ఆ ప్రేమ అనంతం

ABN , First Publish Date - 2021-12-31T05:35:56+05:30 IST

మహమ్మద్‌ ప్రవక్త వద్దకు కొందరు మహిళలు ఖైదీలుగా వచ్చారు. వారిలో ఒక మహిళ రొమ్ముల నుంచి పాలు ఉబుకుతున్నాయి. ఆమె కంగారుగా అటూ ఇటూ పరుగెడుతోంది.

ఆ ప్రేమ అనంతం

మహమ్మద్‌ ప్రవక్త వద్దకు కొందరు మహిళలు ఖైదీలుగా వచ్చారు. వారిలో ఒక మహిళ రొమ్ముల నుంచి పాలు ఉబుకుతున్నాయి. ఆమె కంగారుగా అటూ ఇటూ పరుగెడుతోంది. ఖైదీలలో ఒక పిల్లవాడిని చూసి, ఎత్తుకుంది. ఎవరో తెలియని ఆ పసికందుకు పాలు పట్టసాగింది. 


అప్పుడు హజ్రత్‌ ఉమర్‌ బిన్‌ ఖత్తాబ్‌ లాంటి అనుయాయులను ఉద్దేశించి దైవప్రవక్త మాట్లాడుతూ ‘‘ఆ మహిళను చూశారా? మీరేమనుకుంటున్నారు? ఆమె తన దగ్గర ఉన్న పిల్లవాడిని అగ్నిలో పడేస్తుందని అనుకుంటున్నారా?’’ అని అడిగారు.

‘‘లేదు, లేదు. ఆమె ఎన్నడూ అలా చేయదు’’ అన్నారు అనుయాయులు.

‘‘ఆ స్త్రీ తన పిల్లవాడిని ఎంతగా ప్రేమిస్తుందో, అలాగే దైవం తన దాసుల్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు’’ అన్నారు దైవప్రవక్త.


ఒక హదీసులో హజ్రత్‌ ఉమర్‌ ఇలా చెప్పారు: 

‘‘మేము ప్రియప్రవక్త దగ్గర కూర్చొని ఉన్నాం. అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను దుప్పటి కప్పుకొని ఉన్నాడు. అతని చేతిలో ఏదో వస్తువు ఉంది. దాన్ని దుప్పటిలో చుట్టుకొని వచ్చాడు. అతను దైవప్రవక్తతో నేను ఒక అడవిలోంచి వెళుతున్నప్పుడు పిచ్చుక పిల్లల అరుపులు విన్నాను. వాటిని పట్టుకొని దుప్పటిలో ఉంచుకున్నాను. ఇంతలో ఆ పిల్లల తల్లి అక్కడికి వచ్చింది. నా తలమీద గిరికీలు కొట్టసాగింది. నేను కప్పిన దుప్పటి తొలగించగానే... పిల్లలపై ఆ తల్లి వాలింది. నేను దాన్ని కూడా దుప్పటిలో చుట్టేశాను. అవి దుప్పటిలోనే ఉన్నాయి’’ అని చెప్పాడు. 


‘‘వాటిని అక్కడ పెట్టు’’ అని చెప్పారు దైవప్రవక్త. 

ఆ వ్యక్తి వాటిని అక్కడే పెట్టేశాడు. దుప్పటి తొలగించాడు. తల్లి తన పిల్లలను రెక్కలతో కప్పి ఉంది. 

‘‘ఆ తల్లికి పిల్లల మీద ఉన్న అవ్యాజ ప్రేమ మీకు ఆశ్చర్యంగా కనపడవచ్చు. సత్యమైన ధర్మాన్ని నాకు అందించి, నన్ను ఇక్కడకు పంపిన ఆ దైవం తోడుగా చెబుతున్నా... దైవం మానవుల మీద ఇంతకన్నా ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. ఒక తల్లికి తన పిల్లల మీద ఉండే ప్రేమ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ దైవానికి మానవుల పట్ల ఉంది. ఆయన ప్రేమ అనంతం’’ అని చెప్పారు. ‘‘ఈ పక్షిని, దాని పిల్లలను ఎక్కడ నుంచి తీసుకువచ్చావో అక్కడ వదిలి పెట్టిరా’’ అని ఆ వ్యక్తిని ఆదేశించారు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-12-31T05:35:56+05:30 IST