ఆ అమ్మ కల నిజమవుతోంది!

ABN , First Publish Date - 2021-04-07T05:30:00+05:30 IST

ఎంత నష్టం వచ్చినా, కరోనా వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా రూపాయికే ఇడ్లీ అందించాలనే

ఆ అమ్మ కల నిజమవుతోంది!

ఎంత నష్టం వచ్చినా, కరోనా వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా రూపాయికే ఇడ్లీ అందించాలనే సంకల్పాన్ని ఆమె విడిచిపెట్టలేదు.తోటివారికి సాయపడాలనే ఆమె మంచితనం మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రతో సహా ఎందరో ప్రముఖులను కదిలించింది. సౌకర్యమైన ఇల్లు కావాలనుకున్న ఇడ్లీ అమ్మ కలను అదే ఇప్పుడు నిజం చేస్తోంది.


తమిళనాడు కోయంబత్తూరు శివార్లలోని వడివేలంపాళ్యం గ్రామానికి వెళ్ళి ‘కమలత్తాళ్‌’ అని అడిగితే ఎవరన్నట్టు చూస్తారు. అదే ‘ఇడ్లీ అమ్మ’ అనగానే ‘‘ఆవిడా!’’ అంటూ కమలత్తాళ్‌ నడుపుతున్న చిన్న దుకాణానికి దారి చూపిస్తారు. ఎనభయ్యేడేళ్ళ కమలత్తాళ్‌కు ఆ ఇడ్లీ కొట్టే సర్వస్వం. గత ముప్ఫై ఏళ్ళుగా అక్కడే ఆమె ఇడ్లీలు అమ్ముతున్నారు. అది కూడా ఒక ఇడ్లీ రూపాయికే! 


‘ఈ వయసులో ఇలా కష్టపడుతూ, ఇంత తక్కువ ధరకు ఇడ్లీ అమ్మాల్సిన అవసరం ఏముంది?’ అని ఎవరైనా అడిగితే ఆమె నవ్వేస్తారు. ‘‘రోజువారీ కూలీలు, చిన్న చిన్న పనులు చేసుకొనేవాళ్ళ కోసం నేను ఒక్క రూపాయికే ఇడ్లీ  అమ్ముతున్నా. దీనివల్ల వాళ్ళు కొంచెం డబ్బు మిగుల్చుకోగలిగితే అది వాళ్ళ కుటుంబాలకు పనికొస్తుంది’’ అంటారు కమలత్తాళ్‌. నలుగురికీ సాయం చెయ్యాలనే మంచి మనసున్న ఆమె త్వరలో సొంత ఇంటికి యజమాని కాబోతున్నారు. మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ఆమె కోసం ఇల్లు కట్టిస్తున్నారు. కమలత్తాళ్‌ నివసించడానికీ, ఇడ్లీల తయారీ, అమ్మకానికి వీలుగా ఉండే ఇంటికి మహీంద్రా గ్రూప్‌ రియల్‌ ఎస్టేట్‌ విభాగమైన మహీంద్రా లివింగ్‌ స్పేసెస్‌ రూపకల్పన చేస్తోంది. 



ఆనంద్‌ మహీంద్ర దృష్టిలో పడ్డారిలా

 రెండేళ్ళ కిందట ఈ ఇడ్లీ అమ్మ కథ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో అనేకమంది ప్రముఖులు కమలత్తాళ్‌కు సాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. ‘‘ఇడ్లీ అమ్మకు ఎల్‌పీజీ స్టవ్‌ కొని పెట్టి, ఆమె వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా’’ అంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఈ సంగతి తెలిసి కోయంబత్తూరులోని భారత్‌ గ్యాస్‌ కంపెనీ ఆమెకు ఎల్‌పీజీ కనెక్షన్‌, స్టవ్‌ అందజేసింది. కమలత్తాళ్‌కు సాయం చేస్తానని ఇచ్చిన హామీని ఆనంద్‌ మహీంద్ర మరచిపోలేదు. నివాసానికీ, వ్యాపారానికీ అనువుగా ఉండే సొంత ఇల్లు ఉంటే బాగుంటుందన్న ఆమె కలను నిజం చేయాలనుకున్నారు.


‘‘వేరొకరి స్ఫూర్తిమంతమైన కథలో ఒక చిన్న భాగం పంచుకొనే అవకాశం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఇడ్లీ అమ్మగా పేరు పొందిన కమలత్తాళ్‌ ప్రయాణంలో చిన్న పాత్ర పోషించే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు. ఇడ్లీలు తయారు చేసి, అమ్మడానికి వీలైన ఒక దుకాణంతో కలిసి ఉన్న ఇంటికి ఆమె త్వరలోనే యజమానురాలు కాబోతోంది’’ అని ఇటీవల ఆనంద్‌ మహీంద్రా  ట్వీట్‌ చేశారు. ఈ మధ్యే ఆమె పేరిట భూమి రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయింది. 


లక్‌డౌన్‌లోనూ...

ప్రతిరోజూ ఉదయం అయిదు గంటలకు దైవ ప్రార్థనతో ఇడ్లీ అమ్మ దినచర్య మొదలవుతుంది. సాంబార్‌ తయారీ కోసం దినుసులు, కాయగూరలను తన కుమారుడు పురుషోత్తమన్‌తో కలిసి వెళ్ళి  తెస్తారు కమలత్తాళ్‌. ఆ తరువాత చట్నీని రోలులో స్వయంగా రుబ్బుతారు. రోజుకో చట్నీ చేస్తారు. ఉదయం ఆరుగంటలకల్లా వేడి వేడి ఇడ్లీలు, చట్నీ, సాంబార్‌ సిద్ధం చేస్తారు.


మధ్యాహ్నం వరకూ... రోజుకు దాదాపు ఆరువందల ఇడ్లీలు అమ్ముతారు. ఆ తరువాత ఇంటి పనుల్లో మునిగిపోతారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలోనూ తన దుకాణాన్ని కమలత్తాళ్‌ కొనసాగించారు. అయితే సరుకులు దొరకడం కష్టమవడంతో కమలత్తాళ్‌ ఇడ్లీల రుచి చూసిన వలస కార్మికులు ఆమెకు చేయూతనిచ్చారు.    నష్టాలు వస్తున్నప్పటికీ తన సంకల్పానికి ఆమె కట్టుబడ్డారు. ఆదే కమలత్తాళ్‌ను ఎన్నో మనసులను గెలిచేలా చేసింది.




కరోనా మొదలైనప్పటి నుంచీ పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఇడ్లీ ధర పెంచాలని కొందరు సూచించారు. మా ఇడ్లీ కొట్టుకు  రోజూ వచ్చే వాళ్ళు కూడా ‘ధర కొంచెం పెంచవచ్చు కదా!’ అన్నారు. కానీ నా మనసు అంగీకరించలేదు. వీలైనంత వరకూ ఒక ఇడ్లీ రూపాయికే ఇవ్వాలన్నది నా తాపత్రయం’’ అంటారు కమలత్తాళ్‌. 


Updated Date - 2021-04-07T05:30:00+05:30 IST