రైతు గ్రూపులకు షాక్‌!

ABN , First Publish Date - 2021-01-08T04:35:28+05:30 IST

రైతు గ్రూపులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల పేరుతో ట్రాక్టర్‌, యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతులు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ గ్రూపులకు పరికరాలకు సంబంధించి వ్యవసాయ అధికారులు మంజూరు ఉత్తర్వులు సైతం ఇచ్చారు. తీరా యాంత్రీకరణ పరికరాలను ఎంపిక చేసుకునే సమయంలో జాబితా నుంచి ట్రాక్టర్‌ను తీసేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతు గ్రూపులకు షాక్‌!
ట్రాక్టర్‌తో దున్నుతున్న రైతు

‘కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల’ ద్వారా ట్రాక్టర్ల మంజూరు లేనట్టే 

ప్రభుత్వ నిర్ణయంపై రైతుల అసంతృప్తి

మిగతా పరికరాలు తీసుకునేందుకు అనాసక్తి

(ఇచ్ఛాపురం రూరల్‌)

రైతు గ్రూపులకు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల పేరుతో ట్రాక్టర్‌, యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతులు గ్రూపులుగా ఏర్పడి బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ గ్రూపులకు పరికరాలకు సంబంధించి వ్యవసాయ అధికారులు మంజూరు ఉత్తర్వులు సైతం ఇచ్చారు. తీరా యాంత్రీకరణ పరికరాలను ఎంపిక చేసుకునే సమయంలో జాబితా నుంచి ట్రాక్టర్‌ను తీసేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ట్రాక్టర్‌ ఇవ్వకుండా ఇతర యాంత్రీకరణ పరికరాలు తీసుకొని ఏం చేసుకోవాలంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 820 రైతు భరోసా కేంద్రాల ద్వారా 808 రైతు సంఘాలను అధికారులు గుర్తించారు. అందులో 771 రైతు గ్రూపులకు కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు మంజూరు చేశారు. రైతు భరోసా కేంద్రాల పరిధిలో రైతు సంఘాలు తీసుకున్న యాంత్రీకరణ పరికరాలను స్థానిక రైతులకు అద్దెకు ఇచ్చేలా ఒప్పందం రాయించుకున్నారు. రెండు నెలల కిందటే బ్యాంక్‌ ఖాతాలు తెరిచారు. ఒక్కో సంఘానికి రూ.12 లక్షల నుంచి రూ. 15 లక్షల విలువైన యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందులో 40 శాతం ప్రభుత్వం సబ్సిడీ వర్తింపజేసింది. సంఘం తరుపున 10 శాతం మొత్తాన్ని చెల్లించాలని షరతు పెట్టారు. మిగిలిన మొత్తం ఏడీసీసీ బ్యాంకులో రుణ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం యాంత్రీకరణ పరికరాలు ఎంపిక చేసుకునే సమయంలో ట్రాక్టర్‌ ఇవ్వడం లేదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా యాంత్రీకరణ పరికరాలను తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. గ్రూపులుగా ఏర్పడి.. బ్యాంకు ఖాతాలు తెరిచిన తర్వాత ఇలా ప్రకటించడం అన్యాయమని వాపోతున్నారు. ట్రాక్టర్లు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 


ముందుగా యంత్ర పరికరాలు 


రైతు గ్రూపులకు ముందుగా రూ.15 లక్షలతో యంత్ర పరికరాలు అందజేయాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వాటిని అందజేసిన తరువాత ట్రాక్టర్లు కావలసిన వారు వ్యవసాయ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు చేసుకుంటే వారికి మరో విడతలో ట్రాక్టర్లు మంజూరవుతాయి.

- కె.శ్రీధర్‌, వ్యవసాయశాఖ జేడీ.

Updated Date - 2021-01-08T04:35:28+05:30 IST