వివేకా హత్య కేసుతో సంబంధం లేదని అవినాశరెడ్డి, శంకర్‌రెడ్డిలతో ప్రమాణం చేయిస్తారా ?

ABN , First Publish Date - 2022-01-17T05:30:00+05:30 IST

వివేకా హత్య కేసుతో తమకెలాంటి సంబంధం లేదని ఎంపీ వైఎస్‌ అవినాశరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలతో ప్రమాణం చేయించగలరా అని తనపై ఆరోపణలు చేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సవాల్‌ విసిరారు.

వివేకా హత్య కేసుతో సంబంధం లేదని   అవినాశరెడ్డి, శంకర్‌రెడ్డిలతో ప్రమాణం చేయిస్తారా ?
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

పార్టీలో చేరాలని మమ్మల్ని పెద్ద వ్యక్తులే పిలుస్తున్నారు

ప్రజల పక్షాన నిలబడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి

పులివెందుల టౌన, జనవరి 17: వివేకా హత్య కేసుతో తమకెలాంటి సంబంధం లేదని ఎంపీ వైఎస్‌ అవినాశరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలతో ప్రమాణం చేయించగలరా అని తనపై ఆరోపణలు చేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సవాల్‌ విసిరారు. అవినాశరెడ్డి అరెస్టు అయితే నాయకత్వ సమస్య వస్తుందని ఆ పార్టీలో చేరాలని మమ్మల్ని పెద్ద పెద్ద వ్యక్తులే పిలుస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో తాను అవినాశరెడ్డికి మద్దతు ఇవ్వకపోతే అతను బీజేపీలో చేరిపోతాడని వివేకా కుటుంబ సభ్యులకు జగన చెప్పిన మాట వాస్తవమో కాదో జగన, వివేకా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటే వాస్తవాలేమిటో తెలుస్తాయని ద్వితీయ శ్రేణి నేతలకు చురకలంటించారు. పార్టీ మారడంపై వ్యాఖ్యలు చేసే ముందు చరిత్ర తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. 2005లోనే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మారాలని మాపై ఒత్తిడి తెచ్చినా పార్టీ మార లేదన్నారు. తన మిత్రుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జగనతో మాట్లాడి పార్టీ మారినపుడు వారిని కూడా పార్టీలో చేర్పించాలని జగన తెలిపారని, అయితే పార్టీ మారేందుకు తిరస్కరించడం వల్ల 2006లో తన చిన్నాన్న హత్యకు గురయ్యారని ఆవేదన చెందారు. ఎవరికోసమైతే ప్రెస్‌మీట్‌ పెట్టారో ఆయన చరిత్ర కూడా తనకు బాగా తెలుసునన్నారు. దేవిరెడ్డి శంకర్‌రెడ్డి 2000లో తూగుట్ల మధుకు సంబంధించిన కేసులో ముద్దాయి అవుతారని తెలిసి సింహాద్రిపురం మండలానికి చెందిన ఒక నాయకుడి వద్దకు వెళ్లి ముగ్గురు విలేకరులతో కలిసి వేంపల్లె అతిథి గృహంలో కూర్చుని అప్పటి మంత్రి వీరారెడ్డితో ఫోన చేయించుకుని బయటపడిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పార్టీకి ద్రోహం చేసి ఉంటే ఈరోజు వైఎస్‌ కుటుంబంపై గెలిచే స్థాయికి ఎదిగేవాళ్లమేనా అని అన్నారు. డ్రిప్‌ విషయంలో ఉత్తమ రైతుగా గౌరవమైన వ్యక్తి అయిన బలరామిరెడ్డి సైతం ఖండించకపోగా ప్రోత్సహించడం బాధాకరమన్నారు. మనోహర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు వర్క్‌షాప్‌ పెట్టుకున్నారని ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర ధరల నియంత్రణలో విఫలం చెందిందన్నారు. టీడీపీ పాలనలో సామాన్యుడుకి అందుబాటులో నిత్యావసర ధరలు ఉండేవని, కానీ ఇప్పటి ప్రభుత్వంలో ఏ వస్తువు కొనాలన్నా కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని, దీనికి సంబంధించి ఫ్లెక్సీలు కడితే వాటిని పోలీసు అధికారులే దగ్గరుండి తొలగించడం ఎంత వరకు సబబు అన్నారు. గత నెల 25న ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భారీ ఎత్తున ఆ పార్టీ వారు ఫ్లెక్సీలను కట్టారన్నారు. అపుడు ఆ ఫ్లెక్సీలలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అయిన ఓ వ్యక్తి ఫొటోలు ఉంచడం కనిపించలేదా అని వైఎస్‌ అభిమానులను ఆయన ప్రశ్నించారు. అలాగే రాష్ట్ర డీజీపీ పోలీసులకు ఏం సూచనలు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మేము ప్రజా సమస్యలపై ఫ్లెక్సీలు కడితే పోలీసులు తొలగిం చడం అన్యాయమన్నారు. ఎవరిని ఇబ్బందులు పెట్టిన మా నాయకుడు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమస్యలపై నిరంతరం పోరాటపటిమ సాగిస్తూనే ఉంటామని, అంతే తప్ప భయపడే ప్రసక్తే లేదన్నారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర హెచఆర్‌డీ సభ్యుడు రామగోపాల్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2022-01-17T05:30:00+05:30 IST