Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏడాదిన్నర కిందట భర్త మృతి.. గ్రామ పెద్దల సమక్షంలో భార్యగా అంగీకరించి ఓ వ్యక్తి సహజీవనం.. ఇంతలోనే ఏమైందో..!

  • వివాహిత అనుమానాస్పద మృతి

విజయనగరం జిల్లా/కొమరాడ, డిసెంబరు 6 : చినఖేర్జిల పంచాయతీ లింగన్నదొరవలస గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఆదివారం రాత్రి మృతిచెందింది. సహజీవనం చేస్తున్న వ్యక్తే ఆమెను హత్య చేసి ఉండొచ్చునని స్థానికులు చెబుతున్నారు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లింగన్నదొరవలస గ్రామానికి చెందిన బాడంగి పార్వతి(29)కి ఎనిమిదేళ్ల కిందట కందివలస గ్రామానికి చెందిన మీసాల పోలీసుతో వివాహమైంది. వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో పోలీసు మృతి చెందాడు. పార్వతి ఇద్దరు పిల్లలతో సహా తండ్రి సోమరాయుడు వద్దకు చేరుకుంది. తండ్రి నాలుగు నెలల కిందట మృతి చెందాడు. అనంతరం గుమడ సీతమాంబపురం గ్రామానికి చెందిన జన్ని శ్రీకాంత (చంటి), పార్వతిని గ్రామ పెద్దల సమక్షంలో భార్యగా అంగీకరిస్తూ సహజీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే పార్వతి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలు తనకు ఇచ్చేయాలని శ్రీకాంత తరచూ హింసిస్తుండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగిన అనంతరం పార్వతి ఉరి వేసుకుని ఉండవచ్చునని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. విషయం తెలిసి సోమవారం ఉదయం పార్వతీపురం సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ ఎనహెచఏవీ విజయానంద్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. లోతుగా ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రయోగమూర్తి చెప్పారు. నిందితుడు శ్రీకాంతను గ్రామస్థులు నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. అతన్ని విచారణ కోసం సీఐ తన వెంట తీసుకువెళ్లారు.


అనాథలైన చిన్నారులు

అభం శుభం తెలియని చిన్నారులు ఆరేళ్ల సాయి, నాలుగేళ్ల ఉష అనాథలుగా మిగిలారు. తండ్రి అనారోగ్యంతో గతంలో మృతి చెందగా... తల్లి అనుమానాస్పద స్థితిలో మరణించింది. తమ తల్లికి ఏమైందో...ఈ జనమంతా ఎందుకు ఇంటికి వస్తున్నారో తెలియక ఆ చిన్నారులు అమాయకంగా చూస్తున్న చూపులు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి.

Advertisement
Advertisement