ఆ దారే.. నేడు రహదారైంది..

చిట్టడవుల్లో గానీ నట్టడవుల్లో గానీ ఎవరో ఒకరు దారి చేసుకొని నడిస్తే తప్ప దారులేర్పడవ్‌...

కాలక్రమంలో అవే రహదారులవుతాయ్‌.. ఆ ముందు నడిచాడే.. అతడే  గొప్పోడు!

అలాంటి వ్యక్తులు భావితరాలకు చిరస్మరణీయులు.. 

ఆ కోవకే వస్తారు స్వర్గీయ నందమూరి తారకరామారావు.


సమాజహితం కోసమే కళ.. అందుకే..పృధ్వీరాజ్‌కపూర్‌, బళ్లారి రాఘవ లాంటివారు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తమ నాటక సమాజాల ద్వారా ప్రజలను ఆదుకోవటానికి యత్నించేవారు. అయితే ఒక సినీనటుడు విపత్తులకు చలించడం.. స్పందించడం.. ఆదుకోవడానికి ప్రయత్నించడం ఎన్టీయార్‌తోనే మొదలు. 


1952లో ‘రాయలసీమ క్షామనివారణ నిధి’ పేరిట తోటి సినీకళాకారులంద ర్నీ తోడు తీసుకొని.. ఊరూరా తిరిగి లక్షల రూపాయలు వసూలు చేసి నాటి ప్రభుత్వానికి అందించారు ఎన్టీయార్‌. ప్రజాసేవే కళాకారుని పరమావధి అంటూ ఆనాడు ఎన్టీయార్‌ వేసిన ఆ తొలి అడుగే.. నేడు మన సినీకళాకారుల సేవాకార్యక్రమాలకు నాంది. ఎన్టీయార్‌ ఉన్నంతవరకూ తెలుగు చిత్రసీమకు ఆయనే నంబర్‌వన్‌. రెమ్యునరేషన్‌ పరంగా ఆయన దరిదాపుల్లో కూడా ఎవరూ ఉండేవారుకాదు. 1964లో తన రెండు సినిమాల పారితోషికం అక్షరాలా లక్ష రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు ఎన్టీయార్‌. అప్పట్లో లక్ష అంటే ఇప్పట్లో కోట్లకు పై మాట. అంతే కాదు.. దేశంలో తొలిసారి ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అనేది మొదలైంది ఎన్టీయార్‌ అందించిన ఆ విరాళంతోనే. ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు దాన్ని అవలంబించాయ్‌. 


1965లో జాతీయ రక్షణ నిధి కోసం తన రెండు సినిమాల సమయాన్ని వెచ్చించీ.. తోటి కళాకారులందర్నీ కూడగట్టుకొని ఎన్టీయార్‌ చేసిన కార్యక్రమం ఓ సంచలనం. పైగా తన రెండు సినిమాల పారితోషికాన్ని మించి పదింతలు వసూలు చేసి ప్రభుత్వానికి అందించారు ఎన్టీయార్‌. ‘ఎన్టీయార్‌ జాతీయ రక్షణ నిధి’ పేరిట ఆ నిధి ఏర్పాటైంది. ఓ వ్యక్తి పేరుతో జాతీయ రక్షణ నిధి ఏర్పాటు చేయడం.. దానికి ప్రభుత్వం అంగీకరించడం అదే తొలిసారి.. అదే ఆఖరుసారి. 


అగ్ని బాధితులకోసమనీ.. పోలీసు కుటుంబాల సహాయనిధికోసమనీ.. దివిసీమ ఉప్పెన.. ఇలా అనేకసార్లు.. ఎన్నో విపత్తులలో తనే ముందుండి.. తనతో పాటు పదిమందిని నడిపించి ప్రజలను ఆదుకున్నారు ఎన్టీయార్‌. ఆయనకు జనమంటే ఇష్టం. వారితో కలిసుండడం మరీ  ఇష్టం. ఆ సేవాతత్పరతే.. ఆ ఇష్టమే అనతికాలంలో ఆయన్ను ముఖ్యమంత్రి చేసింది. 


ఎన్టీయార్‌ పొలిటికల్‌ ఎంట్రీ తర్వాత సినిమావాళ్లు దేశవ్యాప్తంగా మూడంకెల స్థాయిలో చట్టసభల్లో అడుగుపెట్టారు. రాణించారు.. రాణిస్తున్నారు. దటీజ్‌ ఎన్టీయార్‌. రాజకీయ నాయకుల ఇళ్లముందు సినిమావాళ్లు పడిగాపులు పడటం కాదు. సినిమా వాళ్ల ఇళ్ల ముందు రాజకీయ నాయకులే పడిగాపులు పడే స్థాయికి సినిమావాళ్లను నిలబెట్టారు ఎన్టీయార్‌. నేడు ఆ మహానుభావుని జయంతి. 98 నిండి 99లోకి అడుగుపెడుతున్నారు. వందేళ్లు మనతో ఉండకపోయినా.. వెయ్యేళ్లకు సరిపడా ఆనందాన్ని పంచి తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నవరసాత్మక నటభేరి నందమూరికి నివాళులర్పిద్దాం. 

కొమ్మినేని వెంకటేశ్వరరావు


Advertisement
Advertisement