‘మళ్లీ బడి’కే మొగ్గు

ABN , First Publish Date - 2020-07-04T08:35:02+05:30 IST

కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం సందిగ్థంలో పడింది. ఇప్పటికే 40 రోజుల సమయం

‘మళ్లీ బడి’కే మొగ్గు

  • ఆన్‌లైన్‌ తరగతులు వద్దు
  • అవి పిల్లలకు శ్రేయస్కరం కాదు
  • 93 శాతం తల్లిదండ్రుల అభిమతం
  • తెలంగాణ యూటీఎఫ్‌ సర్వే
  • 22 వేలపైగా కుటుంబాలతో నిర్వహణ

హైదరాబాద్‌, జూలై 3 (ఆంధ్రజ్యోతి): కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభం సందిగ్థంలో పడింది. ఇప్పటికే 40 రోజుల సమయం గడిచిపోయింది. ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. మరోవైపు ఆన్‌లైన్‌ తరగతులంటూ హడావుడి సాగుతోంది. ఈ నేపథ్యంలో.. పాఠశాలల పునఃప్రారంభం, ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ సహా 21 అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌ యూటీఎఫ్‌) గత నెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. 33 జిల్లాల్లోని 489 మండలాల్లో జరిపిన సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. బడుల పునఃప్రారంభానికి 93.4 శాతం మంది విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖంగా ఉన్నారని, బోధన ఆఫ్‌లైన్‌ లోనే సాగాలని వారు అభిప్రాయపడుతున్నట్లు సర్వే పేర్కొంది. ఆన్‌లైన్‌ తరగతులు పిల్లలకు ఏమాత్రం ఉపయోగకరం కాదని 70.9 శాతం తల్లిదండ్రులు అభిప్రాయపడగా.. పాక్షికంగా ఉపయోగకరమని 24.7 శాతం మంది అన్నారు.


78 శాతం మంది తల్లిదండ్రులు ఆన్‌లైన్‌ తరగతుల కోసం పిల్లలకు స్మార్ట్‌ఫోన్లు ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ ‘జీరో ఎడ్యుకేషన్‌ ఇయర్‌’ చేయొద్దని, అలా చేస్తే ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్లు పెరిగే ప్రమాదముందని టీఎ్‌సయూటీఎఫ్‌ తన సర్వే నివేదికలో అభిప్రాయపడింది. తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు ఆఫ్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని కోరింది. కరోనా తీవ్రత లేని గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తూ వీలైనంత త్వరగా పాఠశాలల పునఃప్రారంభానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వైరస్‌ ఉన్నచోట పాఠశాలలు, టీవీలు, కంప్యూటర్లు సరఫరా చేయాలని, నెట్‌ సౌకర్యం కల్పించి ఆన్‌లైన్‌ బోధన చేయాలని కోరింది. నిపుణులతో కమిటీ వేసి.. త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించింది.


ఫోన్లకు డేటా కనెక్షన్‌ ఉన్నా.. అది ఆన్‌లైన్‌ తరగతులకు సరిపోతుందని 11 శాతం మంది తల్లిదండ్రులు మాత్రమే చెప్పారు. 30.3 శాతం మంది డేటా సరిపోదని, 58.7% డేటా కనెక్షనే లేదని సమాధానమిచ్చారు. 

సర్వే చేసినవాటిలో కేవలం 9.7% కుటుంబాలకే ఇంటర్‌నెట్‌ సౌకర్యం ఉంది. 68.3% పిల్లలు తమ పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం లేదని చెప్పారు. కేవలం 23.8% విద్యార్థులే ఉందని, 7.9ు పిల్లలు నెట్‌ సౌకర్యం ఉందనే విషయం తమకు తెలియదని పేర్కొన్నారు.

48 శాతం విద్యార్థులు తమ పాఠశాలల్లో టీవీలు లేవని చెప్పారు. 36.8 శాతం మంది పిల్లలు పాఠశాలల్లో టీవీలు వినియోగంలో ఉన్నాయని పేర్కొన్నారు. 10.4 శాతం మంది టీవీలున్నా.. వినియోగంలో లేవని అన్నారు.




Updated Date - 2020-07-04T08:35:02+05:30 IST