ఫోన్‌కు లింకు పంపి ఖాతా ఖాళీ చేశారు..

ABN , First Publish Date - 2021-01-17T08:50:46+05:30 IST

కేక్‌ల ఆర్డర్‌ ఇస్తామంటూ ఫోన్‌కు లింకు పంపారు... ఖాతాలో ఉన్న రూ.44 వేలు ఖాళీ చేశారు.

ఫోన్‌కు లింకు పంపి ఖాతా ఖాళీ చేశారు..

సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన

ఏపీ విశ్రాంత ముఖ్య కార్యదర్శి కుమార్తె


బంజారాహిల్స్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కేక్‌ల ఆర్డర్‌ ఇస్తామంటూ ఫోన్‌కు లింకు పంపారు... ఖాతాలో ఉన్న రూ.44 వేలు ఖాళీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విశ్రాంత ముఖ్య కార్యదర్శి కుమార్తె సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసముంటున్న ఏపీ విశ్రాంత ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునీత కుమార్తె అదితి పునీత బేకింగ్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న ఓ వ్యక్తి ఫోన్‌ చేసి తన పేరు శ్రీకాంత్‌వర్మ అని, తాను ఓ సైనికాధికారిని అని పరిచయం చేసుకున్నాడు. కేక్‌ల కోసం ఆర్డర్‌ ఉంద న్నాడు. ఆర్డరుకు సంబంధించిన డబ్బును ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లిస్తామన్నాడు. ఆర్మీ నిబంధనల ప్రకారం తాము పంపే లింకు క్లిక్‌ చేసి రూ.పది పంపించాల్సిందిగా అదితికి చెప్పాడు. సైనికాధికారి అని చెప్పడంతో ఆమె నమ్మేసింది. శ్రీకాంత్‌ పంపిన లింకు ద్వారా అదితి రూ.పది పంపించారు. కొద్దిసేపటికి అవి తిరిగి వచ్చాయి. మరికొద్ది సేపటికి అదితి ఖాతాలో నుంచి రూ.7,400 డ్రా అయ్యాయి. వెంటనే శ్రీకాంత్‌కు ఫోన్‌ చేసి డబ్బు డ్రా అయినట్టు చెప్పింది. పొరపాటున జరిగి ఉంటుందని శ్రీకాంత్‌ చెప్పాడు. వెంటనే తిరిగి పంపిస్తానని నమ్మబలికాడు. కానీ డబ్బు వెనక్కి రాకపోగా మరో రెండుమార్లు ఆమె ఖాతాలో నుంచి రూ.7,400, ఓసారి రూ.22 వేలు డ్రా అయ్యాయి. ఎటువంటి పాస్‌వర్డ్‌, యూపీఐ ఐడీ లేకుండానే డబ్బు డ్రా అయిపోవడంతో ఆమె ఆశ్చర్యపోయింది. వెంటనే బ్యాంకుకు ఫోన్‌ చేసి ఖాతాను స్తంభింపచేసి జూబ్లీహిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-17T08:50:46+05:30 IST