బాలికపై హత్యాయత్నం కేసులో.. నిందితుడికి పదేళ్ల జైలు

ABN , First Publish Date - 2020-07-14T10:24:24+05:30 IST

బాలికను వేధించి వెంటాడడమే కాకుండా ఆమెపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన

బాలికపై హత్యాయత్నం కేసులో.. నిందితుడికి పదేళ్ల జైలు

హైదరాబాద్‌ సిటీ/బర్కత్‌పుర, జూలై 13 (ఆంధ్రజ్యోతి): బాలికను వేధించి వెంటాడడమే కాకుండా ఆమెపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన యువకుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కాచిగూడ, సత్యనగర్‌ నివాసి చిట్కూరి భరత్‌(20) రాంకోఠిలోని కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అదే ప్రాంతంలో నివసించే బాలిక(17) శివం రోడ్డులోగల ఓ కాలేజీలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది.


ఏడాది కాలంగా భరత్‌ ఆమెను ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. బాలిక విషయం తల్లికి చెప్పగా 2019 జనవరి 7న ఆమె షీటీంకు ఫిర్యాదు చేసింది. విచారించిన షీటీం అధికారులు భరత్‌ను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి హెచ్చరించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. బాలికను వేధించసాగాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో బాలికపై కోపం పెంచుకున్నాడు. గత ఏడాది ఫిబ్రవరి 6న బాలిక కాలేజీకి ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరింది. అక్కడే మాటు వేసిన అతడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో ఆమెపై దాడి చేశాడు.


తల, మెడ, చేతులపై విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆమె అక్కడే రక్తపు మడుగులో కుప్పకూలిపోయింది. గమనించిన స్థానికులు, బాలిక తల్లి బయటకు రాగానే నిందితుడు పారిపోయాడు. సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు గాయపడిన బాలికను తొలుత కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో ఆస్పత్రికి.. తర్వాత మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజులపాటు చికిత్స పొందిన బాలిక కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. 


కాచిగూడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కె.సునీత నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

Updated Date - 2020-07-14T10:24:24+05:30 IST