పొద్దు వాలుతున్న వయస్సు

ABN , First Publish Date - 2020-02-10T10:49:09+05:30 IST

ఎంత పక్కా అనుకున్నా కళకళలాడిన శరీరం నీకు తెలియకుండానే కళ తప్పుతుంది నడక పూనికలో అప్పుడప్పుడు అడుగులు తడబడుతుంటాయి చూపు మసక మసక బారుతుంది అద్దాలు లేనప్పుడు అబద్దం ఆకారాల అపరిచయం ...

పొద్దు వాలుతున్న వయస్సు

ఎంత పక్కా అనుకున్నా

కళకళలాడిన శరీరం

నీకు తెలియకుండానే కళ తప్పుతుంది


నడక పూనికలో

అప్పుడప్పుడు అడుగులు తడబడుతుంటాయి


చూపు మసక మసక బారుతుంది

అద్దాలు లేనప్పుడు

అబద్దం ఆకారాల అపరిచయం


నీవు కోరుకోకుండానే

ఒక కర్ర నిన్ను చేయిపట్టి నడిపిస్తుంది


ఒక పలకరింపు ఎరుకను

ఎంతకూ పోల్చుకోలేక

మతి మరపు వెరపు 

నిన్ను భూకంప పీడితున్ని చేస్తుంది


దినమింతా

బతుకు పుల్లసీలుతుంది

ఇతరులకు చెప్పుకోలేక లోపల వుంచుకోరాక

కలయికలన్నీ మోకాలికి దెబ్బ తాకినట్టు

లోపల గాయం పానమెల్ల కొట్టుకుంటుంది


తళతళ నెరసిన తలను చూసి

ఇతరులు ‘తాతా’ అంటే

అంగీకరించక మది చిన్నబుచ్చుకుంటుంది


తిండి నిద్ర దినచర్యలన్నీ

కాలక్రమణికలోకి జారిపోయి

దించుకోరాని దిగులు బుగులు పెడుతుంది


వాలిని చంప పొంచివున్న బాణంలా

మృత్యువు ఫర్మానా విడుదల చేస్తుంది


ఎంతెంత రంగు వెలసి పోమని మురిసి పోతుంటామో

కాలం ఉతుకు ఉతుక్కు అంతా అవాక్కైపోతుంటాము


అవయవాలన్నీ ఉడిగిపోతున్నా

మనస్సు యోధలా

ఉక్కిరి బిక్కిరి అవుతుంది

జూకంటి జగన్నాథం


Updated Date - 2020-02-10T10:49:09+05:30 IST