Abn logo
Sep 27 2021 @ 00:17AM

చంద్రబాబును సీఎంగా చూడాలన్నదే లక్ష్యం : జేసీపీ

మాట్లాడుతున్న మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి


పుట్టపర్తి/పుట్టపర్తిరూరల్‌, సెప్టెంబరు 26 : చంద్రబాబును మళ్లీ నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా చూడాలన్నదే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తాము కృషి చేస్తామని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన, మాజీ ఎమ్యెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తికి వచ్చి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. కాగా, ఇటీవల    జిల్లాకు చెందిన మాజీ మంత్రులపై చేసిన విమర్శల చేసిన నేపథ్యంలో ఆయన పుట్టపర్తి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పట్టణంలోని కొంతమంది టీడీపీ అసమ్మతి నాయకుల ఇళ్లకు వెళ్లి  వారితో ఆయన చర్చించారు. అనంతరం పుట్టపర్తి మాజీ మున్సిపల్‌ చైర్మన పీసీ గంగన్న ఇంటి వద్ద కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరి మీద ద్వేషంతోనో.. వారిని కించపరచాలనో.. వారి మనోభావాలను దెబ్బతీయాలనో తానీ పర్యటన చేయడం లేదని స్పష్టం చేశారు. పార్టీలో తనకు సన్నిహితులను కలసి వెళ్లాలని రావడం జరిగిందన్నారు  కార్యకర్తలే పార్టీకి బలమైన పునాదులన్నారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలన్నదే తన ఉద్దేశమన్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో కొత్తవారికి, సమర్థులైన వారికి టికెట్లు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను టీడీపీలో ఉన్నందునే అధికార పార్టీ తనను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి, అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిందన్నారు. అయినా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో  మున్సిపల్‌ మాజీ చైర్మన పీసీ గంగన్న, లాయర్‌ క్రిష్టప్ప, కొత్తచెరువు రఘుపతి, నిషార్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 


కొత్తచెరువు : టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డికి కొత్తచెరువులో మైనార్టీ నాయకుడు నిషార్‌ అహమ్మద్‌ ఆదివారం షిర్డీసాయిబాబా చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా దర్శనానికి వెళ్లిన జేసీపీ.. మార్గమధ్యలో కొత్తచెరువులోని నిషార్‌ అహమ్మద్‌ నివాసంలో అల్పాహారం స్వీకరించారు.