వీధివ్యాపారుల అభ్యున్నతే ధ్యేయం

ABN , First Publish Date - 2020-08-12T10:20:58+05:30 IST

వీఽధివ్యాపారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వడమే లక్ష్యంగా వారికి ఆర్థిక సాయం అందిస్తూ

వీధివ్యాపారుల అభ్యున్నతే ధ్యేయం

వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వటమే లక్ష్యం

అందుకే రుణాలిచ్చి పోత్సాహమిస్తున్నాం

నగరంలో రెండు వ్యాపార సముదాయాలూ నిర్మిస్తున్నాం

రుణాల అందజేత కార్యక్రమంలో మంత్రి పువ్వాడ


ఖమ్మం కార్పొరేషన్‌, ఆగస్టు 11: వీఽధివ్యాపారుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వడమే లక్ష్యంగా వారికి ఆర్థిక సాయం అందిస్తూ ప్రోత్సాహమిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో గుర్తించిన 841 మందికి రూ.10వేల చొప్పున రూ.84.10లక్షల విలువగల చెక్కులను ఆయన కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి అందజేశారు. అలాగే నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికులకు జీవనజ్యోతి బీమాయోజన పాలసీలు, కార్మికుల కిట్లను అందచేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్‌ తరువాత ఖమ్మంలోనే వీధివ్యాపారులను గుర్తించామని, వారికి రుణాలు అందజేస్తున్నామన్నారు. రహదారులు, రద్దీ ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతూ వ్యాపారాలు చేసుకుంటున్న వారికోసం నగరంలో బస్టాండ్‌ ఎదురుగా, దుకాణ సముదాయాలను నిర్మిస్తున్నామన్నారు. కొవిడ్‌ కారణంగా వ్యాపారాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి అండగా నిలవాలన్న లక్ష్యంతో రూ.10వేల చొప్పున రుణాలు ఇస్తున్నామని, నగరంలో సుమారు 7వేల మంది వీధివ్యాపారులను గుర్తించామన్నారు. వారందరికి గుర్తింపుకార్డులతో పాటు రుణాలు ఇస్తామన్నారు.


జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీలలో కూడా వీదివ్యాపారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో వీధివ్యాపారుల్లో 2733 మంది పురుషులను, 4265మంది మహిళలను గుర్తించామన్నారు. ఇంతవరకు 6,711 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.10వేల రుణాన్ని సక్రమంగా చెల్లిస్తే కేవలం 20పైసలు వడ్డీ మాత్రమే పడుతోందన్నారు. వీధివ్యాపారులు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకోవద్దని, ప్రభుత్వం ఇచ్చే రుణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలని కోరారు.


కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌, ‘సుడా’ చైర్మన్‌ బచ్చు విజయ్‌కుమార్‌,  ఖమ్మం కార్పొరేషన్‌ మేయర్‌ జి.పాపాలాల్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, అదనపు కలెక్టర్‌ స్నేహలత, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రవీణ, మెప్మా డీఎంసీ సుజాత, మహిళాసమాఖ్య అధ్యక్షురాలు సుజాత, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-12T10:20:58+05:30 IST