Abn logo
Sep 23 2021 @ 19:45PM

కార్మిక చట్టాలను కాలరాస్తున్నారు: అజయ్‌‌కుమార్

విజయవాడ: దశాబ్దాలుగా రక్తం ధారపోసి సాధించుకున్న కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం.. లేబర్ కోడ్స్ పేరుతో కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్‌‌కుమార్ విమర్శించారు. కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు, విద్యుత్ బిల్లును రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని కోరుతూ ఈ నెల 27న సంయుక్త కిసాన్ మోర్చాఅఖిల భారత కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై కార్మిక, రైతు సంఘాల సమన్వయ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా అజయ్‌‌కుమార్ మాట్లాడుతూ సీఐటీయూ సెంట్రల్ సిటీ కమిటీ బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దు కోసం పది నెలలుగా ఢిల్లీలో రైతులు పోరాడుతున్నారని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం శత్రు సైన్యంపై దాడి చేసినట్లు.. అన్నదాతల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికే 550 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు వృద్ధి చేసిన దేశ సంపదను.. కార్పొరేట్లు, పెట్టుబడిదారులకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.


ఎంతోమంది ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా అమ్మడానికి పూనుకొన్నారని దుయ్యబట్టారు. మరోవైపు కోట్లాది మందికి ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి ఎత్తేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లు రద్దు చేసి.. మద్దతు ధర చట్టం తేవాలని డిమాండ్ చేశారు. అలాగే పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని కార్మిక, రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption