వార్షిక రుణ ప్రణాళిక 2,83,380 కోట్లు

ABN , First Publish Date - 2021-06-15T08:14:35+05:30 IST

‘కొవిడ్‌-19 ప్రభావంతో అంతటా అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. వైరస్‌ ఉధృతిని అడ్డుకోవడానికి కర్ఫ్యూలాంటి నియంత్రణలు విధించాం. దీనివల్ల ఆర్థికంగానూ పెనుభారం పడింది. అయినా రుణాల పంపిణీకి

వార్షిక రుణ ప్రణాళిక 2,83,380 కోట్లు

ఇందులో వ్యవసాయానికి 54 శాతం రుణాలు

‘సాగు’ రుణాలు భేష్‌!

కొవిడ్‌ భారం పడినా..114% లక్ష్యం సాధించాం

ఈ వృద్ధిలో బ్యాంకుల పాత్ర మరువలేం

ఇంకా వాటి సామర్థ్యం పెరగాలి

మరిన్ని అంశాల్లో ప్రభుత్వానికి తోడ్పడాలి

కౌలు రైతుకు రుణాలపై దృష్టి పెట్టాలి

ఎస్‌ఎల్‌బీసీ భేటీలో సీఎం జగన్‌ వినతి


అమరావతి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ‘కొవిడ్‌-19 ప్రభావంతో అంతటా అనూహ్య పరిస్థితులు తలెత్తాయి. వైరస్‌ ఉధృతిని అడ్డుకోవడానికి కర్ఫ్యూలాంటి నియంత్రణలు విధించాం. దీనివల్ల ఆర్థికంగానూ పెనుభారం పడింది. అయినా రుణాల పంపిణీకి నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా అధికంగానే చేపట్టాం. ప్రాధాన్య రంగాల్లో 105ు, వ్యవసాయ రంగంలో 114.6ు లక్ష్యాలు చేరుకున్నాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిదని.. కానీ కొన్ని అంశాల్లో వాటి సామర్థ్యం ఇంకా పెరగాలని అభిప్రాయపడ్డారు. అగ్రి ఇన్‌ఫ్రా, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో బ్యాంకర్ల తోడ్పాటు పెరగాలన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలతో 215వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రూ.2,83,380 కోట్లతో 2021-22వార్షిక రుణ ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌలు రైతులకు రుణాలపై కూడా మరింత దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరారు. ‘రాష్ట్రంలో పాఠశాలలు, వైద్యశాలల్లో నాడు-నేడు కింద పనులు చేపట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తెచ్చాం. సీబీఎ్‌సఈ గుర్తింపు కూడా ఇచ్చాం. తొలిదశలో 15,650 స్కూళ్లను అభివృద్ధి చేశాం. రెండో దశలో 16 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి అగ్రశ్రేణి నగరాలు మన రాష్ట్రంలో లేవు. అత్యుత్తమ వైద్యం కోసం ఆ నగరాలకే వెళ్లాల్సిన పరిస్థితి. అందుకే గ్రామ స్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల వరకు అభివృద్ధి చేస్తున్నాం. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు తీసుకొస్తున్నాం. 10 వేలకుపైగా రైతుభరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేశాం. 


వ్యవసాయ మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజీలు ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రొసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సాధికారత కోసం నాలుగేళ్ల పాటు చేయూత, ఆసరా పథకాల కింద లబ్ధిదారులైన మహిళల చేతిలో డబ్బులు పెడుతున్నాం. అమ్మఒడి కింద డబ్బులిస్తున్నాం. కొత్తగా 17 వేల గ్రీన్‌ ఫీల్డ్‌ కాలనీలు నిర్మిస్తున్నాం. 28.30 లక్షల ఇళ్లను పేదలకు నిర్మించబోతున్నాం. ఈ కాలనీలు మురికివాడలుగా మారకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. రానున్న మూడేళ్లలో వీటికి రూ.34వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ అంశాల్లో బ్యాంకుల సహకారం కావాలి’ అని సీఎం కోరారు.  కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా యూబీఐ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్‌ మాట్లాడారు. కౌలు రైతులను ఆదుకోవడం, ఆర్బీకేల్లో సేవలపై బ్యాంకు శాఖలు దృష్టి పెట్టాలని.. ఆత్మనిర్భర్‌ వంటి కేంద్ర పథకాలతో ఆర్ధిక రంగ పురోగతికి కృషి జరగాలని అన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో బ్యాంకుల సిబ్బందికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, కరికాల వలవన్‌, రావత్‌, సునీత, సత్యనారాయణ, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం సుధీకర్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్బీఐ జీఎం యశోదాబాయి కూడా పాల్గొన్నారు.


ఇదీ.. వార్షిక రుణ ప్రణాళిక 

2021-22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.2,83,380 కోట్లు. ఇందులో 54% రుణాలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. ఈ రంగంలో రూ.1,48,500 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొత్తం ప్రాఽథమిక రంగం కింద రూ.2,13,560 కోట్లు (75.36%) రుణాలివ్వాలని లక్ష్యంగా ఖరారుచేశారు. కాగా 2020-21లో వ్యవసాయ రంగ రుణాలు 114%, ఎంఎ్‌సఎంఈ 102%, ప్రాధాన్య రంగంలో ఇతర విభాగాల్లో 51%, మొత్తం ప్రాధాన్య రంగంలో 105ు, ప్రాధాన్యేతర రంగంలో 142%, మొత్తం వార్షిక ప్రణాళికలో 114ు లక్ష్యాలను సాధించగా.. గతేడాది కంటే ఈ ఏడాది రుణ లక్ష్యాన్ని 13% పెంచినట్లు బ్యాంకు అధికారులు వివరించారు. 


ఆరోగ్య ఆసరా విప్లవాత్మకం: సీఎం

అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలకు ఆరోగ్య ఆసరా కల్పించడం ఒక విప్లవాత్మక చర్యగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అభివర్ణించారు. ప్రతిరోజూ ఆరోగ్యశ్రీ కార్యక్రమంపై సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. అప్పుడే పేదవాడి కళ్లలో ఆనందం విరుస్తుందన్నారు. ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న హెల్త్‌ హబ్‌ విధానంపై రెండు వారాల్లో విధివిధానాలు ఖరారు చేయాలని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 పరిస్థితులు.. థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం వంటి అంశాలపై సోమవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ తదితరులు పాల్గొన్నారు. కరోనా మూడో వేవ్‌లో పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో చిన్నపిల్లల వైద్యం కోసం ప్రత్యేకంగా వైద్యులు.. నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందిని నెల రోజుల్లో నియమించాలని ఆదేశించారు. 

Updated Date - 2021-06-15T08:14:35+05:30 IST