Abn logo
May 28 2021 @ 00:00AM

ఆఖరి క్షణాల్లో ఆనందంగా!

జీవితం ఎప్పుడూ ఒకే విధంగా సాగదు. అనుకోని సంఘటనలు ఎన్నో సంభవిస్తాయి. ఆకస్మిక ఘటనలు ఎదురవుతాయి. వాటి విషయంలో ఒక్కొక్కరి స్పందన ఒక్కో విధంగా ఉంటుంది. అవి కష్ట నష్టాలను కలిగించేవి అయితే సాధారణ ప్రజలు భయాందోళనలకు గురవుతారు. నిరాశా నిస్పృహలకు లోనవుతారు. అవి సంతోషదాయకమైనవైతే ఉబ్బితబ్బిబ్బవుతారు. గర్వంతో విర్రవీగుతారు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్న వారి తీరు వేరుగా ఉంటుంది. ముఖ్యంగా జెన్‌ గురువుల స్పందన మరింత భిన్నంగా ఉంటుంది. 


జెన్‌ గురువు ఒకరు ఒక గ్రామ శివార్లలో నివసిస్తూ ఉండేవాడు. రోజూ పొద్దున్న వాహ్యాళి కోసం బాగా దూరంగా ఉన్న అడవిలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఒక రోజు అతను కొంత దూరం నడిచిన తరువాత ఎందుకో వెనక్కి తిరిగి చూశాడు. కొంత దూరంలో ఒక పులి కనిపించింది. అది కూడా ఆయనను చూసింది. మరొకరైతే భయంతో పరుగులు తీసేవారు. పులి కూడా అతణ్ణి పట్టుకోవడానికి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చేది. కానీ ఆ గురువు మామూలుగానే నడకను కొనసాగించాడు. పులి కూడా అతని వెనుక నెమ్మదిగా నడుస్తూ వస్తోంది.

ఆ గురువు నడిచి నడిచి ఒక కొండ అంచును చేరుకున్నాడు. అతని ముందు లోతైన లోయ ఉంది. వెనుక పులి వస్తోంది. కానీ ఆయన భయపడలేదు. చుట్టూ గమనిస్తే కొండ పై నుంచి లోయ వైపు పెరిగిన ఒక చెట్టు కనిపించింది. దాని కొమ్మలు లోయలో దూరంగా దిగుతున్నాయి. ఆ గురువు తను నిలబడిన స్థలం నుంచి లోయలోకి దిగుతున్న చెట్టు కొమ్మను పట్టుకున్నాడు. పులి సమీస్తోంది. అతను. కింద ఉన్న లోయలోకి చూశాడు. అక్కడ ఒక సింహం సంచరిస్తోంది. అంతేకాదు, అతను పట్టుకొని వేలాడుతున్న చెట్టు కొమ్మను రెండు ఎలుకలు కొరుకుతున్నాయి. తను పట్టు తప్పి లోయలోకి పడిపోవచ్చు. లేదా చెట్టు కొమ్మ ఏ నిమిషంలోనైనా తెగి, కొమ్మతో సహా లోయలోకి పడిపోవచ్చు. ఎలాగూ తనకు చావు తప్పదని అతనికి తెలిసిపోయింది. 

ఈలోగా అతనికి దగ్గరలో ఉన్న ఒక మరో కొమ్మ మీద పండ్లు కనిపించాయి. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరూ పండ్లను తిని ఆనందించలేరు కదా? అది అసంభవం. కానీ అతను పరిణతి ఉన్న గురువు. ఒక్కొక్క పండునూ కోసుకొని తినడం మొదలుపెట్టాడు. అతనికి మధురమైన అనుభూతి కలిగింది. ఒకవైపు పులి, మరోవైపు లోయ, లోయలో సింహం... తప్పదనుకున్న మరణం. ఇక తాను జీవించగలిగేది కొన్ని క్షణాలు మాత్రమే! ఆ కొద్ది క్షణాలనూ భయంతో కాకుండా ఆనందంగా గడపాలన్న ఆలోచన ఆయనకు కలిగింది. అదే ఆయనలో జ్ఞానజ్యోతిని వెలిగించింది. 

ఈ కథను ఓషో చెబుతూ ‘‘ఆ గురువు ఆ క్షణంలో బుద్ధుడయ్యాడు. చావు అంత సమీపంలో ఉన్న సమయంలో.. పులి, సింహం, లోయ, విరుగుతున్న చెట్టు కొమ్మ, చివరకు తానొక వ్యక్తిననే భావన... ఇవన్నీ ఆయనలో మాయమైపోయాయి. పండ్ల మాధుర్యం, ఆ క్షణాల్లోని జీవన మాధుర్యం... అవే మిగిలాయి’’ అని అంటారు. 

- రాచమడుగు శ్రీనివాసులు