‘క్యాపిటల్‌’పై దాడి హేయం

ABN , First Publish Date - 2021-01-08T07:27:46+05:30 IST

కేపిటల్‌ భవనంపై దాడిని అమెరికా చట్టసభ సభ్యులు ఖండించారు. ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్‌ భవనంపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు.

‘క్యాపిటల్‌’పై దాడి హేయం

  • మద్దతుదారులను హింసకు ప్రేరేపించిన ట్రంప్‌
  • ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడు
  • తక్షణమే విధుల నుంచి తొలగించాలి
  • అమెరికా చట్టసభ సభ్యుల డిమాండ్‌ 
  • దాడి అవమానకరం: మాజీ అధ్యక్షులు
  • ట్రంప్‌ను తక్షణమే తప్పించాలి: మీడియా
  • సోషల్‌ మీడియాలో ట్రంప్‌ వీడియో తొలగింపు


 వాషింగ్టన్‌, జనవరి 7: కేపిటల్‌ భవనంపై దాడిని అమెరికా చట్టసభ సభ్యులు ఖండించారు. ట్రంప్‌ మద్దతుదారులు కేపిటల్‌ భవనంపై దాడి చేయడాన్ని హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటనను అమెరికా ప్రజాస్వామ్యానికే చెరగని మచ్చగా అభివర్ణించారు. ‘‘చట్టసభకు ఎంపికైన సభ్యులుగా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ గెలుపును ధ్రువీకరించాల్సిన బాధ్యత మాపై ఉంది. అధ్యక్షుడు ట్రంప్‌ ఆ బాధ్యతను నిర్వర్తించకుండా మమ్మల్ని అడ్డుకునేందుకు యత్నించారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు అంతరాయం కలిగించారు’’ అని కాంగ్రెస్‌ సభ్యుడు స్టీవెన్‌ హార్స్‌ఫోర్డ్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు ఇతర సభ్యులూ మద్దతు పలికారు. ఇలాంటి ఘటనలు పూర్తిగా అవాంఛనీయమని, ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు వంటివని చెప్పారు.


‘‘కేపిటల్‌ భవనంపై జరిగిన దాడిని చూసిన తర్వాత ట్రంప్‌ను తక్షణమే తొలగించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అధ్యక్షుడిని అభిశంసించడంతో పాటు వెంటనే విధుల నుంచి తొలగించాల్సిందే’’ అని స్టీవెన్‌ అన్నారు. సాధ్యమైనంత త్వరగా ట్రంప్‌ను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించేందుకు రాజ్యాంగంలోని 25వ సవరణను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, కేబినెట్‌కు సూచించారు. ఈ పరిణామాలకు ట్రంప్‌ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పలువురు కాంగ్రెస్‌ సభ్యులు పేర్కొన్నారు.


క్యాపిటల్‌ భవనంపై దాడిని అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ కూడా తీవ్రంగా ఖండించారు. భారతీయ అమెరికన్‌ చట్టసభ సభ్యులు అమీ బెరా, ప్రమీలా జయపాల్‌, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి కూడా ఈ దాడిని ఖండించారు. చట్టసభ సభ్యులంతా ప్రాణభయంతో పరుగులు తీయాల్సి వచ్చిందని ట్వీట్‌ చేశారు.  


ట్రంప్‌కు ‘సోషల్‌’ షాక్‌!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తన గెలుపును అడ్డుకున్నారంటూ ట్రంప్‌ ఆరోపణలు చేసిన వీడియోను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లు తొలగించాయి. ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన అనంతరం ఈ వీడియోను తొలగించాయి.  


‘కేపిటల్‌’పై దాడి అవమానకరం

కేపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడికి పాల్పడడం అవమానకరమని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌, జిమ్మీ కార్టర్‌లు పేర్కొన్నారు. అధికార బదిలీ శాంతియుతంగా జరగాలని ఆకాంక్షించారు. రాజకీయాల కంటే దేశం ముఖ్యమని గుర్తించాలన్నారు.

కాగా కేపిటల్‌ భవనంపై తొలిసారి 1814లో దాడి జరిగింది. నిర్మాణం పూర్తయిన 14 ఏళ్లకే ఈ దాడి జరిగింది. నాడు జరిగిన యుద్ధంలో బ్రిటిష్‌ బలగాలు కేపిటల్‌ భవనంలోకి జొరబడి లూటీ చేశాయి. 




ట్రంప్‌ను తక్షణం తొలగించాలి: మీడియా

క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ మద్దతుదారులు దాడి చేయడాన్ని అమెరికా మీడియా తప్పుపట్టింది. ట్రంప్‌ది బెదిరింపు చర్యగా అభివర్ణించిన మీడియా.. ఆయన అధ్యక్ష పదవికి అనర్హుడని పేర్కొంది. తక్షణమే పదవి నుంచి తొలగించాలంది. ట్రంప్‌ను అభిశంసించాలని లేదా క్రిమినల్‌ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేసింది. క్యాపిటల్‌పై దాడి, హింసాత్మక ఘటనలకు ట్రంప్‌దే బాధ్యతని స్పష్టం చేసింది.


ట్రంప్‌ తన మద్దతుదారులను హింసకు ప్రేరేపించడం ద్వారా దేశద్రోహానికి పాల్పడ్డారని న్యూయార్క్‌ టైమ్స్‌ సంపాదకీయంలో పేర్కొంది. దాడి జరిగే సమయంలో తాము భయభ్రాంతులకు గురయ్యామని క్యాపిటల్‌ భవనంలో ఉన్న జర్నలిస్టులు పేర్కొన్నారు. హాలీవుడ్‌ ప్రముఖులు, సంగీత కళాకారులూ క్యాపిటల్‌పై దాడిని ఖండించారు. 


Updated Date - 2021-01-08T07:27:46+05:30 IST