అంతుపట్టని పోలీసుల వైఖరి

ABN , First Publish Date - 2020-06-06T08:27:15+05:30 IST

విశాఖపట్నం పోలీసులు పెద్దల మెప్పు పొందే..

అంతుపట్టని పోలీసుల వైఖరి

ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటనలో బాధితులకు న్యాయం కోరితే అరెస్టులు

ఇప్పటివరకూ కంపెనీకి సంబంధించి ఒక్కరిని కూడా విచారించని వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోలీసులు పెద్దల మెప్పు పొందే క్రమంలో నగర వాసుల విమర్శలపాలవుతున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌కి సంబంధించి పై నుంచి ఎటువంటి ఆదేశాలు ఉన్నాయో తెలియదు గానీ... ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఎవరు పల్లెత్తు మాట మాట్లాడినా సహించడం లేదు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేసినా ఊరుకోవడం లేదు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా... విశాఖపై విషవాయువులు చిమ్మిన ఆ కంపెనీకి వ్యతిరేకంగా వామపక్షాలు, మానవ హక్కుల వేదిక, ఇంకా పలు ప్రజాసంఘాలు జీవీఎంసీ గాంధీ బొమ్మ ముందు శుక్రవారం మౌనంగా నిరసన వ్యక్తంచేస్తే... దానిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిళ్లు తెచ్చారు. మరోవైపు గోపాలపట్నంలో మానవహారం ఏర్పాటుచేసేందుకు సిద్ధమైన సీపీఎం, సీఐటీయూ నాయకులు, కార్తకర్తలను అరెస్టు చేశారు.


ఎల్‌జీ పాలిమర్స్‌కు వ్యతిరేకంగా విశాఖలో ఏమీ జరగకూడదన్నట్టుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పాలిమర్స్‌ ఘటనలో 13 మంది వరకూ చనిపోయినా... ఇప్పటివరకు కంపెనీకి సంబంధించి ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. కనీసం అదుపులోకి తీసుకొని విచారించలేదు. అదే సంఘటనకు సంబంధించి వామపక్షాల వారిని ఇప్పటికి అనేకసార్లు అరెస్టులు చేశారు.

Updated Date - 2020-06-06T08:27:15+05:30 IST