నేలరాలిన ఆశలు..జిల్లా వ్యాప్తంగా 17.5 మిల్లీ మీటర్ల సగటు వర్షం

ABN , First Publish Date - 2020-10-15T06:44:51+05:30 IST

జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైతుల ఆశలు నేలరాలుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జిల్లా

నేలరాలిన ఆశలు..జిల్లా వ్యాప్తంగా 17.5 మిల్లీ మీటర్ల సగటు వర్షం

అత్యధికంగా కమాన్‌పూర్‌లో 29.6 మిల్లీ మీటర్లు

8 వేల ఎకరాల్లో నేల రాలి నీట మునిగిన వరి పంట

నల్ల బారుతున్న పత్తి, ఆందోళనలో రైతులు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రైతుల ఆశలు నేలరాలుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి, పార్వతీ బ్యారేజీల నుంచి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలి పెడుతున్నారు. కరీంనగర్‌ లోయర్‌ మానేరు డ్యామ్‌ గేట్లు ఎత్తడంతో మానేరు నది 50 వేలకు పైగా క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తున్నది. ఈ నీళ్లన్నీ గోదావరిలో కలుస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు 17.5మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా కమాన్‌పూర్‌ మండలంలో 29.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మంథనిలో 25.5, పెద్దపల్లిలో 24.9, జూలపల్లిలో 24.0, రామగిరిలో 19.8, ఓదెలలో 17.4, సుల్తానాబాద్‌లో 16.0, పాలకుర్తిలో 15.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలకు ఆయా మండలాల్లో కోతకు వచ్చిన వరి, పొట్ట దశలో ఉన్న వరి పంట నేలవాలి నీట మునిగింది. దీంతో రైతులు పెద్దఎత్తున నష్టాల పాలయ్యారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 8 వేల ఎకరాలకుపైగా వరి పంట నేల వాలింది. నీళ్లల్లో మునిగిన వరి గొలుసులను లేపి కడుతున్నారు.


ఈ సీజన్‌లో జిల్లాలో సాగవుతున్న పంటల్లో అత్యధికంగా వరి, పత్తి పంటలను రైతులు పండిస్తున్నారు. 2 లక్షల వరి పంటలో 65 శాతం సన్నరకం వరి పంటను రైతులు పండిస్తున్నారు. సన్నరకం వరి పంటకు ఎక్కువగా తెగుళ్లు వస్తుంటాయని, వాటికి మందులు పిచికారి చేసేందుకు అదనంగా 5 వేల రూపాయలు ఖర్చు అయ్యిందని రైతులు తెలిపారు. పంట నష్టంతో కోలుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట 12వేల ఎకరాల్లో దెబ్బతిన్నది. నెలరోజుల క్రితం నుంచి కురుస్తున్న వర్షాలకు పూత, కాత రాలిపోయింది. పత్తి కూడా నల్లబారుతున్నది. ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే అవకాశాలు లేవని రైతులు అంటున్నారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి, పత్తి పంటకు మాత్రం తీరని నష్టం జరిగిందని పంట నష్టాన్ని అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


బ్యారేజీలకు కొనసాగుతున్న వరద..

జిల్లాలోగల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువప్రాంతం నుంచి 1,99,770 క్యూసెక్కుల వరద వస్తుండగా, 19 గేట్ల ద్వారా 1,95,900 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ వరద అంతా పార్వతీ బ్యారేజీకి చేరుతుండడంతో 60 గేట్ల ద్వారా 1,95,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కరీంనగర్‌ మానేరు డ్యామ్‌ నుంచి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా మానేరులోకి వదిలి పెట్టడంతో జిల్లాలోని సుల్తానాబాద్‌, ఓదెల, కాల్వరాంపూర్‌, ముత్తారం, మంథనిలో ఉధృతంగా మానేరు ప్రవహిస్తున్నది. ఈ నీళ్లన్నీ అన్నారం వద్ద గల సరస్వతి బ్యారేజీలోకి వెళుతున్నాయి. 


పంట నష్ట పరిహారం అందించాలి- రాచెర్ల రాజు, రైతు, ఓదెల మండలం

అకాల వర్షాల వల్ల కోతకు వస్తున్న వరి పంట అంతా నేలవాలి నీట మునిగింది. మరో రెండు రోజులు గడిస్తే వరి మొలకలు వస్తుంది. గింజలు నల్లబారి పోతున్నాయి. నెలరోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వ అధికారులు ఎవరూ రావడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్ట పరిహారం చెల్లించాలి. 

Updated Date - 2020-10-15T06:44:51+05:30 IST