సీఎం కోర్టులో కొలువుల బంతి

ABN , First Publish Date - 2021-12-06T07:54:01+05:30 IST

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్న సర్కారు.

సీఎం కోర్టులో కొలువుల బంతి

  • ఉద్యోగ ఖాళీల భర్తీ ఊసెత్తని ప్రభుత్వం.. అన్ని శాఖల్లోనూ భారీగా ఖాళీలు
  • 24,82,888 
  • తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ)లో 
  • ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ కింద నమోదైన నిరుద్యోగుల సంఖ్య
  • 67,128 ఖాళీలు గుర్తించిన అధికారులు 
  • సీఎంవోకు చేరిన వివరాలు, జాబ్‌ క్యాలండర్‌
  • విద్యాశాఖలో మరో 22 వేల పోస్టుల ఖాళీ
  • అయినా భర్తీపై నిర్ణయం తీసుకోని సర్కారు
  • పదేళ్లుగా వెలువడని గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ 
  • నిరుద్యోగులకు తప్పని ఎదురుచూపులు
  • నెలల తరబడి కోచింగ్‌ సెంటర్లలోనే
  • రాష్ట్రంలో 29 లక్షల మంది నిరుద్యోగులు!


హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్న సర్కారు.. కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదు. దీంతో కోచింగ్‌ సెంటర్లలో చేరిన నిరుద్యోగులు నెలల తరబడి కోచింగ్‌ తీసుకుంటూనే ఉన్నారు. నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి విసిగిపోయిన కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటనలూ చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఖాళీలు భర్తీ అయితే తమకు పనిభారం తగ్గుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదు. ఖాళీల భర్తీ ఎప్పటినుంచి ప్రారంభిస్తారన్న అంశాన్ని తేల్చడంలేదు. అయితే ఉద్యోగాల భర్తీ బంతి ఇప్పుడు సీఎం కేసీఆర్‌ కోర్టులోనే ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయన నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో ఈ అంశంపై వారికే స్పష్టత లేకుండాపోయింది. ప్రతి క్యాబినెట్‌ సమావేశంలోనూ ఉద్యోగ ఖాళీల భర్తీపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా.. అటువంటిదేమీ జరగడంలేదు. వాస్తవానికి ఉద్యోగాల భర్తీ అంశం ఈ ఏడాది జూలై నుంచి ఎక్కువగా చర్చకు వస్తోంది. జూలై 13న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై చర్చించారు. అనంతరం ఏడాదిపాటు నోటిఫికేషన్లు జారీ చేసేలా ‘వార్షిక జాబ్‌ క్యాలండర్‌’ రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అప్పటికే అధికారులు గుర్తించిన ఖాళీల వివరాలను క్యాబినెట్‌కు సమర్పించారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. కానీ, దీనిపై సీఎం సంతృప్తి చెందలేదు. శాఖలు, జిల్లాలవారీగా పూర్తి వివరాలు సేకరించి నివేదించాలని ఆదేశించారు. దాంతో అధికారులు మళ్లీ కుస్తీ పట్టి.. రాష్ట్రంలో మొత్తం 67,128 పోస్టులు ఖాళీగాఉన్నాయని ప్రాథమికంగా తేల్చారు. ఈ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయంలో సమర్పించారు. 


సీఎం ఆదేశాల కోసం నిరీక్షణ..

ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వస్తే తప్ప.. ఉద్యోగ ఖాళీల భర్తీ విషయంలో తాము ముందుకు వెళ్లలేమని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఖాళీల వివరాలు, జాబ్‌ క్యాలండర్‌ను సీఎంవోలో అందజేసినా.. ముఖ్యమంత్రి ఎటూ తేల్చకపోవడంపై నిరుద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. సెప్టెంబరు 16న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఆశించారు. సమావేశంలో ఈ అంశం చర్చకు కూడా వచ్చింది. 50 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటన కూడా చేశారు. కానీ, ఎలాంటి ముందడుగు పడలేదు. ఓసారి ఉద్యోగ సంఘాల నేతలు కలిసినప్పుడు... ఉద్యోగుల సర్దుబాటు జరుగుతోందని, జిల్లాలు, జోన్లవారీగా ఖాళీలను పూర్తి స్థాయిలో గుర్తించి ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. మరోసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో 70-80 వేల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కానీ, ఆ తరువాత దీని ప్రస్తావనే లేకుండాపోయింది. నవంబరు 29న జరిగిన క్యాబినెట్‌ భేటీలోనైతే ఉద్యోగాల భర్తీ అంశం చర్చకు కూడా రాలేదు.


విద్యాశాఖలో 22 వేల టీచర్‌ పోస్టుల ఖాళీలు..

రాష్ట్రంలో అన్ని శాఖల కంటే విద్యాశాఖలోనే ఎక్కువ ఖాళీలున్నాయి. ఏకంగా 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. ఇతర శాఖల్లో గుర్తించిన 67 వేల పోస్టులు కాకుండానే విద్యాశాఖలో 22 వేల ఖాళీలు తేలాయి. మొత్తం మంజూరైన టీచర్‌పోస్టులు 1.31 లక్షలు ఉండగా, ప్రస్తుతం 1.09 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. మిగిలిన 22 వేల పోస్టులను భర్తీ చేసే విషయంపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడంలేదు. హేతుబద్ధీకరణ పేరుతో కొన్ని పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేసే ఆలోచనలో ఉంది. ఉపాధ్యాయులను కూడా హేతుబద్ధీకరించాలని సర్కారు యోచిస్తోంది. గురుకులాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నందున.. ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకత పెద్దగా లేదన్న ధోరణిలో ఉంది. అందుకే ఉపాధ్యాయ పోస్టులను ఇప్పట్లో భర్తీ చేయకపోవచ్చని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. 


29 లక్షల మంది నిరుద్యోగులు..

తెలంగాణ ఆవిర్భావం నుంచి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కొత్త రాష్ట్రంలో కొలువులు వస్తాయని ఆశ పడ్డా.. ఊహించిన స్థాయిలో నోటిఫికేషన్లు వెలువడలేదు. ప్రభుత్వం మాత్రం 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామంటోంది. ఇందులో పోలీసు శాఖ పోస్టులు 30 వేలు, విద్యుత్తు శాఖలోని ఆర్టిజన్‌ పోస్టులు 24 వేలు, పంచాయతీరాజ్‌ శాఖలోని పంచాయతీ సెక్రటరీ పోస్టులు 9,355 వరకు ఉన్నాయి. అంటే... ప్రభుత్వం భర్తీ చేశామని చెబుతున్న 1.30 లక్షల పోస్టుల్లో 63 వేలకు పైగా ఈ పోస్టులే ఉన్నాయి. ఇతర శాఖల్లోని ముఖ్యమైన పోస్టులు భర్తీ కాలేదు. ముఖ్యంగా జిల్లాల్లో ఉండే జూనియర్‌ అసిస్టెంట్‌, డ్రైవర్‌, అటెండర్‌ వంటి కింది స్థాయి పోస్టులు భర్తీ కాలేదు. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి విభాగాధిపతుల కార్యాలయాల్లో(హెచ్‌వోడీ) పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు వెలువడక దశాబ్దం పైగా గడిచిపోయింది. ఇలా ఎప్పటికీ పోస్టులు భర్తీ కాకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ)లో ‘వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌’ కింద నమోదైన నిరుద్యోగుల సంఖ్యే 24,82,888 వరకు ఉంది. ఇంకా రిజిస్ట్రేషన్‌ చేసుకోనివారి సంఖ్య చాలా ఉందని నిరుద్యోగ సంఘాలు వివరిస్తున్నాయి. దాదాపు 29 లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని చెబుతున్నాయి. 

Updated Date - 2021-12-06T07:54:01+05:30 IST