కొత్త అధ్యాయానికి నాంది

ABN , First Publish Date - 2021-04-01T05:30:00+05:30 IST

హీనా హనీఫా... నిన్నటి వరకు ఓ సామాన్యురాలు. ఇప్పుడు... నూతన అద్యాయానికి నాంది పలికిన అసామాన్యురాలు.

కొత్త అధ్యాయానికి నాంది

హీనా హనీఫా... నిన్నటి వరకు ఓ సామాన్యురాలు. ఇప్పుడు... నూతన అద్యాయానికి నాంది పలికిన అసామాన్యురాలు. హిజ్రా అనే కారణంతో కాలేజీ ఎన్‌సీసీలో చేర్చుకోం పొమ్మంటే... కేరళ హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేసింది. ఆమె పోరాట ఫలితంగా దశాబ్దాల కిందటి ‘ఎన్‌సీసీ’ చట్టం మారింది. ఎన్‌సీసీ కేడెట్‌లలో హీనా పేరు చేరింది. 


ఈ చారిత్రక విజయం హీనాదే కాదు... హక్కుల కోసం పోరాడుతున్న ఆమెలాంటి ట్రాన్స్‌జెండర్స్‌ అందరిది... 


కేరళ రాష్ట్రం... మణప్పురం జిల్లా... సంప్రదాయ ముస్లిం కుటుంబం... ముగ్గురు సోదరీమణులకు సోదరుడిగా జన్మించిన హీనా హనీఫా జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యేవరకు తనేమిటో తనకు తెలియదు. పన్నెండో తరగతిలో ఉండగా తను మగపిల్లాడు కాదు... హిజ్రా అని అర్థమైంది. ఆ క్షణం ఆమె కన్నీటి ధారలు ఆగలేదు. అది మొదలు ఇంట... బయట ఎన్నో సమస్యలు... అవమానాలు... అవహేళనలు.


‘‘ఇంట్లో వాళ్ల నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. విషయం తెలిసి నా తోబుట్టువులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కొళికోడ్‌లో కౌన్సెలింగ్‌కు తీసుకువెళ్లారు. ఆ తరువాత నాతో అన్ని రకాల సంబంధాలూ తెంచేసుకున్నారు’’ అంటూ భావోద్వేగానికి లోనవుతుంది హనీఫా. కొంత సమయం తీసుకున్నా... వాటి నుంచి పూర్తిగా బయటపడింది ఆమె. మతవిశ్వాసాలను ఆచరిస్తూనే లౌకికవాద భావాలతో ముందడుగు వేసింది.  



ఇల్లు వదిలి... 

ఎప్పుడైతే తనపై తనకు ఓ స్పష్టత వచ్చిందో ఇక అప్పటి నుంచి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది హనీఫా. 2017లో ఇల్లు విడిచి తనదైన ప్రపంచానికి దారులు వెతుక్కుంది. ‘‘ఇంట్లో నుంచి వచ్చేశాను. కానీ ఎలా బతకాలి? తిరువనంతపురం వెళ్లాను. అక్కడ ప్రభుత్వం ఆఽధ్వర్యంలోని జెండర్‌ పార్కులో ఫ్రంట్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌గా కొంత కాలం పనిచేశాను. ఆ డబ్బుతో అదే నగరంలోని ఓ కాలేజీలో బీఏలో చేరాను. దాంతోపాటు కొంత స్కాలర్‌షిప్‌ వస్తుంది. వాటితో నెట్టుకొస్తున్నా’’ అంటున్న హనీఫాకు ఇప్పుడు 22 ఏళ్లు. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. మనసుకు నచ్చిన మరో ట్రాన్స్‌జెండర్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. ఈ సమాజం ఏమంటుందన్నది హనీఫాకు అనవసరం. నచ్చిన పని చేయాలి. బతికినన్ని రోజులూ వేరొకరి మనసు నొప్పించకుండా సంతోషంగా జీవించాలి... ఇదీ... ఆమె అభిమతం.  


‘ఎన్‌సీసీ’కి వెళితే... 

కాలేజీలో తోటి విద్యార్థులు చాలామంది ‘నేషనల్‌ కేడెట్‌ కార్ప్స్‌’ (ఎన్‌సీసీ) క్యాంప్‌లకు వెళుతున్నారు. అది చూసి తాను కూడా అందులో చేరాలనుకుంది. ఇటీవలే సవరించిన నిబంధనల వల్ల కొత్తగా కళాశాలలో ట్రాన్స్‌జెండర్స్‌కు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశారు. ఆ కోటా కిందే హనీఫాకు సీటు లభించింది. అదే తరహాలో ఎన్‌సీసీలో కూడా తనలాంటి వారికి కోటా ఉంటుందని భావించింది. అందులో పేరు నమోదు చేసుకుందామని వెళితే కుదరదని తిప్పి పంపించారు. ‘ఎన్‌సీసీ యాక్ట్‌’ సెక్షన్‌ 6 ప్రకారం ఆమె అడ్మిషన్‌ తిరస్కరించినట్టు చెప్పారు. హనీఫా అస్సలు ఊహించని పరిణామం ఇది. 


హైకోర్టులో సవాల్‌... 

ఈ విషయంలో తామేమీ చేయలేమని కాలేజీ వారు చేతులెత్తేశారు. దీంతో హనీఫా కేరళ ఎన్‌సీసీ బెటాలియన్‌ కార్యాలయానికి వెళ్లి, ప్రశ్నించింది. ‘‘హిజ్రాలకు ఎన్‌సీసీలో ప్రవేశం లేదని వాళ్లు కూడా రకరకాల సెక్షన్లు చూపించారు. నిబంధనల ప్రకారం నన్ను కేడెట్‌గా తీసుకోలేమన్నారు. అయితే ఒకవేళ నిబంధనలు మార్చగలిగితే... తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆ ఒక్క మాట నాకు ఊపిరిపోసినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖకు వెళ్లాను. ఆ ప్రయత్నమూ నిష్ప్రయోజనమే అయింది. ఇక లాభంలేదని చివరకు కేరళ హైకోర్టు తలుపు తట్టా’’ అని హనీఫా చెప్పుకొచ్చింది. 


హక్కుల ఉల్లంఘనే... 

హనీఫా పిటిషన్‌ను కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆమెను ఎన్‌సీసీ బెటాలియన్‌ తిరస్కరించడం ‘ట్రాన్స్‌జెండర్‌ పర్సన్స్‌ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టం 2019’ ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేసింది. ఆమె ఆకాంక్షను కాదనే హక్కు ఎన్‌సీసీకి లేదంటూ ఇటీవల కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇందుకు అనుగుణంగా ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీని కూడా చేర్చి, 1948 ఎన్‌సీసీ చట్టంలోని సెక్షన్‌-6ను సవరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చరిత్రాత్మక తీర్పు హనీఫాకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. కోర్టు మెట్లు ఎక్కినప్పటి నుంచి తాను ఊహించినట్టుగా ఇబ్బందులేవీ ఎదురవలేదు. కాలేజీ యాజమాన్యం, ఎన్‌సీసీ బెటాలియన్‌, సన్నిహితులు, స్నేహితులు... అందరూ తనకు మద్దతుగా నిలవడం సంతోషం కలిగించిందని హనీఫా చెబుతోంది.




స్ఫూర్తిగా నిలుస్తా...

కేరళ హైకోర్టు ఉత్తర్వులు హీనా హనీఫాలో నూతనోత్సాహాన్ని నింపాయి. ‘‘రాబోయే తరాలకు నేనొక స్ఫూర్తిగా నిలవాలనుకొంటున్నా. నాలాంటి ట్రాన్స్‌జెండర్లకే కాదు... వివక్ష ఎదుర్కొంటూ, అణచివేతకు గురవుతున్న ప్రతి ఒక్కరికీ! అలాంటి వాళ్లకు కూడా ఈ సమాజంలో గౌరవప్రదంగా జీవించే హక్కు ఉందని గట్టిగా చెప్పాలనుకొంటున్నా. ఆ క్రమంలో నా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి’’ అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించిన హీనా లక్ష్యం ఐపీఎస్‌. దానికోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.


Updated Date - 2021-04-01T05:30:00+05:30 IST