Advertisement
Advertisement
Abn logo
Advertisement

మోగిన నగారా

ఎమ్మెల్సీ పదవి ఎవరిని వరించేనో ? 

రేసులో గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి 

ఎన్నికలకు ముహూర్తం ఖరారు 

నవంబరు 16న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు 


ఎమ్మెల్సీ నగారా మోగింది. ఆశావాహులు ఎవరికి వారు అంచనాల్లో మునిగి తేలుతున్నా రు. ప్రధానంగా జిల్లా లో ఎమ్మెల్సీ రేసులో శాసన మండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సాగర్‌ నియోజకవర్గం నుంచి ఎంసీ కోటిరెడ్డి ఉన్నారు. అయితే ఆనవాయితీగా వస్తున్న విధంగా ఈ సారి గుత్తాను వరిస్తుందా, లేదంటే సీఎం హామీ మేరకు ఎంసీ కోటిరెడ్డికి పదవి లభిస్తుందా అన్న చర్చ జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. 


నల్లగొండ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): హుజూరాబాద్‌ ఉప ఎన్నిక వేడి ఇంకా ముగియకముందే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైం ది. ఈ ఏడాది జూన్‌లోనే శాసన మండలి చైర్మన్‌, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియగా కరోనా ప్రభావంతో నోటిఫికేషన్‌ జారీలో జాప్యం అయింది. తాజా నోటిఫికేషన్‌తో ఉమ్మడి జిల్లాలోనూ రాజకీయ చర్చ మొదలైంది. కీలకనేత గుత్తాకు ఈసారి అవకాశం ఉంటుందా? సీఎం ఆశీస్సులు ఆయనకు ఏ మేరకు ఉన్నాయో? అన్న చర్చ కొనసాగుతోంది. ‘నోముల భగత్‌ను ఎమ్మెల్యేగా గెలిపించండి, ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తా ఇద్దరూ ఒకేసారి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారు’ అంటూ నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల సభలో వేలాదిమంది సమక్షంలో స్వయంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ముహూర్తం ఖరారు కావడంతో సర్వత్రా రాజకీయ ఆసక్తి నెలకొంది. 


ధీమాలో గుత్తా సుఖేందర్‌రెడ్డి వర్గం 

తమ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఖాయమంటూ గుత్తా వర్గీయులు ఆశాభా వం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పదవీ కాలం ముగిసిన జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్‌, వరంగల్‌ జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రొటోకాల్‌ను ఉపసంహరించుకున్నారు. వారికి కేటాయించిన వాహనాలు, గన్‌మెన్లను వెనక్కి పంపించారు. గుత్తాకు శాసనమండలి చైర్మన్‌ హోదాలో కేటాయించిన వాహనా లు, గన్‌మెన్లను కొనసాగించాలంటూ స్వయంగా సీఎం కార్యాలయం నుంచే పద వీ కాలం ముగిసిన నాడే ఆదేశాలు అందాయి. గుత్తా పదవీ కాలం ముగిసి ఐదు నెలలు గడిచినా ఆయనకు ప్రభుత్వంనుంచి పదవిలో ఉన్నప్పుడు దక్కిన మర్యాదలే దక్కుతున్నాయంటూ గుత్తా వర్గీయులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్‌ పాల్గొన్న వాసాలమర్రి, యాదాద్రి ఆలయ పనుల పరిశీలన, హైదరాబాద్‌లో మోత్కుపల్లి నర్సింహులు చేరికవంటి కార్యక్రమాల్లో అధికార పదవిలో లేకున్నా తమ నాయకుడికి స్వయంగా సీఎం నుంచే ఆహ్వానం అందిందని చెబుతున్నారు. వీటన్నింటి దృష్ట్యా ఈ దఫా ఎమ్మెల్సీగా పదవి ఖరారవుతుందన్న భరోసాలో గుత్తా అనుచరవర్గం ఉంది. ఇతర పార్టీలనుంచి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న ప్రజాప్రతినిధులకు మరోసారి అవకాశం ఇవ్వడం అధికార పార్టీ ఆనవాయితీగా పాటిస్తోంది. ఈనేపథ్యంలో గుత్తాకు మరోసారి ఎమ్మెల్సీగా స్థానం ఖరారు కావడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గుత్తాకు ఎమ్మెల్సీ గా మరోసారి అవకాశం కల్పిస్తే అధికార పార్టీలో మరో అధికార కేంద్రాన్ని సజీవంగా ఉంచాలని, అది టీఆర్‌ఎస్‌ భవిష్యత్‌కు ఉపయోగపడుతుందని స్వయంగా సీఎం కేసీఆర్‌ భావించినట్లేనని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.


రేసులో ఎంసీ కోటిరెడ్డి

సీనియర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో కాంగ్రెస్‌ దిగ్గజం జానారెడ్డిని ఢీకొనేందుకు అధికార పార్టీ అభ్యర్థి ఎవరనేది కీలక చర్చసాగింది. ఆ క్రమంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి, నియోజకవర్గంలో పట్టున్న నేత, మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రధాన అనుచరుడిగా ముద్ర వేసుకున్న ఎంసీ కోటిరెడ్డి పేరు చర్చకు వచ్చింది. మరోవైపు నోముల వారసులు, యాదవ సామాజిక వర్గం ఇలా అనేక పేర్లు పరిశీలనకు రాగా పలుమార్గాల్లో సీఎం కేసీఆర్‌ సమాచారం తెప్పించుకుని చివరగా నర్సింహయ్య కుమారుడు భగత్‌ను చివరి నిమిషంలో ఖరారు చేశారు. ఎంసీ కోటిరెడ్డికి స్థానికంగా ఉన్న బలం దృష్ట్యా ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి విజయం కీలకం కావడంతో ఎన్నికకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ఎంసీ కోటిరెడ్డికి భాగస్వామ్యం కల్పించారు. నోముల భగత్‌తోపాటు ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్సీగా ఒకేరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సీఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైన క్రమంలో సీఎం కేసీఆర్‌ జిల్లాకు రెండు స్థానాలు కేటాయిస్తారా ? ఒక్కరితో సరిపెడతారా ? అది ఎవరనేది తేలనుంది. సీనియర్‌ నేత గుత్తాకు అవకాశం కల్పించి ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీగా ఇవ్వలేని పక్షంలో ఆయన రాజకీయ భవిష్యత్‌కు సంబంధించి ఈ సందర్భంగా సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. లేదంటే మంత్రి జగదీ్‌షరెడ్డి ద్వారా ఆ కీలక పదవికి సంబంధించిన సంకేతాలను కోటిరెడ్డి వర్గానికి అందించే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా సరిగ్గా 15 రోజుల్లో ఈ అంచనాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నవంబరు 16న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఆనాటికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదల కానుంది. శాసన సభలో పూర్తి మెజారిటీ ఉన్నందున సీఎం ప్రకటనే ఆలస్యం. నవంబరు 16తో జిల్లాకు చెందిన నేతల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఎవరికో అనేది స్పష్టం కానుంది. మరో సీనియర్‌ నేత నేతి విద్యాసాగర్‌కు ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీనికి తోడు ఆయన వియ్యంకురాలు, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఆకుల లలిత ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఆమె కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరగా, పార్టీ ఆనవాయితీ ప్రకారం ఆమెకు రెండోసారి అవకాశం అనివార్యం. దీంతో నేతి ఆశలు అడుగంటాయి. 

Advertisement
Advertisement