కరోనా సాకుతో స్కూళ్లు మూసేయడం వెనుక పెద్ద కుట్ర

ABN , First Publish Date - 2022-01-17T21:42:56+05:30 IST

కోవిడ్ నిబంధనల సాకుతో ప్రభుత్వం స్కూళ్లను మూసేయడం వెనుక పెద్ద కుట్ర దాగుందని అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కరోనా సాకుతో స్కూళ్లు మూసేయడం వెనుక పెద్ద కుట్ర

హైదరాబాద్: కోవిడ్ నిబంధనల సాకుతో ప్రభుత్వం స్కూళ్లను మూసేయడం వెనుక పెద్ద కుట్ర దాగుందని అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ఆరోపించారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించడానికి అనుకూల పరిస్థితులను, అవసరమైన సౌకర్యాలను కల్పించడం మీద దృష్టి సారించకుండా సెలవులు పొడిగించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఓ ప్రకటనలో అనిల్ కుమార్ విమర్శించారు. దాదాపు రెండు విలువైన విద్యా సంవత్సరాలను ఇప్పటికే కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా బడులు మూసేసి చేతులు దులుపుకోవడం క్షమించరాని నేరమని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా చీకటి ఇరుకు గదుల్లో నిర్వహించే బార్లు, రెస్టారెంట్లు, పబ్బులు, సినిమా హాళ్లు, వేలాదిమంది జనాన్ని సమీకరించి రాజకీయ పార్టీలు జరుపుతున్న బహిరంగ సభలు, ర్యాలీలతో వ్యాపించని కోవిడ్... విశాలమైన వెలుతురు గదుల్లో, ఆరుబయట నిర్వహించే పాఠశాలల్లో వ్యాపిస్తుందని బంద్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇందులో ఆంతర్యమేంటో అంతుబట్టడం లేదన్నారు.


ప్రపంచంలో చాలా దేశాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదైనా.. విద్యాసంస్థలు మాత్రం మూయడంలేదని, మన దేశంలోనూ ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాలు పాఠశాలలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొదలై కేవలం నాలుగు నెలలు మాత్రమే పూర్తయింది. తల్లిదండ్రులు, టీచర్లను అడగకుండానే ఏక పక్షంగా మూసివేతకు నిర్ణయించడాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద మధ్య తరగతి పిల్లలు  తమ అమూల్యమైన భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఆన్‌లైన్ విద్యపై స్పష్టమైన విధానం లేకుండా ప్రభుత్వ అర్ధంతరంగా పాఠశాలలు మూసివేయడం పేద విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. 


పాఠశాలల్లో భౌతిక దూరాన్ని, పరిశుభ్రతను పాటించే విధంగా అందుకు తగిన గదులను, సిబ్బందిని, సామగ్రిని సమకూర్చే బాధ్యతను తప్పించుకోవడానికి, 317 జీవో మీద సాగుతున్న ఉపాధ్యాయ ఉద్యమాన్ని నీరుగార్చడానికే ప్రభుత్వం ఇలా చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అన్నింటికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు ప్రభుత్వం పన్నుతున్న కుట్రగా భావించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను వీడి, మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని టీచర్లు, తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యాసంస్థలను కొనసాగించాలని అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-17T21:42:56+05:30 IST