Abn logo
Sep 27 2021 @ 00:13AM

బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి

సంఘీభావం తెలుపుతున్న వివిధ పార్టీ నాయకులు

 - కాంగ్రెస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌మస్తాన్‌వలి

విశాఖపట్నం, సెప్టెంబరు 26: ప్రజావ్యతిరేక విధానాలతో దేశాన్ని పరాధీనం చేయతలపోస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌మస్తాన్‌వలి పిలుపునిచ్చారు. రైతు చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం భారత్‌ బంద్‌ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ, వామపక్షాలు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధుల సమావేశం ఆదివారం నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో జరిగింది.


ఈ సందర్భంగా హాజరైన పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సమావేశంలో మస్తాన్‌ వలీ మాట్లాడుతూ బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ప్రజావ్యతిరేకతను ఢిల్లీకి తెలియజేయాలన్నారు. టీడీపీ ‘విశాఖ’ కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం తక్షణ అవసరమని, బంద్‌కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని తెలిపారు.


సీపీఎం నేత కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం, నల్లచట్టాలతో రైతులను అణగదొక్కే యత్నాలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. సీపీఐ నేత ఎం.పైడిరాజు మాట్లాడుతూ ప్రజలు పోరాడి సాధించుకున్న పరిశ్రమలను ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. కార్మిక నాయకుడు మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, జి.ఎ.నారాయణరావు, వైసీపీ నేత రవిరెడ్డి పాల్గొన్నారు.