Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాద్ధాంతం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌

 వడ్ల కొనుగోలు విషయంలో ఆ పార్టీలకు మాట్లాడే అర్హత లేదు

 బీజేపీ విధానాలతో రైతులకు ఇబ్బందులు

 కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు

ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేసిందో చెప్పాలి

 సాగు, తాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్‌దే..

 ఆర్థిక, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


 నారాయణఖేడ్‌, నవంబరు 30: వానాకాలం వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ రాజకీయ దురుద్దేశంతో రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్యాఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్‌, బీజేపీకి మాట్లాడే అర్హత లేదన్నారు. బీజేపీకి సంబంధించి కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతుంటే..రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన పర్యాటకశాఖ మంత్రికిషన్‌రెడ్డి మరోమాట మాట్లాడుతున్నారన్నారు.  కేంద్రంలో పీయూ్‌షగోయల్‌ బాయిల్డ్‌రై్‌సను, తడిసిన వడ్లను కొనుగోలు చేయబోమని చెబుతుంటే.. రాష్ట్రంలో మంత్రి కిషన్‌రెడ్డి తడిసిన వడ్లను, ఉప్పుడు బియ్యం గింజ లేకుండా కొనుగోలు చేస్తామని చెబుతున్నారన్నారు. ఇందులో ఎవరిమాట నమ్మాలో వారే చెప్పాలన్నారు. కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి ఉంటే వడ్ల కొనుగోలు విషయంలో లిఖితపూర్వకంగా కొనుగోలు చేసే విషయమై ఆదేశాలు ఇవ్వాలన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే లక్షా 40వేల మెట్రిక్‌ టన్నుల వడ్లను కొనుగోలు చేసి, రైతులకు రూ.110కోట్లను చెల్లించినట్లు పేర్కొన్నారు. వర్షాలు అధికంగా కురిసిన ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం 17 శాతానికి కంటే అధికంగా తేమ ఉంటే కొనుగోలు చేయరాదనే నిబంధన విధించడంతోనే ధాన్యం కొనుగోలు చేయలేకపోయామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ 2004 నుంచి పదేళ్లు అధికారంలో ఉందని, ఆ సమయంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారో, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందో పరిశీలిస్తే అవగతం అవుతుందన్నారు. తమ పార్టీ మాత్రం నారాయణఖేడ్‌ లాంటి వెనుకబడిన ప్రాంత రైతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతుబంధు ద్వారా కూడా జిల్లాలో అత్యధిక ప్రయోజనం ఈ నియోజకవర్గానికే అందుతుందన్నారు. ఎలాంటి నిబంధన లేకుండా ఈ ప్రాంత రైతాంగానికి ఏటా రూ.200 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత కూడా తమ ప్రభుత్వానిదే అన్నారు. అందువల్ల రైతు సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌, బీజేపీకి లేదన్నారు. సమావేశంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, నారాయణఖేడ్‌, కల్హేర్‌, సిర్గాపూర్‌, జడ్పీటీసీలు లక్ష్మీబాయి, నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి, ఎంపీపీలు సంగీత వెంకట్‌రెడ్డి, జంగం శ్రీనివాస్‌,  పార్టీ మండలాధ్యక్షుడు పరమేశ్వర్‌, నారాయణఖేడ్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, రవీందర్‌నాయక్‌, రమేష్‌ చౌహాన్‌ పాల్గొన్నారు. 


ప్రైవేటుకు ధీటుగా వైద్యసేవలు అందించాలి

ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రైవేటుకు ధీటుగా వైద్యసేవలు అందించాలని రాష్ట్ర వైద్యాఆరోగ్యశాఖ, ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నారాయణఖేడ్‌లోని ఏరియా వైద్యశాలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్యశాలలోని అన్ని వార్డులను కలియతిరిగారు. అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో ఏర్పాటు చేసిన బ్లడ్‌బ్యాంక్‌, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఎక్స్‌రే విభాగాల పని తీరును పరిశీలించి పలు సూచనలు అందించారు. నారాయణఖేడ్‌లో ఇంత పెద్ద వైద్యశాలను ఏర్పాటు చేశామని, అయినప్పటికీ ప్రసావాలు రోజుకు రెండు కూడా జరగకపోవడం సరికాదన్నారు. ప్రసావాల సంఖ్యను పెంచాలన్నారు. వైద్యశాలలో సిబ్బంది కొరత లేదని, ఉన్న సిబ్బంది ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించే విధంగా చూడాలన్నారు.  గతంలో డయాలసిస్‌ కోసం ఈ ప్రాంత వాసులు హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం నారాయణఖేడ్‌లోనే డయాలసిస్‌ సెంటర్‌ ఉండడంతో ఈ ప్రాంతంలోని పేదలకు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐదుగురు ల్యాబ్‌ టెక్నిషియన్స్‌ ఉన్నారని, వారి సేవలను రోగులకు అందజేయాలన్నారు. నారాయణఖేడ్‌ జిల్లా కేంద్రానికి దూరం ఉందని, అందువల్ల ఈ ప్రాంతంలో పేదలు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతంలోని ప్రజల సౌలభ్యం కోసం రూ.2కోట్లతో డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.  ఆహారం నాణ్యతగా లేదని రోగులు చెప్పడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ వెంకట్‌రాంరెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రుబీనాబేగంనజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం, మార్కేట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌బుజ్జి, వైద్యశాలసూపరిండెంట్‌ నర్సింగ్‌ చౌహాన్‌, రవీందర్‌నాయక్‌, రమేష్‌ చౌహాన్‌, అభిషేక్‌ షెట్కార్‌, తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement