నల్ల దెయ్యం అంటూ నన్ను ఏడిపించారు!

ABN , First Publish Date - 2020-10-01T05:30:00+05:30 IST

ఒంటి రంగు నల్లగా ఉన్నందుకు 12 ఏళ్ల వయసు నుంచి తనను అందరూ నల్ల దెయ్యం అంటూ ఎగతాళి చేసేవారని షారూఖ్‌ కూతురు సుహానా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన పోస్ట్‌ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది...

నల్ల దెయ్యం అంటూ నన్ను ఏడిపించారు!

భారతదేశం గర్వించదగిన నటుల్లో షారూక్‌ ఖాన్‌ ఒకరు. అంతటి ప్రఖ్యాత నటుడి కూతురుకి కూడా ఎగతాళి, వేధింపులు తప్పలేదు. ఒంటి రంగు నల్లగా ఉన్నందుకు 12 ఏళ్ల వయసు నుంచి తనను అందరూ నల్ల దెయ్యం అంటూ ఎగతాళి చేసేవారని  షారూఖ్‌ కూతురు సుహానా ఖాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా చేసిన పోస్ట్‌ నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది! ఆ పోస్ట్‌ వివరాల్లోకి వెళితే...


‘నువ్వు నల్లగా ఉన్నావు’, ‘అంత గొప్ప అందంగా లేవు’, ‘కాలీ చుడేల్‌ (నల్ల దెయ్యం)’... సుహానా ఒంటి రంగును ఎగతాళి చేస్తూ ఇనస్టాగ్రామ్‌లో ఆమెకు వచ్చిన కామెంట్లు, సందేశాలు ఇవి. వాటిని స్ర్కీన్‌షాట్‌ తీసి, తాజాగా తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది సుహానా. అంతేకాదు. అందరికీ అర్థమయ్యేలా వాటిని ఇంగ్లిష్‌లో రాసింది. ఆ పోస్ట్‌కు విపరీతమైన స్పందన రావడంతో, ధన్యవాదాలు తెలుపుతూ మరో పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌లో సుహానా తన అనుభవాన్ని ఇలా చెప్పుకొచ్చింది....


భారతీయుల చర్మం తీరే అంత!

‘‘పరిష్కరించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. ఇది నా ఒక్కదానికే పరిమితమైన సమస్య కాదు. అకారణంగా బాల్యం నుంచే ఆత్మన్యూనతా భావనను మోస్తూ, ఎదిగేలా చేసే ప్రతి అమ్మాయి/అబ్బాయి సమస్య ఇది. నా రూపం గురించి వచ్చిన కామెంట్లలో ఇవి కొన్ని మాత్రమే! నా ఒంటి రంగు కారణంగా నేను అసహ్యంగా కనిపిస్తున్నానని నా 12వ ఏట నుంచే ఎగతాళిని భరించాను. అలా అన్నవాళ్లు ఎదిగిన మహిళలు, పురుషులే! వీళ్లందరూ పూర్తిగా ఎదిగిన పెద్దలే అనే విషయాన్ని పక్కనపెడితే, భారతీయులం కాబట్టి మన ఒంటి రంగు తక్కువగా ఉంటుందనే విషయాన్ని వీళ్లెవరూ గ్రహించకపోవడం విచారకరం. మనం మన సొంత మనుషులను  అసహ్యించుకుంటున్నామంటే ఎంత అభద్రతాభావనతో బాధపడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాలు, మ్యాట్రిమొనీలు, మీ సొంత కుటుంబాలు... తెల్లని రంగుతో 5.7 అంగుళాల ఎత్తు లేనంత మాత్రాన మీరు అందంగా లేరని అంటూ ఉండవచ్చు. అలాంటి వాళ్లకు నేనొకటి చెప్పదలుచుకున్నాను. నా ఎత్తు 5.3. చామన ఛాయతో ఉంటాను. అయినా నేనెంతో సంతోషంగా ఉన్నాను. మీరూ కూడా ఉండండి!’’

సుహానా పోస్ట్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ‘‘థ్యాంక్యూ ఫర్‌ ది నైసెస్ట్‌ కామెంట్స్‌/మెసేజెస్‌. నేను నా చర్మాన్ని తెల్లబరుచుకోలేదు. అలా చేయను కూడా!’’ అంటూ సుహానా మరో పోస్ట్‌ పెట్టడం విశేషం.


అవును... మనం వేర్వేరు షేడ్స్‌లో ఉంటాం. ఎంతగా మెలనిన్‌ను కాపాడుకుంటూ జాగ్రత్తపడినా మన ఒంటి రంగు ఇలాగే ఉంటుంది.

Updated Date - 2020-10-01T05:30:00+05:30 IST