Abn logo
Apr 2 2021 @ 23:56PM

గల్లంతైన యువకుల మృతదేహలు లభ్యం

 మిన్నంటిన రోదనలు

బూర్గంపాడు, ఏప్రిల్‌ 2: మండల పరిధిలోని సారపాక పంచాయతీలో గల తాళ్లగొమ్మూరుకు చెందిన జమ్మి శణ్ముకరావు(21), నిమ్మల హరిచందు (23), వడ్లమూడి చక్రి అనే ముగ్గురు స్నేహితులు మోతెపట్టీనగర్‌ గ్రామ శివారులో ఉన్న గోదావరి వద్దకు ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో హరిచందుకు చెందిన పెంపుడు కుక్క నీటిలో లోతుకు వెళ్లగా, దాన్ని రక్షించే క్రమంలో శణ్ముకరావు, నిమ్మల హరిచందు గోదావరిలో గల్లంతైన విషాద సంఘటన గురువారం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్లతో గురువారం రాత్రి వరకు గాలింపు చేపట్టిన మృతదేహలు లభ్యం కాలేదు. తిరిగి శుక్రవారం గాలింపు చేపట్టిన కొంత సమయానికి తొలుత హరిచందు మృతదేహం, రెండు గంటల వ్యవధిలో షణ్ముఖరావు మృతదేహం లభ్యమైంది. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధఙత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలాన్ని జడ్పీటీసీ సభ్యురాలు కామిరెడ్డి శ్రీలత, సొసైటీ అధ్యక్షుడు భిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జలగం జగదీష్‌, సర్పంచులు పోతునూరి సూరమ్మ, తుపాకుల రామలక్ష్మీ, కొర్సా లక్ష్మీ పరిశీలించారు.  

మిన్నంటిన రోధనలు

చేతికి ఎదిగి వచ్చిన కుమారులు గోదావరిలో ఈతకు వెళ్లి మృతిచెందడంతో కుటుంబసభ్యులు రోధనలు చూపరులను కంటతడి పెట్టించాయి. కుటుంబానికి అండగా నిలుస్తారనే ఆశలతో ఉన్న ఆ కుటుంబాలకు కుమారులు మరణ వార్త ఓ విషాదాన్ని నింపింది. జమ్మి సత్యనారయణ-నాగమణి దంపతుల రెండో కుమారుడు షణ్ముఖరావు పాల్వంచలోని ఓ ప్రవేటు కళాశాలలో బీపార్మసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. నిమ్మల వెంకటేశ్వర్లు-పుల్లమ్మ దంపతుల రెండో కుమారుడు హరిచందు బీటెక్‌ పూర్తి చేసి ఇటీవలే ఐటీసీలో విధుల్లో చేరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్నేహితులు మరణంతో సారపాక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement
Advertisement