విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2022-01-23T05:55:12+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

విజృంభిస్తున్న కరోనా

- జిల్లాలో ఒకేరోజు 707కేసులు

- కరోనా మొదలయ్యాక అత్యధికం

- కోల్‌బెల్ట్‌లోనే ఎక్కువ కేసులు నమోదు

- చాలామంది ఇంటి వద్దనే పరీక్షలు

కళ్యాణ్‌నగర్‌, జనవరి 22: జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మూడో దశ మొదలైన నాటినుంచి ఇప్పటివరకు భారీ సంఖ్యలో కేసుల నమోదవుతున్నాయి. వ్యాధి తీవ్రత ఎక్కువ లేకపోయినప్పటికీ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. శనివారం జిల్లావ్యాప్తంగా 707కేసులు నమోదయ్యాయి. 2881మందికి పరీక్షలు నిర్వహించారు. కరోనా మొదలైన తరువాత శనివారమే అత్యధికంగా కేసులు నమోదు కావడం జిల్లా ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అత్యధికంగా కేసులు కోల్‌బెల్ట్‌లోనే నమోదవుతున్నాయి. 50శాతం మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఇందులో సింగరేణి కార్మికులే అత్యధికంగా కరోనా బారినపడుతున్నారు. పని స్థలాల్లో గుంపులుగుంపులుగా పనిచేయడం వల్ల వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 50శాతం మందికి పాజిటివ్‌గానే నిర్ధారణ అవుతోంది. రెండు రోజుల క్రితం సింగరేణి సూపర్‌బజార్‌లో పనిచేసే ఉద్యోగి కరోనాతో మృత్యువాతపడ్డాడు. 

పెరిగిన పాజిటివ్‌ కేసులు..

జిల్లాలో వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో శనివారం 2881మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 707మందికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. గోదావరిఖనిలో ఆర్‌టీపీసీఆర్‌ ద్వారా 185మందికి పరీక్షలు నిర్వహించగా 84మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో 517మందికి కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో 150మందికి పరీక్షలు నిర్వహించగా 84మందికి పాజిటివ్‌, అడ్డగుంటపల్లిలో 89మందికి గాను 25మందికి, లక్ష్మిపురంలో 67మందికి గాను 34మందికి, ఫైవింక్లయిన్‌లో 102మందికి గాను 13మందికి, జనగామలో 45మందికి గాను 16మందికి, సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 164మందికి గాను 24మందికి, గోదావరిఖని ఆర్‌టీపీసీఆర్‌ సెంటర్‌లో 185మందికి గాను 84మందికి, ధర్మారం మండలంలోని నంది మేడారంలో 110మందికి గాను నలుగురికి, పాలకుర్తిలో 70మందికి గాను 20మందికి, ఓదెలలో 115మందికి గాను 15మందికి, సుల్తానాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో 58మందికి గాను 4గురికి, కమాన్‌పూర్‌లో 170మందికి గాను 16మందికి, యైుటింక్లయిన్‌కాలనీ సింగరేణి డిస్పెన్సరీలో 138మందికి గాను 78మందికి, అల్లూరు ఆరోగ్య కేంద్రంలో 93మందికి గాను ముగ్గురికి, పెద్దపల్లి మండలం రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 217మందికి గాను 21మందికి, రాఘవాపూర్‌ పీహెచ్‌సీలో 250మందికి గాను 22మందికి, రామగిరిలోని ఆర్‌జీ-3లో 102మందికి గాను 44మందికి, రామగుండంలో 50మందికి గాను 14మందికి, మంథని పీహెచ్‌సీలో 112మందికి గాను 29మందికి, గద్దలపల్లి పీహెచ్‌సీలో ఇద్దరికి గాను ఇద్దరికి, కాల్వశ్రీరాంపూర్‌లో 22మందికి గాను 8మందికి, ముత్తారంలో 86మందికి గాను 16మందికి, సుల్తానాబాద్‌ ఆర్‌టీసీ బస్టాండ్‌లో 15మందికి గాను ఒకరికి, గర్రెపల్లిలో 29మందికి గాను ఒకరికి, అంతర్గాంలో 45మందికి గాను 20మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇందులో అత్యఽదికంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే నమోదు అయ్యాయి. రెండు రోజులుగా ఇంటింటికి జ్వరం సర్వే నిర్వహిస్తుండగా ఇండ్ల వద్ద కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా కొంత మంది స్వయంగా పరీక్షలు నిర్ధారణ చేయించుకోవడంతో పాటు ఆర్‌టీపీసీఆర్‌ కూడా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేయించుకుంటున్నారు.

వర్షంతో పెరిగిన కేసులు..

వారంరోజుల క్రితం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కురిసిన వర్షంతో ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగాయి. జిల్లాలోనే అత్యధికంగా రామగుండంలో కేసులు నమోదు కావడం, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, గోదావరిఖని ఏరియా ఆసుపత్రిలో రోజూ వందల సంఖ్యలో కరోనా పరీక్షల కోసం వస్తున్నారు. వర్షంతో వాతావరణంలో మార్పు రావడంతో ప్రతి ఇంటా జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఇంట్లో ఐదుగురు ఉంటే ముగ్గురు వైరస్‌ ప్రభావంతో బాధపడుతున్నారు. కొంత మందికి ఏ లక్షణాలు లేకున్నా ర్యాపిడ్‌ టెస్టుల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. వ్యాధి తీవ్రత ఎక్కువ లేకపోయినప్పటికీ కేసుల సంఖ్య భారీగా పెరగడం కలవరపెడుతోంది. మరోపక్క ప్రభుత్వం ఫీవర్‌ సర్వే నిర్వహిస్తుండడంతో కరోనా వచ్చిన వారికి ఇంటి వద్దనే మందులు ఇస్తూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. మూడో దశలో కరోనా ప్రారంభమైననాటి నుంచి శనివారం అత్యధికంగా కేసులు నమోదు కావడం, జ్వర పీడితులు కూడా ఎక్కువగానే ఉంటుండడంతో వ్యాధి తీవ్రత లేకున్నా జాగ్రత్తలు పాటించాలని వైద్యులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-01-23T05:55:12+05:30 IST