బాలుడి గాలింపు ముమ్మరం

ABN , First Publish Date - 2022-05-04T07:41:25+05:30 IST

తిరుమలలో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. దాంతో తిరుమల పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపును ముమ్మరం చేశారు. తిరుమలలో నామాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వెంకటరమణ,

బాలుడి గాలింపు ముమ్మరం
బాలుడిని వెంట తీసుకెళ్తున్న మహిళ

 ఆరు బృందాలుగా నెల్లూరు,కడప జిల్లాల్లో వెతుకులాట          

తిరుమల, మే 3 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కిడ్నాపైన ఐదేళ్ల బాలుడి ఆచూకీ ఇంకా లభించలేదు. దాంతో తిరుమల పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపును ముమ్మరం చేశారు. తిరుమలలో నామాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వెంకటరమణ, స్వాతి రెండో కుమారుడు గోవర్ధన్‌ రాయల్‌ (చింటూ) ను ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని మహిళ అపహరించుకెళ్లిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అర్ధరాత్రి వరకు తల్లి ఫిర్యాదు చేయక పోవడంతో కిడ్నాపర్‌ తిరుమల నుంచి బాలుడితో జారుకుంది. సోమవారం ఉదయం నుంచి తిరుమల పోలీసులు కిడ్నాపర్‌ ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి బాలుడితో కలిసి ఆ మహిళ తిరుపతికి చేరుకుని గోవిందరాజస్వామిని దర్శించుకుంది. తర్వాత విష్ణునివాసంలో బస చేసి సోమవారం వేకువజామున 4.10 నుంచి 4.30 గంటల మధ్య రైల్వేస్టేషన్‌లో టికెట్‌ కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఏ రైలెక్కి.. ఎక్కడికి వెళ్లిందనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు లేదా కడపకు వెళ్లి ఉండొచ్చన్న నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆరు బృందాలుగా ఏర్పడి కొందరు నెల్లూరు, మరికొందరు కడపకు వెళ్లారు. మధ్యలోని రైల్వేస్టేషన్లలోనూ విచారణ చేస్తున్నారు. వీటితోపాటు రివర్స్‌ డైరెక్షన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. కిడ్నాపర్‌ 30వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు బస్సులో అలిపిరి చెక్‌పాయింట్‌కు చేరుకున్నట్టు ఫుటేజ్‌లో కనిపించింది. ఆ తర్వాత తిరుమలకు చేరుకుని వరాహస్వామి, నాదనీరాజనం మండపం వద్ద బస చేసినట్లు గుర్తించారు.

Read more