అమరావతిని నిర్వీర్యం చేయాలని కంకణం

ABN , First Publish Date - 2020-08-15T09:07:35+05:30 IST

అభివృద్ధి చెందుతున్న అమరావతిని నిట్టనిలువుగా ఆపేసి.. నిర్వీర్యం చేశారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని 29 గ్రామాల రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవా

అమరావతిని నిర్వీర్యం చేయాలని కంకణం

పాలకుల ప్రయోజనం కోసమే మూడు రాజధానులు    

241వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు ఆగ్రహం

మాజీ మంత్రి ఉమా, సీపీఐ నాయకుల సంఘీభావం


తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి క్రైమ్‌, ఆగస్టు 14: అభివృద్ధి చెందుతున్న అమరావతిని నిట్టనిలువుగా ఆపేసి.. నిర్వీర్యం చేశారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని 29 గ్రామాల రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 241వ రోజుకు చేరుకున్నాయి. అమరావతి తరలింపుపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో రైతులు శిబిరాలలో న్యాయదేవతను ప్రార్థించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, రాజధాని రైతు పరిరక్షణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తుళ్లూరులోని రైతు దీక్షా శిబిరంలో న్యాయదేవతకు రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు.


అనంతరం వారు మాట్లాడుతూ రాజధానిలో నిర్మాణ కంపెనీలను వెనక్కి పంపి పనులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయనీయకుండా కుట్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల ప్రయోజనం కోసం మూడు రాజధానులను సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. పాలకులకు రాజధాని రైతుల ఉసురు తగులుతుందని ఉమా తెలిపారు. అడ్డగోలుగా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేస్తామంటున్న పాలకులు 16 నెలల్లో ఏమి చేశారని ప్రశ్నించారు. పరిపాలనను విశాఖకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారంటే అమరావతికి పూర్తి అన్యాయం చేసే విధంగా ముందుకు వెళుతున్నారన్నారు.


రోడ్డుపై పడుకుని సీపీఐ నిరసన

సీపీఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరావు, ఇతర నాయకులు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. శంకుస్థాపన ప్రదేశంలో రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తూ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిందన్నారు. రైతులకు అండగా ఐదు కోట్ల మంది ఉండాలన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆందోళనలను తీవ్రతరం చేయాలన్నారు. రాజధానిని కాపాడుకోకపోతే ఆంధ్రులకు  భవిషత్‌ ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో రాజధాని దళిత జేఏసీ కో కన్వీనర్‌ పులి చిన్నా, ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

 

- రాజధాని అమరావతి నుంచే పరిపాలన మొత్తం చేయాలని తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక గ్రామాల్లో రైతులు, మహిళలు శుక్రవారం నిరసనలు కొనసాగించారు. 


- మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతులు చేపట్టిన రాజధాని నిరసనలు శుక్రవారంతో 241వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతులు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు, న్యాయదేవత ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. యర్రబాలెం రామాలయం సెంటర్‌లో రైతులు దీక్షలు కొనసాగించారు.   కార్యక్రమంలో అమరావతి రాజధాని పరిరక్షణ సంఘం నాయకులు ఉమామహేశ్వరరావు, డి.వీరాంజనేయులు, డి.వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T09:07:35+05:30 IST