వీడిని మాత్రం చచ్చినా చేస్కోను.. పెళ్లి వేదిక మీదే వధువు మాటలకు వరుడికి మైండ్‌బ్లాక్.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-13T02:45:37+05:30 IST

పీటల మీదకు వచ్చాక కూడా పెళ్లి సవ్యంగా జరుగుతుందని చెప్పలేం. గతంలో ఇలాంటి ఘటనలు చాలా చూశాం. ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. పెళ్లి వేదికపైనే వధువు రివర్స్ అయింది.

వీడిని మాత్రం చచ్చినా చేస్కోను.. పెళ్లి వేదిక మీదే వధువు మాటలకు వరుడికి మైండ్‌బ్లాక్.. అసలేం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన పెళ్లి అయినా.. పెళ్లి పీటల వరకూ వెళ్లేదాకా సవ్యంగా జరుగుతుందని చెప్పలేం. ప్రేమ పెళ్లి అయితే ఇరు కుటుంబాల్లో ఎవరో ఒకరు నిరాకరించడం జరుగుతుంటుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లయితే.. కట్నాల విషయంలో గొడవలు, సాంప్రదాయాలు పాటించడం లేదని కొందరు, చెప్పుడు మాటలు విని మరికొందరు పెళ్లిళ్లను రద్దు చేసుకోవడం చూస్తుంటాం. అంతెందుకు పీటల మీదకు వచ్చాక కూడా పెళ్లి సవ్యంగా జరుగుతుందని చెప్పలేం. గతంలో ఇలాంటి ఘటనలు చాలా చూశాం. ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇలాంటిదే. పెళ్లి వేదికపైనే వధువు రివర్స్ అయింది. వీడిని చస్తే చేసుకోనంటూ మొండికేసింది.. వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌ రాజ్‌గఢ్‌ జిల్లాలోని సుథాలియాలో ఈ నెల 7వ తేదీన ఓ వివాహ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. అతిథులు, బంధువులు, సన్నిహితులతో కళ్యాణ వేదిక కళకళలాడుతోంది. ఈలోగా పెళ్లికూతురు మండపం వద్దకు వచ్చింది. ముహూర్త సమయం దగ్గరపడుతుండడంతో వేదిక పైకి వెళ్లేందుకు వధువును సిద్ధం చేశారు. పురోహితుడు మంత్రాలు ఆరంభించాడు. ఇక వరుడు ఊరేగింపుగా వస్తే.. వేదికపై కూర్చోబెట్టడమే ఆలస్యం. అయితే చాలా ఆలస్యమవుతున్నా వరుడు ఇంకా రాలేదే.. అని అతిథులతో పాటూ పెళ్లికుమార్తె కూడా ఎదురుచూస్తోంది. ఈలోగా వరుడు తన స్నేహితులతో కలిసి ఊరేగింపుగా అక్కడికి చేరుకున్నాడు.


మామూలుగా వచ్చుంటే ఏ సమస్యా ఉండదు. మనోడు ఫుల్‌గా మందుకొట్టి తూగుతూ, ఊగుతూ వచ్చాడు. అతడి స్నేహితులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. తాళి కట్టాల్సిన పరిస్థితిలో వరుడు ఇలా రావడాన్ని.. అక్కడున్న వారంతా జీర్ణించుకోలేకపోయారు. మద్యం మత్తులో అతన్ని చూడగానే అందరికీ కోపం నశాలానికి అంటింది. ఇక పెళ్లికుమార్తెకు అయితే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఛీ.. ఇలాంటి తాగుబోతును చస్తే చేసుకోను అంటూ మెడలోని దండను విసిరి నేలకు కొట్టింది. కొందరు ఆమెకు నచ్చజెప్పి వేదిక పైకి పంపాలని చూసినా ఫలితం లేకపోయింది. ఎవరెన్ని చెప్పినా వినేది లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె బాధ విన్నాక తల్లిదండ్రులు, పోలీసులు అంతా ఆమె నిర్ణయానికే మద్దతు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

Updated Date - 2021-11-13T02:45:37+05:30 IST