Abn logo
Sep 27 2021 @ 01:18AM

బాధలన్నీ పోవాలంటే బీఎస్పీ బాట పట్టాల్సిందే

మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్‌

- ప్రతీ వ్యక్తికి ఏనుగు గుర్తును పరిచయం చేయాలి

- బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ 

జగిత్యాల అర్బన్‌, సెప్టెంబరు 26: తెలంగాణ ప్రజల బాధలన్నీ పోవాలంటే బహుజన రాజ్యం రావాలని, బీఎస్పీ అధికారంలోకి రావడానికి ప్రతీ వ్యక్తి బీఎస్పీ బాట పట్టాలని బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేందరంలో బీఎస్పీ  ఆధ్వర్యంలో తలపెట్టిన బహుజన సంకల్ప జైత్రయాత్ర సభకు ముఖ్య అతిథులుగా బీఎస్పీ జాతీయ కో ఆర్డినేటర్‌, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతం, రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏనుగు మీదెక్కి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ మీదుగా ప్రగతి భవన్‌కు వెళ్లడమే లక్ష్యం గా బీఎస్పీ ముందుకు సాగుతోందన్నారు. గల్ఫ్‌ లో ఉన్న కార్మికుల కష్టాలు, గల్ఫ్‌ ఎన్నారై పాలసీ అమలుపై  ప్రశ్నించడానికి, రైతుల కష్టాలు తీర్చడానికి, ప్రజల కన్నీళ్లు తుడవడానికి,  బీడీ కార్మికులకు అండగా నిలవడానికి ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం లాక్కున్న భూ నిర్వాసితుల పరిహారం కోసం కొట్లాడడానికి ప్రగతి భవన్‌కు వచ్చి తీరుతామన్నారు. పల్లె పకృతి వనాలు, ఇండస్ర్టీయ ల్‌ పేరుమీద అసైన్డ్‌ భూములు లాక్కుంటున్న పాలకుల తీరును ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రగ్స్‌ విషయంలో నేతలంతా వైట్‌, బ్లాక్‌ ఛాలెంజ్‌లు విసురుకుంటూ బిజీ అయ్యారని, మేము మాత్రం వైట్‌, బ్లాక్‌ కాకుండా బ్లూ ఛాలెంజ్‌ విసురుతున్నామన్నారు. బంగారు చీరెలు మీకు, బతుకమ్మ చీరలు మాకా? ఓట్లు మావీ, సీట్లు మీకా? బస్తీ దవాఖానాలు మాకు, కార్పోరేట్‌ ఆసుపత్రులు మీకా?  నైహీ చెలేగా  అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ గెలిచినా ఓడినా ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, రూ.2వేలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ఓడించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో 3000 పోస్టులు ఉంటే, 800 మంది సిబ్బంది కూడా లేరని, గడిచిన ఎనిమిదేళ్లుగా ఒక్క పోస్టు కూడా ఈ ప్రభుత్వం రిక్రూట్‌ చేయలేదని విమర్శించారు. బహుజన రాజ్యం వస్తే ఈ యూనివర్సిటీలను అంతర్జాతీయ యూనివర్సిటీలుగా తీర్చిదిద్దుతామాన్నరు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దళిత బంధులో బంధీ అయ్యారని , బీఎస్పీ ప్రగతి భవన్‌కు వస్తుందనే భయంతోనే సీఎం కేసీఆర్‌ దళిత బంధును తెరపైకి తెచ్చారన్నారు. వాసాలమర్రిలో దళితులకు రూ.3కోట్ల దావత్‌ ఇచ్చిన సీఎం కేసీఆర్‌, ఆహ్వానించాల్సింది ఫాంహౌస్‌కు గానీ, దావత్‌లకు కాదన్నారు. లక్షల కోట్ల సంపాదన సీక్రెట్‌ తెలంగాణ ప్రజలకు చెప్తే రాజులవుతారన్నారు. గల్ఫ్‌లో బీఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమన్నారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం, భవిష్యత్‌ పాలన కోసం బీఎస్పీని గడప గడపకు తీసుకెళ్లాలని, దీనికి ప్రతి వ్యక్తి ఒక సైనికుల్లాగా పని చేయాలని పిలుపునిచ్చారు.