రోగులపై ‘బయో వ్యర్థాల’ భారం!

ABN , First Publish Date - 2020-10-22T06:56:04+05:30 IST

రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులపై ‘బయో వ్యర్థాల’ భారం పడనుంది. బిల్లుల్లో బయో వ్యర్థాల తొలగిం పు చార్జీలనూ కలపనున్నారు.

రోగులపై ‘బయో వ్యర్థాల’ భారం!

ఒక్కో పడకకు ఇప్పటి వరకు రూ.6.. తాజాగా రూ.250 చెల్లించాలంటున్న ఏజెన్సీలు

రోగుల బిల్లుల్లో వేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు

హైదరాబాద్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులపై ‘బయో వ్యర్థాల’ భారం పడనుంది. బిల్లుల్లో బయో వ్యర్థాల తొలగిం పు చార్జీలనూ కలపనున్నారు. ఇప్పటి దాకా ప్రైవేటు ఆస్పత్రుల్లో బయో వ్యర్థాల సేకరణకు ఒక్కో పడకకు నెలకు రూ.6 మాత్రమే వసూలు చేస్తుండగా, ఇప్పుడది ఏకంగా రూ.250 కు పెంచారు. అది కూడా ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా అన్ని పడకలకూ రూ.250 చొప్పున చెల్లించాల్సిందేనని, వాటిని సేకరించే ఏజెన్సీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ భారాన్ని కూడా రోగులపై వేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయి.


ఇప్పటికే కొన్ని ఆస్పత్రులు రోగుల బిల్లుల్లో బయో వేస్టేజ్‌ చార్జీలను వేస్తున్నాయి. ప్రతి ఆస్పత్రిలో రోగులకు సేవలందించే క్రమంలో వాడేసిన ఇంజక్షన్లు, సిరంజ్‌లు, ఇతర మెడికల్‌ వ్యర్థాలతో పాటు శస్త్రచికిత్స అనంతరం చాలా బయో మెడికల్‌ వ్యర్థాలు వస్తాయి. బయో వ్యర్థాలను డీకంపోజ్‌ చేసే ఏజెన్సీలతో ప్రతి ప్రైవేటు ఆస్పత్రి ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిబంధన ఉంది. ఆస్పత్రి నుంచి వచ్చే వ్యర్థాలకు ఒక్కో పడకకు చార్జీ నిర్ణయిస్తారు. ఆ లెక్కన ప్రతి ఆస్పత్రి రోగులతో సంబంధం లేకుండా పడకల లెక్కన బయో వ్యర్థాలకు డబ్బులు చెల్లిస్తాయి.


కరోనా వైరస్‌ విజృంభణ తర్వాత బయో మెడికల్‌ వ్యర్థాలను డీకంపోజ్‌ చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దీన్నే సాకుగా చూపి వ్యర్థాలు సేకరించే ఏజెన్సీలు ఒక్కసారిగా ధరలు పెంచేశాయి. ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం ప్రతి పడకకు కాకుండా రోగులున్న పడకలకే చెల్లిస్తామంటున్నాయి. చెత్త సేకరణను సర్కారే చేపట్టాలని కోరుతున్నాయి.  


ఈటల, రాజీవ్‌శర్మనూ కలిశాం

ఆస్పత్రుల్లో వ్యర్థాలు వదిలించుకోవడం మాకు భారంగా మారింది. ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా అన్ని పడకలకు రుసుము వసూలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో రూ.3 మాత్రమే వసూలు చేస్తుండగా, మా దగ్గర రూ.250 తీసుకుంటున్నారు. 500 పడకలున్న ఆస్పత్రికి బయో వ్యర్థాల బిల్లే నెలకు లక్షల్లో వస్తుంది. దీనిపై మంత్రి ఈటలతో పాటు ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మను కలిసి విజ్ఞప్తి చేశాం.

 - డాక్టర్‌ రాకేశ్‌, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌  ఆస్పత్రుల అసోసియేషన్‌ అధ్యక్షుడు 


Updated Date - 2020-10-22T06:56:04+05:30 IST