Advertisement
Advertisement
Abn logo
Advertisement

సొంతింటి నిర్మాణానికి ధరాభారం

రెండు నెలల్లో భారీగా పెరిగిన ముడిసరుకు ధరలు

బ్రాండెడ్‌ సిమెంట్‌ ధర రూ.70, 

ఐరన్‌ టన్నుకు రూ.14 వేలు 

విక్రయాలు తగ్గాయంటున్న వ్యాపారులు


కోదాడ: సామాన్యుడి సొంతింటి కల సాకారాని కి ధరల పెరుగుదల ప్రతిబంధకం అవుతోంది. రోజు రోజుకూ ఇంటి నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలతో ఇంటి నిర్మాణానికి ముందుకు అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలనే కోరిక ఉంటుం ది. ఆ దిశగా అడుగు వేద్దామంటే పెరుగుతున్న సిమెంట్‌, ఐరన్‌, ఇతర సామాగ్రి ధరలు వారి ఆశలను అడియాశలు చేస్తున్నాయి. బొగ్గు కొరతతో చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా అన్ని సిమెంట్‌ కంపెనీలు ధరలు పెంచాయి. అక్టోబరు లో ప్రధాన కంపెనీల సిమెంట్‌ బస్తా ధర రూ.310 ఉండేది. నవంబరు వచ్చే సరికి రూ.370కి చేరింది. సగటున ఒక్కో బస్తాపై రూ.60 పెరిగింది. జనవరి నాటికి బస్తా రూ.410 అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చిన్న సిమెంట్‌ కంపెనీల బస్తా ధర సైతం రూ.50 పెరిగింది. ఐరన్‌ రెండు నెలల కిం దట టన్ను రూ.58వేలు ఉంటే,ప్రస్తుతం రూ.72 వేలకు చేరింది. సగటున టన్నుకు రూ.14 వేలు పెరిగింది. డీజిల్‌ ధర పెరగడంతో అదేబాటలో పెయింటింగ్‌, కరెంట్‌ సామాన్లు 30 శాతం పెరిగాయి. రూ.6 ఉన్న ఇటుక ధర రూ.6.50 కాగా, రాడ్‌బైండింగ్‌, మోటారు ధరలు పెరిగాయి. ధరలు పెరగక ముందు రెండు నెల ల కిందట స్క్వేర్‌ ఫీట్‌కు రూ.1650 ఖర్చు అయ్యేది, పెరిగిన ధరలతో రూ.2000లకు అవుతోంది. దీంతో స్క్వేర్‌ఫీట్‌పై రూ.350 భారం పడింది. ఫలితంగా 200 గజాలలో ఇళ్లు కడితే, 1500 నుంచి 1600 స్క్వేర్‌ఫీట్లు వస్తుంది. దీంతో పెరిగిన ధరల ప్రకారం అదనంగా రూ.5.25 లక్షల భారం పడుతోంది. ఈ క్రమంలో కొత్త ఇళ్లు కట్టేందుకు ముందుకు రావడం లేదని గృహనిర్మాణదారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ధరలు పెరిగి విక్రయాల్లేక అల్లాడుతున్నామని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న విక్రయాలు ధరల పెరగడంతో విక్రయాల్లేక లేక దుకాణాల నిర్వహణ, వర్కర్లకు వేతనాలు ఇవ్వడం కూడా కష్టంగా మారిందన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని డీజిల్‌ ధరలు తగ్గించి, కొత్త నిర్మాణాలు జరిగేలా, సామాగ్రి విక్రయాలు పెరిగేలా చూడాలని దుకాణాలు కోరారు. 


రోజుకు రూ.42 లక్షల భారం 

జిల్లాలో చిన్నా, పెద్ద సిమెంట్‌ కంపెనీలు సుమారు 26ఉన్నట్లు సమాచారం. వాటి ద్వారా నెలకు సుమారు 40 టన్నుల సిమెంట్‌  ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఆయా కంపెనీలు జిల్లాలో ఉన్న సుమా రు 550 సిమెంట్‌ దుకాణాల ద్వారా సిమెంట్‌ అమ్మకాలు నిర్వహిస్తున్నాయి. నిత్యం ఆయా దుకాణాల ద్వారా 70 వేల నుంచి లక్ష బస్తాలు విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవంబరులో పెరిగిన ధరలతో పోలీస్తే రోజుకు  రూ.42 లక్షలు, నెలకు రూ.12.60 కోట్ల అదనపు భారం పడుతోంది. 


కిరాయిలు చెల్లించే పరిస్థితి లేదు : నువ్వల రామారావు, వ్యాపారి

ధరలు పెరగడంతో విక్రయాల్లేక లేక పెట్టిన పెట్టుబడి వడ్డీ కూడా రావడం లేదు. వ్యాపారం చేయటం కష్టంగా ఉంది.  వర్కర్ల జీతా లు, షాపుల కిరాయిలు కట్టలేకపోతున్నాం.


వ్యాపార నిర్వహణ కష్టంగా మారింది: ఎస్‌కె.మీరా,  సిమెంట్‌ వ్యాపారి, కోదాడ 

రోజుకు 150 బస్తాలు అమ్మేవాళ్లం. ఇప్పుడు ధరలు పెరగటంతో 30 నుంచి 40 బస్తాలు అమ్మితే అక్కడి కే సంతోషం. ధరలు పెరుగులపై అడిగేవారే లేరు. విక్రయాలు తగ్గాయి. దీంతో వ్యాపారం నిర్వహణ కష్టంగా మారింది. 


Advertisement
Advertisement