ఎరువు భారం

ABN , First Publish Date - 2022-01-14T04:25:43+05:30 IST

యాసంగిలో వరి పంట వేసేందుకు సిద్ధమైన రైతులకు ప్రభుత్వం వరి పంట వద్దని ప్రత్యామ్నాయ పంటవైపు మొగ్గు చూపాలని సూచించడంతో రైతు అసలు పంట వేయాలా.. వద్దా.. అనే ఆలోచనలో పడిపోయాడు. కొందరు భూమిని ఖాళీగా ఉంచడం ఎందుకని తమకు నచ్చిన పంటలను సాగు చేస్తుండడంతో మళ్లీ ఎరువుల రూపంలో కష్టాలు ఎదురొస్తున్నాయి.

ఎరువు భారం

- అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులు

- మండలాల్లో జోరుగా జీరో దందా

- పట్టించుకోని విజిలెన్స్‌, వ్యవసాయశాఖ


కామారెడ్డి, జనవరి 13: యాసంగిలో వరి పంట వేసేందుకు సిద్ధమైన రైతులకు ప్రభుత్వం వరి పంట వద్దని ప్రత్యామ్నాయ పంటవైపు మొగ్గు చూపాలని సూచించడంతో రైతు అసలు పంట వేయాలా.. వద్దా.. అనే ఆలోచనలో పడిపోయాడు. కొందరు భూమిని ఖాళీగా ఉంచడం ఎందుకని తమకు నచ్చిన పంటలను సాగు చేస్తుండడంతో మళ్లీ ఎరువుల రూపంలో కష్టాలు ఎదురొస్తున్నాయి. పెట్టుబడికి, ఆదాయానికి పొంతన లేని స్థితిలో సేద్యం ఉందని రైతులు వాపోతున్నారు.  వ్యాపారుల అదనపు వసూళ్లతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. యాసంగి సాగు ముమ్మరం కావడంతో వ్యాపారులు రైతుల నుంచి అందినంతా దండుకుంటున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని మండలాల్లో జీరోదందా చేస్తున్నా వ్యవసాయశాఖ, విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించడం లేదనే వాదన వినిపిస్తోంది.

పలు మండలాల్లో జోరందుకున్న సాగు

ప్రభుత్వం వరి పంట వద్దని చెప్పినా కొందరు ఆరుతడి భూమి లేక మళ్లీ వరి వైపే మొగ్గు చూపుతున్నారు. మరికొందరు పత్తి, చెరుకు, మొక్కజొన్న తదితర ఆరుతడి పంటలను సాగు చేస్తున్నారు. ఈ పంటలకు ఖచ్చితంగా యూరియా అవసరం కావడంతో డిమాండ్‌ పెరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తగ్గించడంతో ఆయా ఎరువుల కంపెనీలు కంప్లెక్స్‌ ఎరువులు, పొటాష్‌ ధరలను పెంచడం రైతులకు భారంగా మారింది. వాటికి బదులు డీఏపీ ఎరువు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కాంప్లెక్స్‌ ఎరువు పాత స్టాక్‌ ఉన్నప్పటికీ ఆ స్టాకును వ్యాపారులు ధరలు పెరిగాయని చెబుతూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నారు. మరోవైపు రైతులకు అవసరం లేని ఎరువులను సైతం బలవంతంగా అంటగడుతున్నారని తెలుస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతులు ఎరువులను కొనుగోలు చేయకతప్పడం లేదు. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్న అన్నదాతలకు ఇది అదనపు భారం అవుతోంది.

కానరాని నిబంధనలు

అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎరువుల వ్యాపారుల్లో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. జిల్లాలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో సిండికేట్‌ దందా ప్రారంభించి రైతులను నిలుపుదోపిడీ చేస్తున్నారు. ప్రతీ షాపులో ఖచ్చితంగా ఎరువుల ధరల పట్టికను ప్రదర్శించాలి. షాపులో ఉన్న స్టాక్‌ వివరాలు, ధరలు తెలియజేయాలి. కానీ చాలా షాపుల్లో అటువంటి బోర్డులు కానరావడం లేదు. అలాగే రైతులు కొన్న ప్రతీ ఎరువు బస్తాకు రశీదు ఇవ్వాలి. అయినా పలుచోట్ల ఇవ్వడం లేదు. కొందరు ఇచ్చినా ఏదో తెల్లకాగితం మీద నామమాత్రంగా రాసి ఇస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే ఆయా దుకాణాలపై వ్యవసాయశాఖ దృష్టిపెట్టి రైతులను దోచుకుంటున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం

- భాగ్యలక్ష్మీ, జిల్లా వ్యవసాయాధికారి, కామారెడ్డి

దుకాణాల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయించినా.. అక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక సహకార సంఘాల్లో రైతులకు కావాల్సిన నిల్వలు ఉన్నాయి. అక్కడే రైతులు కొనుగోలు చేసి అధికారుల సూచనల మేరకు మోతాదులో వాడుకోవాలి. ఎమ్మార్పీ చూసుకుని కొనుగోలు చేయాలి.

Updated Date - 2022-01-14T04:25:43+05:30 IST