కేసీఆర్‌ పాలనలో దూసుకుపోతున్న రాష్ట్రం: ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2022-03-10T07:40:49+05:30 IST

‘సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగింది’ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

కేసీఆర్‌ పాలనలో దూసుకుపోతున్న రాష్ట్రం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోంది. ఆర్థిక శక్తిగా తెలంగాణ ఎదిగింది’ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కేసీఆర్‌ ప్రజాసంక్షేమ పాలనా విధానాలు తెలంగాణ రాష్ర్టాన్ని, ప్రజలను సామాజిక ఉన్నతికి చేర్చడంలో కీలకంగా మారుతున్నాయన్నారు. ఇవాళ ప్రపంచం అంతా తెలంగాణను పెట్టుబడులకు, వ్యాపారాలకు తగిన కేంద్రంగా చూస్తోందని చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్రం తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోందని, స్టార్టప్‌ లకు అత్యంత అనువైన విధానాలు అందుబాటులో ఉన్నాయని కవిత బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘కేసీఆర్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలు రాష్ట్రంలో 82 లక్షల మందికి తోడ్పాటు అందిస్తున్నాయి. ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, క్షురకులు, రజకులకు ఉచిత విద్యుత్తు వంటి పథకాలు చేయూతనిస్తున్నాయి. తెలంగాణ బడ్జెట్‌ ఇతర రాష్ర్టాల బడ్జెట్‌ను దాటిపోయింది. 2014-15లో సంక్షేమ పథకాల కేటాయింపులు రూ.15,750 కోట్లు ఉంటే.. 2021-22 నాటికి అది రూ.54,054 కోట్లకు చేరుకుంది’’ అని వివరించారు. దార్శనికత ద్వారా తెలంగాణను స్వయం సమృద్ధ రాష్ట్రంగా మార్చే క్రమంలో సీఎం కేసీఆర్‌ సరైన పంథాను అనుసరించారన్నారు. తెలంగాణ అభివృద్ధి గాథ, పనితనం.. సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనమని కవిత పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-10T07:40:49+05:30 IST