ఐటీ కంపెనీల ‘క్యాంపస్‌’ బాట

ABN , First Publish Date - 2021-04-18T05:49:57+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో

ఐటీ కంపెనీల ‘క్యాంపస్‌’ బాట

 2021-22లో 90 వేల ఉద్యోగాలు

 హైదరాబాద్‌లో 30 వేల కొలువులు

ఫ్రెషర్ల  నియామకానికి బడా  కంపెనీల సన్నాహాలు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ దిగ్గజ సంస్థలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో తదితర పెద్ద కంపెనీలు భారీగా ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇటీవలి కాలం లో ఐటీ సంస్థలకు కొత్త కాంట్రాక్టులు వస్తుండటంతో డిమాండ్‌ తగ్గట్టుగా నియామకాలు చేపట్టేందుకు కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఐటీ సంస్థలు.. మళ్లీ క్యాంపస్‌ బాట పట్టేందుకు రెడీ అవుతున్నా యి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఐటీ కంపెనీలు దాదాపు 92 వేల మందిని నియమించుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలకు ఖాతాదారుల నుంచి పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభిస్తున్నాయి.  గత రెండు త్రైమాసికాల్లో 10 కోట్ల డాలర్లు మించిన కాంట్రాక్టులు మూడు,నాలుగు లభించాయి.

\

100 కోట్ల డాలర్లకు మించిన కాంట్రాక్టు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల జర్మనీ ఆటోమోటివ్‌ కంపెనీ దైమ్లర్‌ నుంచి ఇన్ఫోసి్‌సకు భారీ ఆర్డరు లభించింది. ఫ్రుడెన్షియల్‌ ఫైనాన్షియల్‌ నుంచి టీసీఎ్‌సకు పెద్ద కాంట్రాక్టు దక్కింది. జర్మనీకే చెందిన రిటైలర్‌ మెట్రో నుంచి విప్రో మంచి ప్రాజెక్టును పొందిందని.. దీంతోపాటు వీసా అంశాలు మొదలైనవి ఫ్రెషర్ల నియామకాలకు పురిగొల్పుతున్నాయని అంటున్నారు.


కొవిడ్‌ మహమ్మారి డిజిటలీకరణ వేగాన్ని పెంచింది. ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరగడం.. వ్యయాలను తగ్గించుకోడానికి కంపెనీలు చేపడుతున్న డిజిటలీకరణ కూడా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు కలిసి వస్తోందని హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు త్రైమాసికాలు వృద్ధి వేగం తక్కువగా ఉన్నా.. తర్వాతి రెండు త్రైమాసికాల్లో దేశీయ ఐటీ పరిశ్రమ ఊపందుకునే వీలుందని అభిప్రాయపడ్డారు. 


 దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ 2021-22 ఏడాదికి దాదాపు 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని భావిస్తోంది. గత ఏడాది స్థాయిలోనే ఈ ఏడాది కూడా ఫ్రెషర్ల నియామకాలు ఉంటాయని టీసీఎస్‌ వెల్లడించింది.


 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 26,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఇందులో 24 వేల మందిని భారత్‌లో,  2,000 మందిని విదేశాల్లో నియమించుకోవాలని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 21,000 మంది ఫ్రెషర్లకు అవకాశం ఇచ్చింది. వీరిలో 19,000 మందిని దేశీయంగా నియమించింది. ఫ్రెషర్లు కాకుండా మార్కెట్‌ నుంచి అనుభవం ఉన్న నిపుణులను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. 


 హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 15,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. విదేశాల్లో మరో 2,000 మందిని తీసుకోనుంది. 


 విప్రో దాదాపు 10,000 మంది ఫ్రెషర్లను నియమించుకునే వీలుంది. 




కొత్త టెక్నాలజీల  ఒరవడి..


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ దాదాపు 30,000కు పైగా నిపుణులను నియమించుకునే వీలుందని అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధ, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్యాలు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వచ్చే దశాబ్ద కాలంలో  మొత్తం ఉద్యోగుల్లో డిజిటల్‌ టెక్నాలజీల నిపుణులు 60 శాతం వరకూ ఉండగలరని  హైసియా  ప్రెసిడెంట్‌ భరణీ అరోల్‌ తెలిపారు. 2020-21లో తెలంగాణ ఐటీ పరిశ్రమ 20 వేల ఉద్యోగాలు కల్పించింది. 




 అనుభవం ఉన్న వారి కోసం..


క్లౌడ్‌, డేటా సెక్యూరిటీ, కృత్రిమ మేధ వంటి కొత్త టెక్నాలజీల్లో అనుభవం ఉన్న నిపుణుల నియామకాలపై కూడా కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. కొత్త అవకాశాలు రావడంతో ఉన్న వారు బయటకు వెళ్లిపోవడంతో అనుభవం ఉన్న కీలక నిపుణుల కోసం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఇన్ఫోసి్‌సలో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉద్యోగుల వలస రేటు 15.2 శాతానికి చేరింది. విప్రోలో 12.1 శాతం ఉంది. ఒక్క టీసీఎ్‌సలో మాత్రమే తక్కువగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వలసల రేటు 7.2 శాతమే ఉందని టీసీఎస్‌ వెల్లడించింది. 


Updated Date - 2021-04-18T05:49:57+05:30 IST