జనవరి 31న బడులు తెరిచి తీరుతాం

ABN , First Publish Date - 2022-01-19T08:53:38+05:30 IST

ప్రభుత్వం అనుమతించినా.. లేకున్నా జనవరి 31 నుంచి పాఠశాలలు రీఓపెన్‌ చేస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) మంగళవారం ప్రకటించింది. ] ప్రభుత్వం అనుమతించినా.. లేకున్నా జనవరి 31 నుంచి పాఠశాలలు రీఓపెన్‌ చేస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) మంగళవారం ప్రకటించింది.

జనవరి 31న బడులు తెరిచి తీరుతాం

  • ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా ఆగం
  • మే చివరి దాకా విద్యా సంవత్సరాన్ని పొడిగించాలి
  • తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌
  • ఈ నెల 30 దాకా ఆన్‌లైన్‌లో డిగ్రీ క్లాసులు!


హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుమతించినా.. లేకున్నా జనవరి 31 నుంచి పాఠశాలలు రీఓపెన్‌ చేస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ట్రస్మా) మంగళవారం ప్రకటించింది. తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకుని, కొవిడ్‌ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తూ తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. హైదరాబాద్‌, సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా.. విద్యా సంస్థలను మూసివేసిన ప్రభుత్వం పిల్లల భవిష్యత్‌తో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి పొందుతున్నారని, కరోనా కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉపాధి కోల్పోయి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


మార్కెట్లు, సినిమా థియేటర్లు, మాల్స్‌, వైన్స్‌, బార్ల నిర్వహణకు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. పాఠశాలను బంద్‌ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. లక్షల సంఖ్యలో కేసులున్నా అమెరికా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌ తదితర దేశాల్లో పాఠశాలలు మూసివేయలేదని, కానీ తెలంగాణలో బంద్‌ చేయడం బాధాకరమన్నారు. కరోనా వల్ల సరిగ్గా తరగతులు జరగక చాలా మంది పిల్లలు ఇప్పటికే వెనకబడిపోయారని తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుగ్గా సాగుతున్న తరుణంలో ఒమైక్రాన్‌పై భయాందోళనకు గురికావద్దని తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని జనవరి 30 తర్వాత పాఠశాలలను తెరిపించాలని ప్రభుత్వాన్ని  కోరారు. అదే విధంగా ఈ ఏడాది మే చివరి వరకు విద్యా సంవత్సరాన్ని పొడిగించాలన్నారు. కాగా, రాజకీయ ప్రయోజనం కోస మే ప్రభుత్వం పాఠశాలల సెలవులు పొడిగించిందని ట్రస్మా రాష్ట్ట్ర ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్‌ ఆరోపించారు. ఈ సమావేశంలో ట్రస్మా మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు యాదగిరి, రఘు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T08:53:38+05:30 IST