ఎమ్మెల్యే వత్తిడితోనే కేసు

ABN , First Publish Date - 2022-01-23T05:24:19+05:30 IST

కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు నారాయణ యాదవ్‌పై కేసు నమోదు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రధానంగా అధికారపార్టీని ఈ వ్యవహారం కుదిపేస్తోంది. కేసు నమోదు వెనుక ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్‌యాదవ్‌ పాత్ర ఉందని జడ్పీటీసీ ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ కుమారుడైన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫోన్‌ చేసినా ఎమ్మెల్యే ససేమిరా అన్నట్లు సమాచారం.

ఎమ్మెల్యే వత్తిడితోనే కేసు
జడ్పీటీసీ సభ్యుడు నారాయణ యాదవ్‌

మంత్రి బాలినేని, బూచేపల్లికి ఫిర్యాదు చేసిన జడ్పీటీసీ

ఆ ఇద్దరు నేతలు పోన్‌  చేసినా ససేమిరా అన్న ఎమ్మెల్యే బుర్రా

జడ్పీటిసీ సభ్యుడి అరెస్టుకు పోలీసులపై వత్తిడి

ఆర్ధిక లావాదేవీలు, బలపడతాడనే అనుమానాలే అసలు కారణాలు

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు నారాయణ యాదవ్‌పై కేసు నమోదు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ప్రధానంగా అధికారపార్టీని ఈ వ్యవహారం కుదిపేస్తోంది. కేసు నమోదు వెనుక ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్‌యాదవ్‌ పాత్ర ఉందని జడ్పీటీసీ ఆరోపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వెంకాయమ్మ కుమారుడైన మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఫోన్‌ చేసినా ఎమ్మెల్యే ససేమిరా అన్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత కందుకూరు డీఎస్పీ ఆఫీస్‌ నుంచి కనిగిరి పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసి జడ్పీటీసీపై నమోదైన కేసు ఎఫ్‌ఐఆర్‌ పంపాలని వత్తిడి తేవటం విశేషం. వివరాల్లోకి వెళితే.. పన్నెండేళ్ల క్రితం ఒక స్థలాన్ని నారాయణ యాదవ్‌ కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా రు.14 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్థలం రిజిస్టేషన్‌ తర్వాత ఇస్తానని అధికారికంగా ఒప్పందం చేసుకున్నాడు. అప్పట్లో ఆ స్థలం అచ్చుత విజయలక్ష్మీ పేరుతో ఉంది. ఆమె భర్త ఒంకార్‌గుప్తా ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఆ స్థలం వారి పేరుతో రిజిష్టరు అయినప్పటికీ ఆన్‌లైన్‌ కాకపోవటంతో అయిన తర్వాత డబ్బులు ఇస్తానని నారాయణయాదవ్‌ అన్నారు. ఆ ప్రకారం కొంతకాలం క్రితం ఒంకార్‌గుప్తా పేరుపై ఆ స్థలాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కించారు. ఇది జరిగిన తర్వాత ఒంకార్‌గుప్తా మృతిచెందటంతో తిరిగి విజయలక్ష్మీ పేరు మీద ఆన్‌లైన్‌ చేయించాల్సిన అవసరం వచ్చింది. ఆ తంతు ఇటీవల ముగిసింది. దీంతో తిరిగి వారి మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. తదనుగుణంగా వడ్డీతో సహా తిరిగి డబ్బులు ఇస్తానని వారికి చెప్పినట్లు నారాయణయాదవ్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. సంక్రాంతి రోజున వారికి ఫోన్‌ చేసి మీరు కనిగిరి వస్తే లావాదేవీలు పూర్తిచేసుకుందామని చెప్పినట్లు జడ్పీటీసీ తెలిపారు. ఇది జరుగుతుండగానే నారాయణయాదవ్‌పై రెండురోజుల క్రితం కనిగిరి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు.

తెరవెనుక తంతు ఇది

ఈ నేపఽథ్యంలో నారాయణయాదవ్‌ స్థానిక పార్టీ నాయకులతో పాటు మంత్రి బాలినేని, అలాగే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిలకు ఫోన్‌ చేసి తనపై కావాలనే ఎమ్మెల్యే కేసు నమోదు చేయించారని మీరు జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. ఆ వెంటనే ఆ ఇద్దరు నాయకులు విడివిడిగా ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి అసలు ఏం జరిగిందని ప్రశ్నించినట్లు తెలిసింది. పార్టీకి చెందిన జడ్పీటీసీపై కేసు నమోదు సరైన పద్ధతి కాదని వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ గట్టిగా సూచించినట్లు తెలిసింది. వారి సూచనను సున్నితంగా తిరస్కరించిన ఎమ్మెల్యే బుర్రా జడ్పీటీసీ చాలామందిని ఆర్థికంగా దెబ్బతీస్తూ చీటింగ్‌కు పాల్పడినట్లు చెప్పినట్లు తెలుస్తుంది. ఇటు మంతి బాలినేని అటు బూచేపల్లి ఇద్దరు ఫోన్‌ చేసిన తర్వాత కూడా జడ్పీటీసీపై కేసు నమోదు చేశారా..? చేస్తే వెంటనే ఎప్‌ఐఆర్‌ పంపాలంటూ డీఎస్పీ ఆఫీస్‌ నుంచి కనిగిరి ఎస్సైకి పదేపదే ఫోన్లు వచ్చినట్లు తెలిసింది. తదనంతరం కేసు నమోదు చేసి గురువారం సాయంత్రానికి ఎఫ్‌ఐఆర్‌ కాపీ డీఎస్పీ కార్యాలయానికి పంపినట్లు తెలుస్తుంది.

ఆసలేం జరిగింది..

దీంతో ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా ఉన్న నారాయణయాదవ్‌పైనే కేసు నమోదు కావటంతో తెరవెనుక అసలేం జరిగింది అనే అంశంపై ఆ పార్టీ నాయకులతో పాటు ప్రజలు దృష్టిసారించారు. 2014 నుంచి ఎమ్మెల్యే బుర్రాకు అనుచరుడిగా రియల్‌ వ్యాపారిగా నారాయణ ఉన్నారు. ఆరంభం రోజుల్లో అతని స్థలంలోనే బుర్రా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి నడిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీగానూ రంగంలోకి దింపారు. అయితే ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు చోటుచేసుకున్నాయి. తనను గౌరవించటం లేదు కనీసం మర్యాద కూడా ఇవ్వటం లేదని పరోక్ష్యంగా ఎమ్మెల్యేపై జడ్పీటీసీ ఆరోపణలు చేయటం ఆరంభించారు. ఇటీవల హెచ్‌ఎంపాడు రెండో ఎంపీపీ ఎంపిక సందర్భంగా తనను పరిగణనలోకి తీసుకోకపోగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వనించలేదని నారాయణయాదవ్‌ బహిరంగంగా విచారం వ్యక్తం చేశారు. అందులో ఎమ్మెల్యేను పరోక్ష్యంగా విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. అప్పటి నుంచి వారి మధ్య మరింత దూరం పెరిగింది. కాగా కొంతకాలం క్రితం ఎమ్మెల్యే అవసరాలకు తాను అప్పుగా డబ్బులు ఇచ్చానని జడ్పీటీసీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందులో రూ.20లక్షల కింద బెంగళూర్‌లో ఒకఅపార్ట్‌మెంట్‌ తీసుకున్నానని ఇంకా రూ.60లక్షలు తనకు రావాల్సి ఉందని నారాయణయాదవ్‌ చెప్పినట్లు తెలిసింది. ఈ విషయమై ఆంధ్రజ్యోతి నారాయణయాదవ్‌ను ప్రశ్నించగా అవసరమైనప్పుడు ఎమ్మెల్యేకు డబ్బులు తాను ఇవ్వటమే కాక మరికొందరితో ఇప్పించానని అంగీకరించారు. అయితే ప్రస్తుతం తనపై కేసు నమోదు రాజకీయ వత్తిడితోనే జరిగిందని చెప్పారు. రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఒర్వలేక సొంత సామాజికవర్గం అని కూడా చూడకుండా తనపై కేసు పెట్టించేందుకు ఎమ్మెల్యే తోడ్పాడ్డాడనే అనుమానం ఉందన్నారు. భూయజమానులతో తనకు ఎలాంటి విభేదాలు లేవని వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న విషయం వారికి చెప్పానని, అయినా తనపై వారు కేసు పెట్టారంటే కారణం ఎంటో అర్థం చేసుకోవచ్చన్నారు. 


Updated Date - 2022-01-23T05:24:19+05:30 IST