Abn logo
Sep 24 2021 @ 00:26AM

ధాన్యం కొనుగోలుకు డబ్బులు ఇచ్చేది కేంద్రమే

హుజూరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

- మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, సెప్టెంబరు 23: ఐకేపీ సెంటర్లలో కొనుగోలు చేసే ప్రతి గింజకు డబ్బులు కేంద్రమే ఇస్తుందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐకేపీ సెంటర్లలో ట్రాన్స్‌పోర్ట్‌, హమాలీ, మిల్లింగ్‌కు డబ్బులు కేంద్రమే పంపుతుందన్నారు. తనను ఓడించేందుకు హుజూరాబాద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు మోహరించారని, ప్రజాస్వామ్యం అపహస్య చేసేలా చర్యలు చేపడుతున్నారన్నారు. నా మొహం అసెంబ్లీలో కనిపించవద్దని, కేసీఆర్‌ పరిపాలన పక్కన పెట్టి మరీ కుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కి కలలో కూడా హుజూరాబాద్‌ కనిపిస్తోందని, ఆయన కుట్రలు రచిస్తే మంత్రి హరీష్‌రావు అమలు చేస్తున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు దావత్‌లు ఇచ్చి వారే వడ్డించి, మందు పోస్తున్నారన్నారు. నాయకులు కొనుగోళ్లకి 200 కోట్లు ఖర్చుపెట్టారని, ఒక్కరు కూడా ఈటలతో ఉండొద్దని కొనుగోళ్లు చేస్తున్నారన్నారు. అన్ని సంఘాలకు భవనాలు, గుడులు కట్టిస్తా అని జీవోలు ఇస్తున్నారని, అవన్నీ ఓడిపోతామనే భయంతో ఇస్తున్నారన్నారు. దళితుల మీద ప్రేమతో దళితబంధు రాలేదని,  ఓట్ల మీద ప్రేమతోనే వచ్చిందని, నిజంగా ప్రేమ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు ఎందుకు  అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో నాలుగు వేల కోట్లు ఫీజు రీ యింబర్స్‌మెంట్‌ బకాయి ఉందని, 57ఏళ్ల లోపు పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని, రైతు రుణమాఫీని ఎందుకు వాయిదా వేస్తున్నారని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ ప్రజలకు అన్ని తెలుసని, ఇచ్చేవి అన్నీ తీసుకుని కర్రు కాల్చి వాత పెడుతారన్నారు. ఇక్కడ తిరిగే ఎమ్మెల్యేలను మీకు సిగ్గుందా అని వారి నియోజకవర్గ ప్రజలు అడుగుతున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. పింఛన్లకే డబ్బులు లేవని, ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యిందన్నారు. చివరికి చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతారన్నారు. హరీష్‌ ఇక్కడ కుట్రలో భాగస్వామ్యమయ్యారు తప్ప ఆర్థిక శాఖ ఎటు పోయిందనే విషయం పట్టించుకోవడం లేదన్నారు. కాళిమాత అని ప్రకటించుకున్న ఇందిరాగాంధీని, నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది అన్న ఎన్టీఆర్‌నే ప్రజలు ఓడించారన్నారు. వీరికి కూడా అదే గతి పడుతుందన్నారు. రేషన్‌ బియ్యానికి పదివేల కోట్లు ఖర్చయితే ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్రమే ఇస్తుందన్నారు. హుజూరాబాద్‌లో రెండు గుంటలు ఉన్నవారికి, 200 ఎకరాలు ఉన్న వారికి జరుగుతున్న ఎన్నికలని అంటున్నారని, రెండు గుంటలు ఉన్న వ్యక్తి 200 కోట్లు పెట్టి నాయకులను ఎలా కొన్నారన్నారు. రెండు గుంటలు అమ్మితే లక్ష రూపాయలు వస్తాయేమో.. వాటితో ఒక్క హోర్డింగ్‌ పెట్టొచ్చేమో.. మరి ఎలా ఇంత ఖర్చు పెడుతున్నారో హరీష్‌రావు సమాధానం చెప్పాలన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, తుల ఉమ, రాములకుమార్‌, గంగిశెట్టి ప్రభాకర్‌, ముత్యంరావు, నేరెళ్ల మహేందర్‌గౌడ్‌, బింగి కరుణాకర్‌, తూర్పాటి రాజు, సాంబయ్య, సురేందర్‌రెడ్డి, ఎస్‌ శ్రీనివాస్‌, మహిపాల్‌ తదితరులు పాల్గొన్నారు.